న్యూస్‌రీల్
22 నుంచి విస్తరణ పథకం అమలు
అధికారులతో సీఎం విజయ్ సమాలోచన
చైన్నెలో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్
వాల్‌గ్రీన్స్‌తో ఒప్పందం
సాక్షి, చైన్నె : విద్యార్థులకు పౌష్టికాహారంతో కూడిన అల్పాహారం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఈ నెల 22 నుంచి అల్పాహారం విస్తరణ పథకాన్ని ప్రారంభించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు సీఎం విజయ్ అధికారులకు ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే చైన్నెలో గ్లోబల్ కేపబులిటీ సెంటర్ ఏర్పాటుకు కార్యాచరణ సిద్ధం చేశారు. ఇందుకోసం వాల్ గ్రీన్స్ సంస్థతో సీఎం విజయ్ సమక్షంలో శుక్రవారం ఒప్పందాలు జరిగాయి.
డీఎంకే హయాంలో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు చదువుతున్న పిల్లలకు ఉదయం అల్పాహారం అందించేలా సీఎం అల్పాహార పథకం అమలు చేశారు. తాజాగా అఽధికారంలోకి వచ్చిన టీవీకే ప్రభుత్వం ఆ పథకం పేరు మార్చింది. కర్మయోగి కామరాజర్ అల్పాహార పథకంగా అమలు చేయడానికి నిర్ణయించింది. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రభుత్వ సహకారంతో నడుస్తున్న పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులందరికీ వేడి వేడిగా, రుచికరమైన, తగిన మోతాదులో పోషకాలు నిండిన అల్పాహారాన్ని అందించాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే సచివాలయంలో శుక్రవారం సీఎం విజయ్ సమక్షంలో ఉన్నత స్థాయి అధికారుల సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 15,454 పాఠశాలల్లో 6 నుంచి 8వ తరగతి వరకు చదువుతున్న దాదాపు 15.30 లక్షల మంది విద్యార్థులు అదనంగా లబ్ధి పొందేలా కార్యాచరణను రూపొందించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో విస్తరణ పథకం కోసం అదనంగా రూ.217.63 కోట్లు, ఇది వరకే అమలులో ఉన్న పథకం లబ్ధిదారులైన విద్యార్థుల కోసం రూ.724 కోట్లు కేటాయించారు.
వాల్ గ్రీన్స్‌తో ఒప్పందం
అమెరికా ప్రధాన కేంద్రంగా ప్రపంచవ్యాప్తంగా సేవలు అందిస్తున్న ప్రముఖ ఆరోగ్య, ఫార్మసీ సేవల సంస్థ వాల్‌గ్రీన్స్ ఇండియా తమిళనాడులో తన మొట్టమొదటి ప్రపంచ స్థాయి నైపుణ్య కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. చైన్నెలోని ఓఎంఆర్ జీసీసీ కారిడార్‌లో గల డీఎల్‌ఎఫ్ డౌన్‌టౌన్ తారామణిలో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు వీలుగా సీఎం విజయ్ సమక్షంలో సచివాలయం వేదికగా శుక్రవారం ఒప్పందం చేసుకుంది. తొలి సంవత్సరంలోనే సుమారు 250 మంది యువతకు అత్యున్నత విలువ కలిగిన ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. రాబోయే సంవత్సరాల్లో ఈ కేంద్రాన్ని మరింత విస్తరించనున్నారు. వాల్‌గ్రీన్స్ సంస్థ భారతదేశంలోనే మొట్ట మొదటిసారిగా ఏర్పాటు చేయబోయే గ్లోబల్ కేపబులిటీ సెంటర్‌ను తమిళనాడులో ప్రారంభించడం విశేషం. సాంకేతికత, వ్యాపార సేవలను ప్రధాన ప్రాతిపదికగా చేసుకుని ఈ కేంద్రం పనిచేస్తుంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న యువతకు నాణ్యమైన ఉపాధి అవకాశాలను కల్పించాలని ముఖ్యమంత్రి విజయ్ కోరారు. తమిళనాడును గ్లోబల్ టెక్నాలజీ, బిజినెస్ హబ్‌గా మార్చే ప్రభుత్వ లక్ష్యానికి ఈ ఒప్పందం మరింత ఊతమిస్తుందని ప్రభుత్వం పేర్కొంది. కార్యక్రమంలో పరిశ్రమల శాఖ మంత్రి కీర్తన, ప్రధాన కార్యదర్శి సాయికుమార్, వాల్‌గ్రీన్స్ సంస్థ గ్లోబల్ కేపబులిటీ సెంటర్ అధ్యక్షుడు ఉమాపతి విశ్వనాథన్, డైరెక్టర్ మసూద్ అహ్మద్, పలువురు ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
అమలుకు కార్యాచరణ
చైన్నె నగరంలోని 447 పాఠశాలల్లో సమైక్య వంటశాలల ద్వారా చైన్నె కార్పొరేషన్ అల్పాహారాన్ని అందిస్తుందని అధికారులు ప్రకటించారు. ఇతర కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, వీటి పరిధిలోని ఇతర ప్రాంతాల్లో ఉన్న 2,150 పాఠశాలల్లో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టరేట్ ఆధ్వర్యంలోని సమైక్య వంటశాలల ద్వారా ఆహారం అందించనున్నారు. గ్రామీణ ప్రాంతాలు, పంచాయతీల పరిధిలోని 12,857 పాఠశాలల్లో తమిళనాడు మహిళా అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో స్వయం సహాయక సంఘాల సభ్యుల ద్వారా ఆయా పాఠశాలల్లోనే అల్పాహారం తయారు చేసి వడ్డించనున్నారు. విద్యార్థుల ఆరోగ్యం, పౌష్టికాహారం, పాఠశాల హాజరును మరింత బలోపేతం చేసేలా పథకాన్ని సీఎం విజయ్ ఈ నెల 22వ తేదీన చైన్నెలో ప్రారంభించాలని నిర్ణయించారు. వంటశాలలు, భోజనం వడ్డించే ప్రదేశాలు పరిశుభ్రంగా ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలని, విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందేలా అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సీఎం విజయ్ ఆదేశించారు. ఈ సమావేశంలో మంత్రులు ఆనంద్, రాజ్ మోహన్, జగదీశ్వరి, సీఎస్ సాయికుమార్, సీనియర్ అధికారి గగన్ దీప్ సింగ్ బేడి తదితరులు పాల్గొన్నారు.
28న బంగారు ఉంగరం పథకం
తమిళనాడు ప్రభుత్వ ఆసుపత్రులలో జన్మించే శిశువుల కోసం ప్రభుత్వం ‘తాయ్ మామన్ తంగ మొదిరం పథకం (మేనమామ బంగారు ఉంగరం పథకం) సెప్టెంబర్ 28వ తేదీన ప్రారంభం కానుంది. ఈ మేరకు సీఎం విజయ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో తీర్మానించారు. తమిళనాడులో తల్లి, శిశువుల సంక్షేమాన్ని మరింత మెరుగుపరచడం, ప్రభుత్వ వైద్య సేవలు, ప్రజా సంక్షేమంపై ప్రజలకున్న విశ్వాసాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ఈ పథకం అమలు చేయనున్నారు. అలాగే తమిళ సంస్కృతి, సంప్రదాయాలలో మేనమామ ఇచ్చే బహుమతి ఆచారాన్ని ప్రతిబింబించేలా ఈ పథకానికి రూపకల్పన చేశారు. తమిళనాడులో శాశ్వత నివాసితులైన తల్లులు ఈ పథకానికి అర్హులు. తల్లులు తప్పనిసరిగా పీఐసీఎంఈ( పిఐసిఎంఇ )లో పేర్లు నమోదు చేసుకుని, ఆర్‌సిహెచ్ గుర్తింపు సంఖ్యను కలిగి ఉండాలి. 2026 జూన్ 22 నుంచి ప్రభుత్వ ఆసుపత్రులలో జన్మించే ప్రతి బిడ్డకూ ఒక గ్రాము బంగారు ఉంగరం బహుమతిగా అందజేస్తారు. ఈ ఉంగరాలకు ప్రత్యేక సీరియల్ నంబర్, ట్యాంపర్–ప్రూఫ్ ప్యాకేజింగ్ ఉంటుంది. మొదటి విడతలో 1.28 లక్షల బంగారు ఉంగరాలను కొనుగోలు చేశారు.


