తాయ్‌ మామన్‌ బంగారు ఉంగరం పథకం వాయిదా | - | Sakshi
Sakshi News home page

తాయ్‌ మామన్‌ బంగారు ఉంగరం పథకం వాయిదా

Sep 10 2026 1:39 AM | Updated on Sep 10 2026 1:39 AM

– ఆరోగ్య శాఖ మంత్రి అరుణ్‌రాజ్‌

సాక్షి, చైన్నె: విదే శీ పర్యటన కారణంగా సెప్టెంబర్‌ 15న ప్రారంభం కావాల్సిన ‘తాయ్‌ మామన్‌ బంగారు ఉంగరం’ (మేన మామ బంగారు ఉంగరం) పథకం వాయిదా పడుతోందని తమిళనాడు ఆరోగ్య శాఖ మంత్రి అరుణ్‌రాజ్‌ తెలిపారు. చైన్నె రాజీవ్‌ గాంధీ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సీపీఐ సీనియర్‌ నాయకుడు డి. రాజాను పరామర్శించిన అనంతరం మంత్రి మీడియా సమావేశంలో మాట్లాడారు. సీఎం విదేశీ పర్యటన వల్ల ఈ పథకం ప్రారంభం వాయిదా పడిందరన్నారు. మధురై జిల్లా ఉసిలంపట్టి ప్రభుత్వ ఆసుపత్రి వేదికగా ఈనెల 25న సీఎం విజయ్‌ ఈ పథకాన్ని ప్రారంభించనున్నారన్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడుతుంన్నారు. ఈ పథకం కింద పంపిణీ చేసే ప్రతీ ఒక్క గ్రాము బంగారు ఉంగరం 916 (22 క్యారెట్‌) నాణ్యతతో ఉండేలా పూర్తి పరీక్షల అనంతరమే పంపిణి చేస్తామన్నారు. లబ్ధిదారులు కూడా ఉంగరం నాణ్యతను స్వయంగా తనిఖీ చేసుకోవచ్చు అని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో జన్మించే శిశువులకు ఒక గ్రాము బంగారు ఉంగరాన్ని అందించే ఈ పథకానికి ఏటా రూ. 755.83 కోట్లు కేటాయించనున్నామన్నారు. కాగా, పిల్లలకు ఎముక మజ్జ అవసరం ఎక్కువగా ఉన్నందున, రక్తదానం , నేత్రదానం లాగే స్టెమ్‌ సెల్‌ దానానికి ముందుకు రావాలని, దీనికి సంబంధించి ముందస్తు నమోదు ప్రక్రియను ప్రారంభించనున్నట్లు మంత్రి తెలిపారు.

టీఎన్‌సీసీ మీడియా వింగ్‌ అధ్యక్షుడిగా విజయ్‌ వసంత్‌

సాక్షి, చైన్నె: తమిళనాడు కాంగ్రెస్‌ పార్టీ సోషల్‌ మీడియా విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా కన్యాకు మారి ఎంపీ విజయ్‌ వసంత్‌ను నియమిస్తూ అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీ నిర్ణయం తీసుకుంది. తమిళనాడు కాంగ్రెస్‌ సోషల్‌ మీడియా విభాగానికి రాష్ట్ర అధ్యక్షుడు , కోఆర్డినేటర్లను నియమించే ప్రతిపాదనకు కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున కార్గే ఆమోదం తెలిపారని ఎఐసీసీ ప్రధాన కార్యదర్శి కే.సీ. వేణుగోపాల్‌ ప్రకటించారు. ఈ కొత్త నియామకాలు తక్షణమే అమల్లోకి వస్తాయని వెల్లడించారు. రాష్ట్ర అధ్యక్షుడిగా విజయ్‌ వసంత్‌ వ్యవహరిస్తుండగా, ఈ విభాగం కోఆర్డినేటర్లుగా శక్తి మారిదాసన్‌, జీ.కే. మురళీధరన్‌, శివసత్యరాజా గుణశేఖరన్‌, సంజయ్‌ గాంధీ, జాన్‌ శామ్యూల్‌, అబ్దుల్‌ రెహమాన్‌ నియమితులయ్యారు.

ప్రత్యేక విభాగంగా దేవాదాయ శాఖ ఆవిర్భావం

సాక్షి, చైన్నె : తమిళనాడులోని ఆలయాల నిర్వహణను మరింత మెరుగుపరిచేందుకు వీలుగా హిందూ దేవాదాయ శాఖను ప్రత్యేక స్వతంత్ర శాఖగా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. గత డీఎంకే ప్రభుత్వ హయాంలో ఈ విభాగం టూరిజం, సాంస్కృతిక, దేవాదాయ శాఖ కింద ఒక భాగంగా పనిచేసేది. కొత్త ప్రభు త్వం ఏర్పాటయ్యాక దీనిని వాణిజ్య పన్నులు , రిజిస్ట్రేషన్ల శాఖ పరిధిలోకి తీసుకొచ్చారు.

ప్రత్యేక శాఖగా గుర్తింపు

పరిపాలనా సౌలభ్యం, పనుల వేగవంతం కోసం దేవాదాయ శాఖను ఇప్పుడు పూర్తిస్థాయి ప్రత్యేక శాఖగా మారుస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎం.సాయి కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. తమిళ అభివృద్ధి, సమాచారశాఖ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న వి.రాజారామన్‌కు దేవాదాయ శాఖ అదనపు బాధ్యతలను అప్పగించారు. ఈ ప్రత్యేక శాఖ ఏర్పాటుకు అనుగుణంగా తమిళనాడు ప్రభు త్వ వాణిజ్య నిబంధనలు 1978లో అవసరమైన మార్పులు త్వరలోనే చేయనున్నారు. ఇందుకు సంబంధించిన చర్యలను మానవ వనరుల నిర్వహణ శాఖ చేపట్టనుందని జీవోలో పేర్కొన్నారు.

4 రోజులు ఆగనున్న బ్యాంక్‌ సేవలు

సాక్షి, చైన్నె: దేశవ్యాప్తంగా ప్రభుత్వరంగ బ్యాంకులు, సహకార సంఘాలు, గ్రామీణ బ్యాంకుల ఉద్యోగులు అధికారులు ఒక రోజు సమ్మెకు పిలుపునిచ్చారు. ఈ సమ్మెతో పాటు వరుసగా వచ్చే సెలవుల కారణంగా 4 రోజుల పాటు బ్యాంకింగ్‌ సేవలకు తీవ్ర అంతరాయం కలగనుంది. శుక్రవారం బ్యాంకు ఉద్యోగులు, అధికారుల ఒక రోజు దేశవ్యాప్త సమ్మెకు పిలుపు నిచ్చారు. శనివారం బ్యాంకులకు సెలవు. ఆ మరసటి రోజు ఆదివారం, ఆతదుపరి రోజు సోమవారం వినాయక చవితి సందర్భంగా ప్రభుత్వ సెలవు. వరుస సెలవులతో చెక్కుల క్లియరింగ్‌, డిపాజిట్లు, విత్‌డ్రాయల్స్‌, విదేశీ మారక ద్రవ్య లావాదేవీలు పూర్తిగా స్తంభించిపోనున్నాయి. 4 రోజుల పాటు డిపాజిట్‌ ప్రక్రియ నిలిచిపోవడంతో ఏటీఎంలలో నగదు కొరత ఏర్పడే అవకాశం ఉంది. ప్రతి నెలా అన్ని శని, ఆదివారాలు బ్యాంకులకు సెలవు దినాలుగా ప్రకటించాలనే మూడేళ్ల క్రితం నాటి డిమాండ్‌ను కేంద్ర ప్రభుత్వం అమలు చేయకపోవడం. ఉద్యోగులు, అధికారుల ఇతర పెండింగ్‌ డిమాండ్లపై యాజమాన్యం ప్రభుత్వం చర్చలు జరిపి పరిష్కరించకపోవడాన్ని నిరసిస్తూ ఒక రోజు సమ్మెకు బ్యాంక్‌ ఉద్యోగులు సిద్ధమయ్యారు. కాగా, ఈ నెల 28 నుండి 30 వరకు మరో 3 రోజుల సమ్మె సైతం చేపట్టనుండడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement