సాక్షి, చైన్నె : పెన్షనర్లకు నష్టం కలిగించే కేంద్ర ప్రభుత్వ పెన్షన్ నిబంధనల పరిశీలన చట్టాన్ని రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లు డిమాండ్ చేశారు. వారు 11 అంశాల సాధన కోసం 3 రోజుల నిరసన దీక్షకు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా చైన్నెలోని ఎగ్మూర్ రాజరత్నం మైదానం సమీపంలో శనివారం మహా ధర్నా చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు సివిల్ పెన్షనర్ల సంఘాల సమాఖ్య రాష్ట్ర సమైక్యతాధికారి ఆర్.రాజశేఖర్ చైన్నెలో శుక్రవారం మీడియాతో మాట్లాడారు. 2026కు పూర్వం పదవీ విరమణ పొందిన వారికి 8వ వేతన సంఘం ద్వారా పెన్షన్ సవరణ వర్తించని విధంగా తెచ్చిన చట్టాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలన్నారు. 8వ వేతన సంఘం విధివిధానాలను సవరించి ప్రస్తుత పెన్షనర్లకు కూడా పెన్షన్ సవరణ వర్తింపజేయాలని కోరారు. నేషనల్ పెన్షన్ స్కీమ్, యునిఫైడ్ పెన్షన్ స్కీమ్‌లను రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్నే అమలు చేయాలన్నారు. కరువు భత్యం 50 శాతం దాటితే దానిని మూలవేతనంతో కలపాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు 3 రోజుల నిరసనకు నిర్ణయించామని వివరించారు. శనివారం సాయంత్రం 3 నుంచి 5 గంటలకు వరకు ధర్నాకు పూనుకున్నామన్నారు. 3వ విడతగా నవంబర్ 25వ తేదీన ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద భారీ ప్రదర్శన, ధర్నా నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. ఇందులో దేశవ్యాప్తంగా సుమారు 5 వేల మంది పెన్షనర్లు పాల్గొననున్నారని తెలిపారు. భారతదేశంలో రక్షణ శాఖ పెన్షనర్లు 36 లక్షల మందితో కలిపి మొత్తం 69 లక్షల మంది పెన్షనర్లు ఉన్నారని, పెన్షనర్ల ప్రయోజనాలను దెబ్బతీసేలా కేంద్రం తెచ్చిన ఈ కొత్త నిబంధనలను వెనక్కి తీసుకోవాలని ఆలిండియా సెంట్రల్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ఎం.దురైపాండియన్ డిమాండ్ చేశారు. 8వ వేతన సంఘం సిఫార్సులు అమలయ్యే వరకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు 20 శాతం మధ్యంతర భృతిని ప్రకటించాలని కోరారు.


