సాక్షి, చైన్నె : కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శ్రీలంక పర్యటనతో తమిళనాడుతో పాటూ ఇతర రాష్ట్రాలకు సంబంధించిన జాలర్ల సమస్యలకు పరిష్కారం లభిస్తుందనే నమ్మకం నెలకొందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్‌నాగేంద్రన్ వ్యాఖ్యానించారు. బుధవారం ఈ విషయంగా ఆయన స్థానికంగా స్పందిస్తూ, జాలర్ల సమస్యలకు పరిష్కారం లభిస్తుందనే నమ్మకం భారత్, శ్రీలంక దేశాల ప్రజలలో నెలకొని ఉండటం శుభ పరిణామంగా పేర్కొన్నారు. రాజ్‌నాథ్ సింగ్ 3 రోజుల పాటు శ్రీలంకలో పర్యటిస్తున్నారని గుర్తు చేశారు. 1988లో అప్పటి రక్షణ మంత్రి కే.సీ. పంత్ కొలంబో సందర్శించారని, ఆతర్వాత 38 ఏళ్లకు భారత రక్షణ మంత్రి శ్రీలంకకు వెళ్లడం ఇదే తొలిసారి అని వివరించారు.
వ్యూహాత్మక రక్షణ చర్యలు
హిందూ మహాసముద్రంలో చైనా పరిశోధన, యుద్ధ నౌకల కదలికలు పెరుగుతున్న నేపథ్యంలో, శ్రీలంక రక్షణ దళాలకు గస్తీ నౌకలు, డోర్నియర్ విమానాలు , ఆర్థిక సహాయం అందించడం ద్వారా భారత్ తన పర్యవేక్షణను విస్తరిస్తున్నట్టు తెలిపారు.ఈ పర్యటన వలన ‘స్లినెక్స్‘, ‘మిత్ర శక్తి‘ వంటి ద్వైపాక్షిక సైనిక బంధాలు మరింత బలపడతాయన్నారు. త్రికోణమలై చమురు నిల్వల భద్రత మెరుగుపడటంతో పాటు శ్రీలంక సైనిక బలగాలకు భారత్‌లో శిక్షణ అవకాశాలు పెరుగుతాయన్నారు.
జాలర్లకు ప్రయోజనాలు
ఇరు దేశాల కోస్ట్‌గార్డ్ విభాగాల మధ్య తక్షణ సమాచార వ్యవస్థను ఏర్పాటు చేయడం ద్వారా జాలర్లను తప్పుగా అర్థం చేసుకుని అరెస్టు చేయడం, పడవలను జప్తు చేయడం వంటి ఘటనలకు ముగింపు పలికేలా చర్చలు జరుగుతాయని భావిస్తున్నామన్నారు. పొరుగు దేశాలతో దృఢమైన సంబంధాలు ఏర్పరచుకోవడానికి ఇటువంటి పర్యటనలు ఎంతో అవసరమని పేర్కొంటూ, రాజ్‌నాథ్ సింగ్ శ్రీలంక పర్యటన విజయవంతం అవుతుందని, ప్రధానంగా తమిళ జాలర్లకు బలానిన చేకూరుస్తుందని ఆయన ఆకాంక్షించారు.


