తిరుపతి లీగల్ : ఎర్రచందనం దుంగల అక్రమ రవాణా కేసులో తమిళనాడు, తిరువణ్ణామలై జిల్లా, పోలూరు తాలూకా, కోయిలాంబూర్‌కు చెందిన ముత్తుస్వామినాథన్‌కు ఐదేళ్ల జైలు శిక్ష, ఆరు లక్షల రూపాయల జరిమానా విధిస్తూ తిరుపతి నాల్గవ అదనపు జిల్లా జడ్జి, రాష్ట్ర ఎరచ్రందనం కేసుల విచారణ సెషనన్ జడ్జి కోర్టు ఇన్‌చార్జ్ జడ్జి అర్చన శుక్రవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం.. ఎర్రచందనం అక్రమ నిరోధక దళం 2018లో శేషాచలం, టీఎన్ పాలెం సెక్షన్, మేకలబండ అటవీ ప్రాంతంలో తనిఖీలు నిర్వహించింది. ఆ సమయంలో స్వామినాథన్ ఎర్రచందనం దుంగలను తరలిస్తూ సిబ్బందికి పట్టుబడ్డాడు. ఫారెస్ట్ సిబ్బంది అతన్ని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. నేరం అతనిపై రుజువు కావడంతో న్యాయమూర్తి అతనికి శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. అలాగే మరో కేసులో వైఎస్సార్ కడప జిల్లా, సానిపయ్య రేంజ్, పింఛ సెక్షన్, దిన్నెలబీట్, ఏడు ఆవుల ధర్తీ అటవీ ప్రాంతంలోకి అక్రమంగా ప్రవేశించి ఏడు ఎర్రచందనం దుంగలను తరలిస్తున్న కేసులో తమిళనాడు, విల్లుపురం జిల్లా, చిన్న సేలం తాలూకా, ఇన్నాడు గ్రామానికి చెందిన కె.రాజీవ్‌గాంధీకి ఐదేళ్ల జైలు శిక్ష, ఆరు లక్షల రూపాయల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. 2020 నవంబర్ 27న సానిపయ్య రేంజ్ ఫారెస్ట్ అధికారులు నిందితుడు రాజీవ్ గాంధీని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు.


