అసెంబ్లీ ఉప ఎన్నికల సమరానికి రాజకీయ పక్షాలు సన్నద్ధమయ్యాయి. బుధవారం నామినేషన్ల పర్వానికి ఎన్నికల యంత్రాంగం శ్రీకారం చుట్టింది. డీఎంకే అభ్యర్థులుగా మదురాంతకంలో పరంథామన్‌, ధారాపురంలో సుకన్య పోటీ చేయనున్నారు. ఇక, తమ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని అన్నాడీఎంకే బీ | - | Sakshi
Sakshi News home page

అసెంబ్లీ ఉప ఎన్నికల సమరానికి రాజకీయ పక్షాలు సన్నద్ధమయ్యాయి. బుధవారం నామినేషన్ల పర్వానికి ఎన్నికల యంత్రాంగం శ్రీకారం చుట్టింది. డీఎంకే అభ్యర్థులుగా మదురాంతకంలో పరంథామన్‌, ధారాపురంలో సుకన్య పోటీ చేయనున్నారు. ఇక, తమ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని అన్నాడీఎంకే బీ

Sep 10 2026 1:39 AM | Updated on Sep 10 2026 1:39 AM

● అన్నాడీఎంకేకు బీజేపీ మద్దతు ● టీవీకేలో అభ్యర్థుల కోసం కసరత్తు ముమ్మరం

డీఎంకే అభ్యర్థులుగా పరంథామన్‌, సుకన్య

బీజేపీ మద్దతు కోరిన అన్నాడీఎంకే..

ఉపఎన్నికల్లో బీజేపీ మద్దతు కోరి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్‌ నాగేంద్రన్‌ను అన్నాడీఎంకే ప్రతినిధులు , మాజీ మంత్రులు కే.పి. మునుస్వామి, దిండిగల్‌ శ్రీనివాసన్‌, ఓ.ఎస్‌. మణియన్‌, అగ్రి కృష్ణమూర్తిలు కమలాలయంలో భేటీ అయ్యారు. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామి తరపున నైనార్‌ నాగేంద్రన్‌కు లేఖ అందజేశారు. బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్‌, రాష్ట్ర కార్యదర్శి కరాటే త్యాగరాజన్‌ ఈసందర్భంగా ఉన్నారు. బీజేపీ సానుకూతను వ్యక్తంచేసినా, ఇతర మిత్రపక్షాల నాయకులను కూడా కలిసి మద్దతు కోరాలని అన్నాడీఎంకే నిర్ణయించింది. ఈ సందర్భంగా కే.పి. మునుస్వామి మాట్లాడుతూ, గత ఎన్నికల్లో ప్రజలు అన్నాడీఎంకేను నమ్మి గెలిపించారని, అయితే, ఆ ఎమ్మెల్యేలు మోసం చే శారని మండి పడ్డారు. కాగా, మదురాంతకం సీటును అన్నాడీఎంకేలో ఎంపీ ధనపాల్‌ సతీమని గాయత్రి, మాజీ ఎమ్మెల్యే కనిత సంపత్‌ ఆశిస్తున్నారు.

సాక్షి, చైన్నె: సీఎం విజయ్‌ పెరంబూరు, తిరుచ్చి తూర్పు నియోజకవర్గంలో గెలిచిన విషయం తెలిసిందే. దీంతో ఆయన తిరుచ్చి తూర్పు పదవికి రాజీనామా చేయడంతో ఆ నియోజకవర్గం ఖాళీ అయింది. ఆ తదుపరి పరిణామాలతో ఆరు నియోజకవర్గాలకు చెందిన అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేసి టీవీకేలో చేరారు. వీరిలో మదురాంతకం –మరగదం కుమర వేల్‌, ధారాపురం – సత్యభామా, పెరుంతురై – జయకుమార్‌, అంబా సముద్రం – ఇసక్కి సుబ్బయ్య, విరాళి మలై – విజయ భాస్కర్‌, కరూర్‌ – ఎం ఆర్‌విజయ భాస్కర్‌ ఉన్నారు. అయితే, మదురాంతకం, తారాపురం మినహా తక్కిన నియోజకవర్గాలకు సంబంధించి ఎన్నికల కేసులు విచారణలో ఉన్నాయి. దీంతో మొత్తం ఏడు స్థానాలలో ఐదు స్థానాలను పెండింగ్‌లో పెట్టిన ఎన్నికల యంత్రాంగం తాజాగా 2 స్థానాలకే ఉప ఎన్నికలను ప్రకటించింది.

డీఎంకే అభ్యర్థులు వీరే..

డీఎంకే అధినేత ఎం.కే. స్టాలిన్‌ ఉప ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. లౌకిక ప్రగతిశీల కూటమి మద్దతుతో డీఎంకే న్యాయవిభాగం కార్యదర్శి, అడ్వకేట్‌ ఐ. పరంథామన్‌ మధురాంతకం నియోజకవర్గం నుంచి, అడ్వకేట్‌ ఎస్‌. సుకన్య ధారాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని ప్రకటించారు. ఈ జాబితాను వెలువరించేందుకు ముందుగా పార్టీ యువజన నేత ఉదయనిధి స్టాలిన్‌, కోశాధికారి టి.ఆర్‌. బాలు, డిప్యూటీ ప్రదాన కార్యదర్శి కే.ఎన్‌. నెహ్రూ, కనిమొళితో స్టాలిన్‌ సమావేశమయ్యారు. నోటిఫికేషన్‌ వెలువడిన రోజే డీఎంకే తన అభ్యర్థులను ప్రకటించడం విశేషం. ఇక కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలోని తట్టాన్‌ చావడి నియోజకవర్గ ఉప ఎన్నికల్లో డీఎంకే అభ్యర్థిగా సేతు సెల్వంను స్టాలన్‌ ప్రకటించడం విశేషం.

టీవీకేలో కుస్తీ..

సీఎం విజయ్‌ నేతృత్వంలోని టీవీకేలో అభ్యర్థులుగా తమ పదవులకు రాజీనామా చేసి పార్టీలోకి వచ్చిన వారికే దక్కేనా లేదా ఆది నుంచి పార్టీకి సేవలు చేస్తున్న వారిని వరించేనా అన్న ఉత్కంఠ నెలకొంది. మెజారిటీ శాతం మంది మదురాంతకంలో మరగతం కుమర వేల్‌, ధారాపురంలో సత్య భామ పోటీ చేస్తారని చెబుతున్నప్పటికీ, స్థానికంగా ఏళ్ల తరబడి పార్టీకి సేవలు అందిస్తున్న నాయకులు సైతం ఎదురు చూపుల్లో పడ్డారు. ప్రధానంగా గత ఎన్నికలలో మరగతం కుమర వేల్‌చేతిలో కేవలం 7,194 కోట్లతో ఓటమి పాలైన టీవీకే అభ్యర్థి ఎలిల్‌ కెథరిన్‌ఏలుమలై సైతం సీటును ఆశిస్తుండటం గమనార్హం. అలాగే ధారాపురంలో సత్యభామ చేతిలో ఓటమి పాలైన టీవీకే అభ్యర్థి ఇంద్రాణి సైతం ఎదురు చూస్తుండటం విశేషం

నామినేషన్లకు శ్రీకారం

మదురాంతకం, ధారాపురంలలో ఉప ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ బుధవారం ప్రారంభమైంది. ఆ నియోజకవర్గాల ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులు ఇందుకు సంబంధించిన చర్యలు తీసుకున్నారు. ఆనియోజకవర్గంలో ఎన్నికల కోడ్‌ అమలులలోకి రావడంతో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇక, ఈనెల 16వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. 17న పరిశీలన, 19వ తేదీన ఉపసంహరన ప్రక్రియలు జరగనున్నాయి. అక్టోబరు 6న ఉప ఎన్నికల, 9వ తేదీన ఫలితాల లెక్కింపు జరగనుంది. మదురాంతకం రెవెన్యూ డివిజనల్‌ కార్యాలయంలో రిటర్నింగ్‌ అధికారి నరేంద్రన్‌ నామినేషన్లను స్వీకరిస్తున్నారు. డీఎస్పీ దీపక్‌ రజినీ నేతృత్వంలోఆ పరిసరాలలో భద్రతను కట్టుదిట్టంచేశారు. ఇక తారాపురం రిజర్వుడ్‌ నియోజకవర్గంకు సంబంధించిన ఆర్డీఓ కార్యాలయంలో రిటర్నింగ్‌ అధికారి ఫెలిక్స్‌ రాజ్‌ నామినేషన్‌ పత్రాలను స్వీకరిస్తున్నారు. ఆర్డీఓ ఆఫీసు ముందు సాయుధ పోలీసుల మోహరింపుతో పాటూ వందలాది మంది పోలీసులతో రక్షణ కల్పించారు. ఎన్నికల కింగ్‌ పద్మరాజన్‌ మొదటి రోజే ధారాపురంలో నామినేషన్‌ సమర్పించారు. దీంతో ఇది ఆయన 256వ సారి పోటీగా జాబితాలోచేరింది. రాజకీయ పార్టీలు లేదా స్వతంత్ర అభ్యర్థులు ర్యాలీలు, ఊరేగింపులు, ప్రచార సమావేశాలు నిర్వహించడానికి , పార్టీ కార్యాలయాలను ఏర్పాటు చేయడానికి ఎన్నికల సంఘం అనుమతి కోసం ఆన్‌లైన్‌ ద్వారానే దరఖాస్తు చేసుకోవాలని ఎన్నికల అధికారులు సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement