● చైన్నెలో ఘనంగా దీపారాధన కార్యక్రమం
సాక్షి, చైన్నె : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజా సేవను పురస్కరించుకుని, ఆయన జన్మదినాన్ని చైన్నెలోని డీడీ తమిళ్ టెలివిజన్ కాంప్లెక్స్‌లో ప్రత్యేక దీపారాధన కార్యక్రమం నిర్వహించారు. ప్రజల జీవితాలను సుసంపన్నం చేసిన ప్రధానికి అభినందనలు తెలుపుతూ అందరూ కలిసి దీపాలు వెలిగించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర సమాచార, ప్రసార శాఖ సహాయ మంత్రి ఎల్.మురుగన్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా, ఆ తర్వాత దేశ ప్రధానమంత్రిగా 25 ఏళ్లుగా నిస్వార్థ ప్రజా సేవను కొనసాగిస్తున్నారని ఎల్.మురుగన్ ప్రశంసించారు. గుజరాత్‌లో మోదీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు అక్కడ సబర్మతి నది కూడా చైన్నెలోని కూవం నదిలాగే ఉండేదని తెలిపారు. ఆయన తీసుకున్న సాహసోపేత నిర్ణయాల వల్ల నేడు సబర్మతి పూర్తిగా మారిపోయిందని తెలిపారు. అలాగే నర్మదా నది నీటిని ప్రవహింపజేసి గుజరాత్‌ను సంపన్న రాష్ట్రంగా మార్చడమే కాకుండా, దేశవ్యాప్తంగా సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేశారని పేర్కొన్నారు.
2047 నాటికి వికసిత్ భారత్
అబ్దుల్ కలాం కలలు కన్నట్లు 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చే లక్ష్యంతో మోదీ పనిచేస్తున్నారని ఎల్.మురుగన్ తెలిపారు. 2047లో కూడా ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో ప్రధానమంత్రిగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్‌నాగేంద్రన్, మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తదితర నేతలు పాల్గొన్నారు.


