కూటమి విచ్ఛిన్నానికి డీఎంకేదే బాధ్యత! | - | Sakshi
Sakshi News home page

కూటమి విచ్ఛిన్నానికి డీఎంకేదే బాధ్యత!

Sep 12 2026 12:36 AM | Updated on Sep 12 2026 12:36 AM

సాక్షి, చైన్నె : డీఎంకే కూటమిలో వీకేసీ నూటికి నూరు శాతం కొనసాగలేకపోవడానికి ఆ పార్టీ వైఖరే కారణమని ఆ పార్టీ ఎంపీ తిరుమావళవన్‌ స్పష్టం చేశారు. కాంగ్రెస్‌, వామపక్షాలు కూటమిని వీడటానికి కూడా డీఎంకే అనుసరించిన పద్ధతులే కారణమని విమర్శించారు. ఆయన శుక్రవారం ధర్మపురిలో జరిగిన ఓ కార్యక్రమంలో మీడియాతో మాట్లాడుతూ రాజకీయ పరిణామాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. 2026 ఎన్నికలకు ముందు డీఎంకే కూటమిని విచ్ఛిన్నం చేయడానికి, తనను కూటమి నుంచి బహిష్కరించడానికి అనేక కుట్రలు జరిగాయని తెలిపారు. ద్రవిడ రాజకీయాలను దెబ్బతీసేందుకు బీజేపీ పన్నే కుట్రలకు బలి కాకూడదనే ఉద్దేశంతోనే తాను సంయమనం పాటించానని చెప్పారు. కూటమిని కాపాడుకోవాల్సిన బాధ్యత నాయకత్వ పార్టీపై ఉంటుందని తెలిపారు. డీఎంకే ఆ సామరస్యాన్ని కాపాడుకోలేకపోయిందని ఆరోపించారు. చాలా కాలంగా డీఎంకేతో కలిసి ప్రయాణిస్తున్న మిత్రపక్షాలకు సీట్లను తగ్గించి, చివరి నిమిషంలో కూటమిలో చేరిన పార్టీకి ఎక్కువ సీట్లు కేటాయించడం వల్లే అసంతృప్తి రగిలిందన్నారు. 70 ఏళ్లుగా కూటమిలో ఉన్న ఐయూఎంఎల్‌ ఎందుకు వీడింది? ఎండీఎంకేను సొంత గుర్తుపై పోటీ చేయనివ్వకపోవడం వంటి అంశాలే కూటమిలో మనస్పర్థలకు పరిస్థితులు దారితీశాయని గుర్తుచేశారు.

మంత్రి పదవిపై విమర్శలకు వివరణ

తనకు అధికారంపై ఆశ ఉంటే కాంగ్రెస్‌ పార్టీ కూటమి వీడినప్పుడే బయటకు వచ్చి ఉండేవాడినని తిరుమావళవన్‌ తెలిపారు. సీఎం విజయ్‌ స్వయంగా సంప్రదించి మంత్రి పదవి ఇస్తామన్నప్పుడే అంగీకరించి ఉండేవాడినని స్పష్టం చేశారు. సాధారణ, నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తికి మంత్రిగా అవకాశం లభిస్తే వదులుకోకూడదనే ఉద్దేశంతోనే ప్రభుత్వంలో చేరామన్నారు. దీనిపై తప్పుడు ప్రచారాలతో ప్రజల నమ్మకాన్ని ఎప్పటికీ కదిలించలేరని తేల్చిచెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement