నార్వేలో సత్తా చాటిన ఐఐటీ మద్రాస్‌ | - | Sakshi
Sakshi News home page

నార్వేలో సత్తా చాటిన ఐఐటీ మద్రాస్‌

Sep 19 2026 5:56 AM | Updated on Sep 19 2026 5:56 AM

● గ్లోబల్‌ జ్యోర్డ్‌ ఛాలెంజ్‌ విజేతగా టీమ్‌ అరిత్ర

సాక్షి, చైన్నె : సముద్ర జలాల్లో స్వయంప్రతిపత్తితో పనిచేసే ఉపరితల నౌకల పనితీరును పరీక్షించే ప్రతిష్టాత్మక అంతర్జాతీయ పోటీల్లో ఐఐటీ మద్రాస్‌ చరిత్ర సృష్టించింది. నార్వే వేదికగా జరిగిన 2026 జ్యోర్డ్‌ ఛాలెంజ్‌ పోటీల్లో ఐఐటీ మద్రాస్‌ ఓషన్‌ ఇంజినీరింగ్‌ విభాగానికి చెందిన టీమ్‌ అరిత్రా అఖండ విజయాన్ని సాధించి ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించిందని శుక్రవారం ఐఐటీ వర్గాలు ప్రకటించాయి. నార్వేలోని ట్రోండ్‌హైమ్‌ నగరంలో ఆగస్టు 10 నుంచి 14 వరకు ఈ పోటీలు జరిగాయి. నార్వేజియన్‌ యూనివర్సిటీ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ ఆధ్వర్యంలో జరిగిన ఈ అంతర్జాతీయ వేదికలో భారత్‌, టర్కీ, నార్వే, పోలాండ్‌, కెనడా, జపాన్‌, స్పెయిన్‌, క్రొయేషియా, స్కాట్లాండ్‌ వంటి 9 దేశాల నుంచి మొత్తం 23 జట్లు (150 మందికి పైగా విద్యార్థులు) పోటీపడ్డాయి.

అద్భుత ప్రతిభ

మ్యాన్వరింగ్‌, పాత్‌ఫైండింగ్‌ విభాగాల్లో వంద శాతం పాయింట్లు సాధించిన టీమ్‌ అరిత్రా, ఆకస్మికంగా ఎదురైన సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొని మొత్తం 90.42 పాయింట్లతో ఓవరాల్‌ ఛాంపియన్‌షిప్‌ను కై వసం చేసుకుంది. టర్కీ జట్టు (79.90) రెండో స్థానంలో, పోలాండ్‌ జట్టు (79.63) మూడో స్థానంలో నిలిచాయి. ఈ జట్టులో ఆరవ్‌ పటేల్‌, ఎస్‌.గురుకేశవ్‌ తదితరులు తమ నౌక రూపకల్పన, ప్రదర్శనను విజయవంతంగా నిర్వహించారు. ఈ బృందానికి ప్రొఫెసర్‌ అభిలాష్‌ శర్మ సోమయాజులు, ఆత్మానంద్‌ మార్గదర్శకం వహించారు. ఐఐటీ మద్రాస్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ వి.కామకోటి విజేతలను అభినందించారు. విద్యార్థుల నైపుణ్యం దేశానికి ఎంతో ఉపయోగపడుతుందని ప్రశంసించారు. సముద్ర తీర ప్రాంతాల నిఘా, ఓడరేవుల భద్రత, పర్యావరణ అధ్యయనాలు, హైడ్రోగ్రాఫిక్‌ సర్వేల వంటి కీలక రంగాల్లో ఈ అత్యాధునిక స్వయంప్రతిపత్తి నౌకలు ఎంతగానో ఉపయోగపడతాయని నిపుణులు వెల్లడించారు. గతంలో 2023 పోటీల్లో మూడో స్థానంతో పాటు సస్టైనబిలిటీ అవార్డు గెలుచుకున్న ఐఐటీ మద్రాస్‌ విద్యార్థులు, ఈసారి ఏకంగా ప్రపంచ విజేతగా నిలిచి దేశం గర్వపడేలా చేశారని ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement