ప్రజాస్వామ్య విలువలకు ప్రాధాన్యం | - | Sakshi
Sakshi News home page

ప్రజాస్వామ్య విలువలకు ప్రాధాన్యం

Sep 10 2026 1:39 AM | Updated on Sep 10 2026 1:39 AM

● అసెంబ్లీ సమావేశాలపై స్పీకర్‌ వాఖ్య ● 32 వేల మంది వీక్షణ

సాక్షి, చైన్నె: తమిళనాడు 17వ శాసనసభ మొదటి సమావేశాలు మొత్తం 28 రోజుల పాటు (178 గంటల 31 నిమిషాలు) సుదీర్ఘంగా సాగి విజయవంతంగా పూర్తయ్యాయి. తొలి విడత మే 11 నుండి సెప్టెంబర్‌ 8 వతేది వరకు సాగిన ఈ సమావేశాలు ప్రజా సంక్షేమ ప్రకటనలు, చారిత్రాత్మక తీర్మానాలు , సుదీర్ఘమైన అర్ధవంతమైన చర్చలకు వేదికగా నిలిచినట్టు అసెంబ్లీ స్పీకర్‌ జేసీడీ ప్రభాకర్‌ ప్రకటించారు. ఈ సమావేశాలు ప్రత్యక్షంగా 32 వేల మంది వీక్షించినట్టు వివరించారు. శాసనసభా నిబంధన 110 కింద మొత్తం 18 ప్రకటనలు చేయగా, అందులో సీఎం సి. జోసెఫ్‌ విజయ్‌ 17 సంక్షేమ అభివృద్ధి ప్రకటనలను వెలువరించారు. వరి, చెరకు పంటలకు రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహకాలు, సహకార బ్యాంకుల ద్వారా వ్యవసాయ రుణాలు మరింత మాఫీ, పాల కొనుగోలు ధరల పెంపు. వెట్రి తమిళగం విజన్‌ ప్లాన్‌ కింద ప్రతి కుటుంబానికి ఉచిత ఎల్పీజీ గ్యాస్‌ సిలిండర్ల పంపిణీ వంటి కీలక ప్రకటనలు ఇందులో ఉన్నాయి. ఇక పరందూరు విమానాశ్రయరద్దు మరో హైలెట్‌గా నిలిచింది. గత ప్రభుత్వాల కాలంలో శాంతియుతంగా ఆందోళనలు చేసిన రైతులు, ఉపాధ్యాయులపై నమోదు చేసిన కేసుల ఎత్తివేత, కాంచీపురంలో సెమీకండక్టర్‌ – ఎలక్ట్రానిక్స్‌ పార్క్‌, కోయంబత్తూరులో డిజిటల్‌ ఫైనాన్స్‌ హబ్‌, తిరుచిరాపల్లిలో మల్టీ మోడల్‌ లాజిస్టిక్స్‌ హబ్‌ ఏర్పాటు ప్రకటనలు వెలువడ్డాయి. ఇక, చైన్నెలో తమిళనాడు ఒలింపిక్‌ సిటీ, మోటార్‌ స్పోర్ట్స్‌ సిటీ, ఎమ్మెల్యేలకు కార్ల పంపిణీ ప్రకటనలుమరో హైలెట్‌గా నిలిచాయి.

చారిత్రాత్మక తీర్మానాలు

రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ రంగ సంస్థల కార్యక్రమాలలో తమిళ్‌ తాయ్‌ వాల్తు గీతాన్ని తప్పని సరి చేయడం, మహిళా రిజర్వేషన్‌, డీలిమిటేషన్‌కు వ్యతిరేకగా కీలక తీర్మానాలు సభలో ఆమోదించారు. ఇక, 51 ప్రభుత్వ శాఖల తరఫున సంబంధిత మంత్రులు 1,117 కొత్త అభివృద్ధి ప్రకటనలు చేశారు. పరిపాలనా సంస్కరణలు, సంక్షేమం లక్ష్యంగా 13 ప్రభుత్వ బిల్లులు సభలో ఆమోదం పొందాయి. అత్యవసర ప్రజా సమస్యలపై 45 ప్రత్యేక అంశాలపై చర్చించారు.

సభా సమయం

ప్రతి పక్షాలు తమ అభిప్రాయాలను తెలిపేందుకు వీలుగా డీఎంకేకు 31 గంటల 21 నిమిషాలు, ఇత ర పార్టీల సభ్యులకు 20 గంటల 24 నిమిషాలు, అన్నాడీఎంకే సభ్యులకు 17 గంటల 45 నిమిషా లు, అధికార పక్ష సభ్యులకు 17 గంటల 43 నిమి షాలు సమయం కేటాయించినట్టు ప్రకటించారు. 17వ శాసనసభ వ్యవహారాలమొత్తాన్ని సుదీర్ఘంగా ప్రత్యక్ష ప్రసారం చేసి రికార్డు సృష్టించారు. ఆగస్టు 5 నుండి సెప్టెంబర్‌ 8 వరకు జరిగిన బడ్జెట్‌, పద్దులపై జరిగిన చర్చల ప్రసారాలకు ఏకంగా 10,92,182 ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారని స్పీకర్‌ పేర్కొన్నారు. మొత్తంగా, ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ, విపక్షాలకు తగిన ప్రాధాన్యమిస్తూ, ప్రజా సంక్షేమమే పరమావధిగా ఈ సమావేశాలు సాగాయని ప్రకటించారు. అలాగే సభను ప్రత్యక్షంగా 32 వేల మంది వీక్షించి ఉన్నా రు. గతంలో అనుమతి దొరుకుతుందో లేదోనన్న సందేహంతో చాలామంది అసెంబ్లీ కార్యకలాపాలను ప్రత్యక్షంగా వీక్షించడానికి వెనుకాడేవారని, కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి మారి ప్రజల రాక పెరగడం సంతోషకరమని స్పీకర్‌ అభిప్రాయపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement