సాక్షి, చైన్నె : ఉద్యోగులందరూ తమ ఆస్తులు, అప్పుల వివరాలను ఆన్‌లైన్‌లో విధిగా నమోదు చేయాలని తమిలనాడు ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు మానవ వనరుల నిర్వహణ శాఖ ప్రత్యేకంగా ఒక ఆన్‌లైన్ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. డిసెంబర్ 2025 నాటికి ఉన్న ఆస్తుల వివరాలను సమర్పించడానికి 2026 అక్టోబర్ 31వ తేదీ తుది గడువుగా నిర్ణయించింది.
నిబంధనలు – మార్గదర్శకాలు
తమిళనాడు ప్రభుత్వ ఉద్యోగుల ప్రవర్తనా నియమావళిలోని సెక్షన్ 7(3)కి చేసిన సవరణ ప్రకారం ఈ కొత్త విధానం అమల్లోకి వచ్చింది. అఖిల భారత సర్వీస్ అధికారులు మినహా మిగతా ప్రభుత్వ ఉద్యోగులందరూ తమ స్థిరాస్తులు (భూమి, భవనాలు), చరాస్తులతో పాటు (వాహనాలు, ఆభరణాలు, బ్యాంకు బ్యాలెన్సులు), రుణాలు, ఇతర ఆర్థిక బాధ్యతల వివరాలను తప్పనిసరిగా సమర్పించాలి. స్థిరాస్తుల వివరాల నమోదుకు ఫారం 1ను, చరాస్తులు, రుణాల వివరాల కోసం మరో నిర్దిష్ట ఫారమ్‌ను ఉపయోగించి ఆన్‌లైన్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. నమోదు ప్రక్రియ పూర్తయిన తర్వాత ఉద్యోగులు నివేదికను ధ్రువీకరించి సమర్పించాలి. అనంతరం కాపీని డౌన్‌లోడ్ చేసుకుని తమ వ్యక్తిగత రికార్డుల కోసం భద్రపరుచుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది.
కఠిన చర్యలు – నిఘా
సమీకృత ఆర్థిక, మానవ వనరుల నిర్వహణ సంస్థ వెబ్‌సైట్‌లో ఈ సదుపాయం కల్పించారు. దీనివల్ల ఉద్యోగుల ఆర్థిక లావాదేవీలు, నిబంధనల ఉల్లంఘనలను పర్యవేక్షించడం సులభతరమవుతుందని అధికారులు పేర్కొన్నారు. ఉద్యోగులు గడువులోగా ఆస్తి పత్రాలను దాఖలు చేశారా లేదా అనే వివరాలను వారి వార్షిక పనితీరు రికార్డులలో ప్రత్యేకంగా నమోదు చేస్తారు. ఈ విషయంగా జాక్టో జియో సంఘం సభ్యులు మాట్లాడుతూ ఈ నిబంధన అమల్లోకి రావడం వల్ల కిందిస్థాయి నుంచే అవినీతిని అరికట్టడానికి వీలవుతుందని తెలిపారు. ఉద్యోగుల పదోన్నతుల జాబితా తయారీలోనూ ఈ ఆస్తుల సమర్పణను పరిగణనలోకి తీసుకుంటారని తెలిపారు. నిర్ణయించిన గడువులోగా ఆస్తుల వివరాలను సమర్పించడంలో విఫలమైతే, దానిని సివిల్ సర్వీస్ ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనగా పరిగణించి శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది.


