వైద్య విద్యార్థి ఆత్మహత్య కేసులో ఇద్దరు ప్రొఫెసర్ల సస్పెన్షన్‌ | - | Sakshi
Sakshi News home page

వైద్య విద్యార్థి ఆత్మహత్య కేసులో ఇద్దరు ప్రొఫెసర్ల సస్పెన్షన్‌

Sep 19 2026 5:56 AM | Updated on Sep 19 2026 5:56 AM

కొరుక్కుపేట : వైద్య విద్యార్థి ఆత్మహత్య కేసులో ఇద్దరు ప్రొఫెసర్లను సస్పెండ్‌ చేశారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని కడప జిల్లాకు చెందిన మునగల నికిల్‌ రెడ్డి (28) కేలంబాక్కంలోని ఒక ప్రైవేట్‌ వైద్య కళాశాలలో పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ వైద్య విద్య చివరి సంవత్సరం చదువుతున్నాడు. ఆసుపత్రి పక్కన అద్దెకు తీసుకున్న ఒక ప్రైవేట్‌ అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నాడు. ఈ నెల 10వ తేదీ పరీక్ష ఫలితాలు వెలువడ్డాయి. అతను రెండు సబ్జెక్టులలో ఫెయిల్‌ అయినట్లు వెల్లడైంది. 11వ తేదీన అతను తన అపార్ట్‌మెంట్‌ భవనంలోని 14వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. సీనియర్‌ వైద్య విద్యార్థి ఆత్మహత్యపై వైద్య కళాశాల విచారణ జరిపింది. తదనంతరం, విద్యార్థి పురోగతికి సంబంధించి సరైన అవగాహన, సంప్రదింపులు లేకుండా వ్యవహరించారనే ఆరోపణలపై మెడికల్‌ కాలేజీలో పనిచేస్తున్న ఇద్దరు ప్రొఫెసర్లను సస్పెండ్‌ చేయాలని విశ్వవిద్యాలయ యాజమాన్యం ఆదేశించింది.

నేడు చైన్నెలో

డీఎంకే ముప్పెరుం విళా

సాక్షి, చైన్నె : వాయిదా పడిన డీఎంకే ముప్పెరుం విళా కార్యక్రమం శనివారం ఆ పార్టీ అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌ నేతృత్వంలో జరగనుంది. అన్నా అరివాలయం వేదికగా శనివారం సాయంత్రం 5 గంటలకు ఈ వేడుక ప్రారంభం కానుంది. డీఎంకే ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం సెప్టెంబర్‌లో అన్నా, పెరియార్‌ జయంతి, పార్టీ ఆవిర్భావ వేడుకలను ముప్పెరుం విళాగా నిర్వహిస్తున్నారు. ఈ మేరకు ఈ నెల 15వ తేదీన వేడుకకు ఏర్పాట్లు చేసినా హఠాత్తుగా స్టాలిన్‌ జ్వరం బారిన పడడంతో వాయిదా వేశారు. ప్రస్తుతం స్టాలిన్‌ కోలుకోవడంతో ముప్పెరుం విళాకు ఏర్పాట్లు చేపట్టారు. ఇందులో పార్టీ కోసం విశేషంగా సేవలందించిన సీనియర్‌ కార్యకర్తలకు పురస్కారాలు అందించనున్నారు.

విచారణకు అన్బిల్‌ మహేష్‌!

సాక్షి, చైన్నె : డీఎంకే నేత, మాజీ మంత్రి అన్బిల్‌ మహేష్‌ శుక్రవారం చైన్నె సెంట్రల్‌ క్రైమ్‌ బ్రాంచ్‌ విచారణకు హాజరయ్యారు. ఆయన గత ప్రభుత్వంలో పాఠశాల విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. ఆ సమయంలో నిధుల వసూలు, మనీలాండరింగ్‌కు సంబంధించి రూ.100 కోట్ల కుంభకోణం జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ కేసులో గతంలో ముగ్గురు అరెస్టయ్యారు. తాజా ఈ కేసుకు సంబంధించి చైన్నె, తిరుచ్చిలోని ఆరుచోట్ల రెండు రోజుల క్రితం సెంట్రల్‌ క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు సోదాలు జరిపి అన్బిల్‌ మహేష్‌కు సమన్లు జారీ చేశారు. ఈ క్రమంలో ఆయన శనివారం ఉదయం చైన్నె వెప్పేరిలోని పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయంలోని సెంట్రల్‌ క్రైమ్‌ బ్రాంచ్‌ ఎదుట అన్బిల్‌ మహేష్‌ తన న్యాయవాదులతో కలిసి హాజరయ్యారు. పోలీసులు ఆయనను రెండు గంటలకు పైగా విచారించారు. విచారించి, డిజిటల్‌ పత్రాలు, సాక్ష్యాల ఆధారంగా వాంగ్మూలం నమోదు చేశారు. ఈ కేసు దర్యాప్తును త్వరగా పూర్తి చేసి తగు చర్యలు తీసుకుంటామని పోలీసులు పేర్కొన్నారు. తన వైపు ఎలాంటి తప్పు లేదని, పోలీసులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు, వివరణలు ఇచ్చినట్టు అన్బిల్‌ మహేష్‌ పేర్కొన్నారు. చట్టపరంగా కేసును ఎదుర్కొంటానన్నారు.

వచ్చే నెలలో

కోవై వేదికగా ట్రాక్‌ డే

సాక్షి, చైన్నె : కోయంబత్తూరులోని ప్రముఖ మోటార్‌ స్పోర్ట్స్‌ డ్రైవర్‌ శిక్షణ కేంద్రమైన సీఓఏఎస్‌టీటీ రేస్‌ట్రాక్‌లో ట్రాక్‌ డే నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా అక్టోబర్‌ 10, 11 తేదీల్లో వోక్స్‌ వ్యాగన్‌ ఇండియా తన మొట్టమొదటి పర్ఫార్మెన్స్‌ కార్‌ కమ్యూనిటీ వీకెండ్‌ను నిర్వహించనుంది. వోక్స్‌ వ్యాగన్‌ పోర్ట్‌ ఫోలియోలోని డ్రైవింగ్‌ ఉత్సాహాన్ని ఇష్టపడే వినియోగదారులను ఒక్కచోట చేర్చి, జర్మన్‌ ఇంజినీరింగ్‌ పటిష్టతను, వేగాన్ని, అడ్రినాలిన్‌ అనుభూతిని అందించేందుకు ఈ వేదికను ఎంపిక చేశారు. ఇందులో గోల్ఫ్‌ జీటీఐ, టిగువాన్‌, టెరాన్‌, వర్టస్‌, టైగున్‌ వంటి కార్ల యజమానులు, ఆటోమోటివ్‌ నిపుణులు పాల్గొననున్నారు. రేస్‌ట్రాక్‌పై, బయట నిపుణుల మార్గదర్శకత్వంలో డ్రైవింగ్‌ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి లీడ్‌–అండ్‌–ఫాలో సెషన్‌లు, ఆటోక్రాస్‌ ఛాలెంజెస్‌, స్లాలమ్‌ వ్యాయామాలు, ఆఫ్‌–రోడ్‌ అడ్డంకులు దాటడం, గో–కార్టింగ్‌ వంటి అనేక ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ట్రాక్‌ అనుభవాలతో పాటు సాంకేతిక మాస్టర్‌క్లాస్‌లు, ఓనర్‌ నెట్‌వర్కింగ్‌ సెషన్‌లు మరియు కుటుంబాలతో కలిసి ఆస్వాదించే జీవనశైలి కార్యక్రమాలు ఈ రెండు రోజుల వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. కస్టమర్లతో బ్రాండ్‌కు ఉన్న అనుబంధాన్ని మరింత బలపరచడానికి ఈ కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుందని వోక్స్‌ వ్యాగన్‌ ఇండియా తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement