సాక్షి, చైన్నె : చైన్నె ఎస్‌ఆర్‌ఎం స్కూల్ ఆఫ్ లా ఆధ్వర్యంలో శుక్రవారం సుస్థిరత, చట్టం, మానవ హక్కులు అనే అంశంపై ప్రతిష్టాత్మక బహిరంగ ఉపన్యాసం కార్యక్రమం నిర్వహించారు. లండన్‌లోని యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ లండన్ ప్రొఫెసర్, అంతర్జాతీయ నిపుణులు సిరాజ్ సైత్ ముఖ్య వక్తగా హాజరయ్యారు. లా ప్రొ–వైస్ ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ వై.ఎస్.ఆర్.మూర్తి, లా డీన్ ప్రొఫెసర్ ఇంద్రనాథ్ గుప్తా నేతృత్వంలో ఈ కార్యక్రమం జరిగింది. మానవ హక్కుల అధ్యయన కేంద్రం, పర్యావరణ చట్టం, సుస్థిరత కేంద్రం సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాయి. ప్రొఫెసర్ సిరాజ్ మాట్లాడుతూ భారతదేశంలో సుమారు 1,800లకు పైగా లా కళాశాలలు ఉన్నాయని తెలిపారు. సంప్రదాయ బోధనా విధానాలకు స్వస్తి పలికి అంతర్ విషయ, అనుభవ పూర్వక అభ్యాసం, పరిశోధనలపై దృష్టి పెట్టాలని పిలుపునిచ్చారు. మద్రాస్ లా కాలేజీ నుంచి హార్వర్డ్, ఆపై ప్రయాణాన్ని నెమరువేసుకోవడం అనే అంశంపై ప్యాకల్టీతో ఆయన ప్రత్యేకంగా ముచ్చటించారు. న్యాయ నిపుణులు కోర్టు గదులకే పరిమితం కాకుండా పరిశోధనలు, పాలసీ సంస్కరణల ద్వారా సమాజంలో కుల వివక్షను, బానిసత్వాన్ని రూపుమాపేందుకు కృషి చేయాలని కోరారు.


