ప్రచార బాటలో నేతలు | - | Sakshi
Sakshi News home page

ప్రచార బాటలో నేతలు

Sep 19 2026 5:56 AM | Updated on Sep 19 2026 5:56 AM

● సీఎం విజయ్‌ 4 రోజుల పర్యటన ● అన్నాడీఎంకేలో ప్రచార సారథులు ● సిద్ధమవుతున్న స్టాలిన్‌, ఉదయ నిధి

సాక్షి, చైన్నె : ఉప ఎన్నికల నామినేషన్ల ఉప సంహరణ ప్రక్రియ శనివారం ముగియనుంది. దీంతో పంచ ముఖ సమరంలో ఆయా పార్టీల ముఖ్య నేతలు నియోజకవర్గాల బాటకు సన్నద్ధమయ్యారు. సీఎం విజయ్‌ తమ అభ్యర్థులకు మద్దతుగా నాలుగు రోజులు పర్యటించనున్నారు. అన్నాడీఎంకే తరపున 40 మంది ప్రచార సారథులు రంగంలోకి దిగారు. రాష్ట్రంలో మధురాంతకం, ధారాపురం నియోజకవర్గాలకు అక్టోబరు 6న ఉప ఎన్నిక జరగనున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికలో పోటీ చేసే అభ్యర్థుల వద్ద ఈనెల 9 నుంచి 16 వరకు నామినేషన్లు స్వీకరించారు. గురువారం పరిశీలన చేశారు. శనివారం ఉప సంహరణ ప్రక్రియను ముగించి తుది జాబితాను ప్రకటించనున్నారు. ఈ ఎన్నికల్లో టీవీకే, డీఎంకే, అన్నాడీఎంకే, వామపక్షాలు, నామ్‌ తమిళర్‌ కట్చి అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వీరితో పాటు స్వతంత్ర అభ్యర్థులు అనేకమంది ఉన్నారు. ప్రధాన సమరం ఐదు పార్టీల మధ్య ఉంది. మధురాంతకంలో 28 మంది, ధారాపురంలో 30 మంది నామినేషన్లు ఆమోదం పొందాయి. సీఎం విజయ్‌ ఈ రెండు నియోజకవర్గాల్లోనూ రెండు రోజుల చొప్పున విస్తృతంగా పర్యటించి, టీవీకే అభ్యర్థుల తరఫున భారీ బహిరంగ సభల్లో పాల్గొని ప్రచారం చేయనున్నారు. డీఎంకే అధ్యక్షుడు ఎం.కే. స్టాలిన్‌, ప్రధాన ప్రతిపక్షనేత ఉదయనిధి స్టాలిన్‌, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి, నామ్‌ తమిళర్‌ కట్చి సీమాన్‌తో పాటు వామపక్ష నేతలు సీపీఎం, సీపీఐకు చెందిన షణ్ముగం, వీర పాండియన్‌ ప్రచారానికి సిద్ధమయ్యారు. అన్నాడీఎంకేలో 40 మందిని ప్రచార ప్రతినిధులుగా రంగంలోకి దించారు. ఈ జాబితాలో ఆప ఆర్టీ ముఖ్య నేతలైన సీ.వీ. షణ్ముగం, ఎస్‌పి.వేలుమణి పేర్లు ఆ జాబితాలో చోటు దక్కించుకోలేదు. ధారాపురంలో టీవీకే అభ్యర్థి సత్యభామ నామినేషన్‌ దాఖలు చేసి వెళుతున్న సమయంలో కారుపై దాడి జరిగినట్లు వచ్చిన ఫిర్యాదు మేరకు, అన్నాడీఎంకే అభ్యర్థి భానుమతి, మాజీ మంత్రులు దిండుగల్‌ శ్రీనివాసన్‌తోపాటు పలువురిపై పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. డీఎంకే అభ్యర్థులు తమ తమ నియోజకవర్గాలలో ఎన్నికల కార్యాలయాల ఏర్పాటుతో ప్రచార పయనంలో ఉరకలు తీస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement