సాక్షి, చైన్నె : దక్షిణాధి కుంభమేళగా పిలిచే కుంభకోణం మహామహం వేడుకలకు కోటి మంది భక్తులు పాల్గొంటారని అంచనా వేస్తున్నట్టు దేవాదాయ శాఖమంత్రి రమేష్ తెలిపారు. ఈ ఉత్సవ ఏర్పాట్ల కోసం రూ. 600 కోట్లు ఖర్చవుతుందని భావిస్తున్నట్టు తెలిపారు. ఆయన శుక్రవారం తంజావూరు జిల్లా కుంభకోణం ఆర్డీవో కార్యాలయ ప్రాంగణంలోని మహా మహ హాల్‌లో మాసి మహామహం–2028 ముందస్తు ఏర్పాట్లపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఏర్పాట్ల గురించి చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ గత మహామహం ఉత్సవానికి 50 లక్షల మంది హాజరయ్యారని తెలిపారు. 2028 మహామహం వేడుకకు కోటి మంది వరకు భక్తులు వస్తారని అంచనా వేస్తున్నామన్నారు. వారిలో సుమారు 50 లక్షల మంది రైళ్ల ద్వారా రానున్నారని పేర్కొన్నారు. ఈ మహా ఉత్సవానికి అన్ని శాఖల ద్వారా రూ.600 కోట్లు ఖర్చు చేయనున్నట్లు అంచనా వేశామన్నారు. ఈ ఉత్సవాలకు సంబంధించిన 17 ప్రధాన ఆలయాల్లో పునరుద్ధరణ పనులు పూర్తయిన తర్వాత మహాసంప్రోక్షణ (కుంభాభిషేకం) నిర్వహిస్తామని తెలిపారు.
ప్రభుత్వ ఆదేశాలు
సీఎం విజయ్ ఆదేశాల మేరకు ఈ మహా ఉత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు వేగవంతం చేస్తున్నామని మంత్రి తెలిపారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం నుంచి అవసరమైన సహాయ సహకారాలను పొందేలా చర్యలు తీసుకుంటామని, పనులన్నీ నిర్ణీత సమయానికి పూర్తి చేస్తామన్నారు.


