సాక్షి, చైన్నె : చైన్నెలోని ఆల్వార్‌పేట్ కావేరి ఆసుపత్రి వెన్నుపూస సంరక్షణ విభాగంలో అత్యంత ఆధునిక ఎండోస్కోపిక్ ఫ్యూజన్ సర్జరీ విధానాన్ని విజయవంతంగా ప్రవేశపెట్టారు. 8 మి.మీ కోత ద్వారా చేసే ఈ అత్యాధునిక శస్త్రచికిత్స వల్ల రక్తస్రావం తగ్గి రోగులు త్వరగా కోలుకుని నడవడానికి వీలవుతుంది. డిస్క్ సమస్యలు, నరాల సంపీడనం, పాత వెన్నుపూస సర్జరీలు విఫలమైన వారికి సంప్రదాయ ఓపెన్ సర్జరీలకు ప్రత్యామ్నాయంగా ఈ కనిష్ట ఇన్వాసివ్ పద్ధతిని అందుబాటులోకి తెచ్చారు. ఇందులో హైడెఫినిషన్ కెమెరా, ప్రత్యేక వర్కింగ్ ఛానెల్ సాయంతో 8 మి.మీల కోత ద్వారా వెన్నుపూసకు కావలసిన ఇంప్లాంట్లు అమరుస్తారు. దీనివల్ల చుట్టూ ఉన్న కండరాలు, ఎముకలు, స్నాయువులకు ఎలాంటి నష్టం జరగకుండా కాపాడుకోవచ్చు. డిస్క్ వ్యాధులు, స్పైనల్ స్టెనోసిస్, పునరావృత నరాల నొప్పులు ఉన్నవారికి, పాత సర్జరీల వల్ల మచ్చపడిన ప్రాంతాల్లో మళ్లీ రిస్క్ లేకుండా సర్జరీ చేయడానికి ఇది ఎంతో అనుకూలం. పెద్ద వయసు వారికీ ఇది మేలు చేస్తుంది. ఆస్పత్రి ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ కీర్తివాసన్ పి మాట్లాడుతూ కొన్ని కేసుల్లో సహజ స్థిరత్వాన్ని కాపాడుతూ పెద్ద ఫ్యూజన్‌లను నివారించడానికి ఎండోస్కోపీ సహాయపడుతుందన్నారు. హై–గ్రేడ్ స్లిప్స్ వంటి సంక్లిష్ట సమస్యలకు పాత పద్ధతులే అవసరమవుతాయన్నారు. స్పైన్, న్యూరో సర్జరీ హెడ్ డాక్టర్ బాలమురళి మాట్లాడుతూ ఇది చిన్న కోత మాత్రమే కాదు, సరైన రోగికి సరైన విధానాన్ని ఎంచుకునే ప్రక్రియ అని తెలిపారు. సంక్లిష్టమైన కేసుల్లో ఇది చక్కటి ఫలితాలను ఇస్తుందన్నారు. కో ఫౌండర్ డాక్టర్ అరవిందన్ సెల్వరాజ్ మాట్లాడుతూ అధునాతన సాంకేతికతను వైద్య నైపుణ్యంతో జోడించి, శస్త్రచికిత్స భారాన్ని తగ్గించడమే తమ ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు.


