అందరికీ సమానంగా వైద్యం! | - | Sakshi
Sakshi News home page

అందరికీ సమానంగా వైద్యం!

Aug 20 2026 3:52 AM | Updated on Aug 20 2026 3:52 AM

న్యూస్‌రీల్‌

అసెంబ్లీలో సీఎం విజయ్‌ వ్యాఖ్యలు

సీఎం బీమా రూ. 25 లక్షలకు పెంపు

7 ఆసుపత్రులలో ట్రాన్స్‌జెండర్లకు శస్త్ర చికిత్సలు

పాల కొనుగోలు ధర పెంపు

ఎమ్మెల్యేలందరికీ వాహనాలు, పీఏ కేటాయింపు

‘పేద–ధనిక, పల్లె–పట్నం అనే తేడా

లేకుండా ప్రతి ఒక్కరికీ నాణ్యమైన వైద్యాన్ని సమానంగా అందించడమే ప్రభుత్వ

ముఖ్య ఉద్దేశం.’ అని సీఎం విజయ్‌

అసెంబ్లీలో ప్రకటించారు. సీఎం విస్తృత

వైద్య భీమా పథకం పరిమితిని ఏడాదికి

రూ. 5 లక్షల నుంచి రూ. 25 లక్షలకు

పెంచుతూ ప్రకటన చేశారు. పాల కొనుగోలు ధరను పెంచుతూ ప్రకటన చేయడమే కాకుండా, ఎమ్మెల్యేలందరికి ప్రభుత్వ వాహనాలు

అందజేయనున్నామని వెల్లడించారు.

సాక్షి, చైన్నె : అసెంబ్లీ సమావేశాలలో భాగంగా బుధవారం సభలో రూల్‌ 110 కింద సీఎం విజయ్‌ పలు కీలక ప్రకటనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, ‘‘ఒక మనిషి ప్రాణం విలువను వారి ఆదాయం నిర్ణయించకూడదు. ధనిక, పేద అనే తారతమ్యం వైద్య రంగంలో ఉండకూడదు. అందరికీ సమానమైన, సులువైన వైద్య సేవలు అందాలనేదే మా ప్రభుత్వ లక్ష్యం. వైద్యం అనేది ఆఫర్‌ కాదు, అది ప్రతి ఒక్కరి ప్రాథమిక హక్కు’’ అని ఉద్వేగంగా వ్యాఖ్యలు చేశారు.

ఉత్తర చైన్నెలో సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి

ఉత్తర చైన్నె ప్రజలకు ఉన్నత స్థాయి వైద్యం అందుబాటులో ఉండేలా పెరంబూరులో రూ. 300 కోట్ల అంచనా వ్యయంతో 400 పడకల ప్రపంచ స్థాయి మల్టీ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మించబడుతుందని ప్రకటించారు. ఆరోగ్య భీమా పరిమితిని రూ. 5 లక్షల నుండి రూ. 25 లక్షలకు పెంచారు. ట్రానన్స్‌జెండర్లకు సంబంధించి వైద్య, శస్త్రచికిత్స సేవలను చైన్నె స్టాన్లీ, తిరునెల్వేలి, తూత్తుకుడి, చెంగల్పట్టు, తిరువారూర్‌, ధర్మపురి , కన్యాకుమారిలలోని 7 ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ ఆసుపత్రులలో ఉచితంగా అందిస్తామని వివరించారు.

నర్సింగ్‌ – పారామెడికల్‌ సీట్ల పెంపు:

రూ. 351 కోట్ల అంచనా వ్యయంతో నర్సింగ్‌, ఫార్మసీ, పారామెడికల్‌ కోర్సులలో మొత్తం 6,098 అదనపు సీట్లను అందుబాటులోకి తీసుకు రానున్నామన్నారు.. ఇందులో 7 కొత్త ప్రభుత్వ నర్సింగ్‌ కాలేజీల ఏర్పాటు కూడా ఉందని వివరించారు. సీఎం క్యాన్సర్‌ కేర్‌ మిషన్‌ పేరిట క్యాన్సర్‌ నివారణ, నాణ్యమైన చికిత్స కోసం రూ. 673.44 కోట్లు కేటాయించారు. చైన్నె రాజీవ్‌ గాంధీ ప్రభుత్వ ఆస్పత్రిలో రూ. 471.80 కోట్లతో 14 అంతస్తుల సమగ్ర క్యాన్సర్‌ చికిత్స విభాగాన్ని ఏర్పాటు చే యనున్నామన్నారు. తంజావూరు, కోయంబత్తూర్‌, మధురై, తిరునెల్వేలి, విల్లుపురంలలో రిజినల్‌ క్యాన్సర్‌ కేర్‌ సెంటరు ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. రోబోటిక్‌ సర్జరీ, అధునాతన రేడియేషన్‌ చికిత్స పరికరాల కోసం మెడికల్‌ కాలేజీలకు రూ. 106.17 కోట్లు కేటాయించారు. ధర్మపురి, విల్లుపురం, తిరువణ్ణామలై, పెరంబలూర్‌, అరియలూర్‌ జిల్లాల్లో 1.22 లక్షల మంది మహిళలకు రూ. 8.70 కోట్ల ఖర్చుతో హెచ్‌పీవీ డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహిస్తారని తెలిపారు.

పొగడ్తలు వద్దు

సభలో సీఎం విజయ్‌ను పొగడ్తలతో టీవీకే సభ్యులు ముంచెత్తడంతో స్పీకర్‌ జేసీడీ ప్రభాకర్‌ ద్వారా బ్రేక్‌ వేయించారు. సభ్యులు ఇకపై సీఎం విజయ్‌ను పదే పదే పొగడ్తలతో ముంచెత్తాల్సిన అవసరం లేదని, సమయాన్ని వృథా చేయకుండా ప్రజా సమస్యలపై సభలో ప్రస్తావించాలని, ఈ విషయాన్ని తాను చెప్పడం లేదని, స్వయంగా సీఎం తనకు ఓ చీటి రాసి పంపించి చెప్పమన్నారంటూ ఉపదేశం చేయడం గమనార్హం.

ఎమ్మెల్యేలందరికీ వాహనాలు..

పాడి రైతుల సంక్షేమం,మ జీవనోపాధిని దృష్టిలో ఉంచుకుని, సహకార సంఘాల ద్వారా లీటరు పాల సేకరణ ధరపై రూ. 1, ప్రభుత్వ ప్రోత్సాహకం (సబ్సిడీ) రూ. 2 పెంచి.. ఇకపై లీటరు పాలను రూ. 41కి సేకరించడం జరుగుతుందని శాసనసభలో మరో ప్రకటనను సీఎం విజయ్‌ చేశారు. ‘‘తన సంతానానికే కాకుండా మానవులకు కూడా పాలనిచ్చే గోవును దైవంగా భావించి పూజించడం మన సంస్కృతిలో భాగం’’ అని వ్యాఖ్యలు చేస్తూ, తమిళనాడులోని 8,800 పాల సహకార సంఘాల ద్వారా దాదాపు 3.16 లక్షల మంది పాడి రైతుల నుండి ప్రతిరోజూ 34 లక్షల లీటర్ల పాలు సేకరిస్తున్నామన్నారు. ఆవిన్‌ సంస్థ ద్వారా రోజుకు 31 లక్షల లీటర్ల పాలను వినియోగదారులకు విక్రయిస్తున్నారని వివరించారు. ఇది వరకు లీటరు కొనుగోలు ధర రూ. 38గా ఉండేదని గుర్తు చేస్తూ, తాజాగారూ. 3 పెంచి రూ. 41కి కొనుగోలు చేయనున్నామన్నారు. రాష్ట్రంలోని 3.16 లక్షల మందికి పైగా పాడి రైతులకు ఇది ప్రయోజనం చేకూర్చనున్నదన్నారు.ఈ పెంపు వలన ప్రభుత్వానికి నెలకు రూ. 30 కోట్లు, ఏడాదికి రూ. 360 కోట్లు అదనపు ఖర్చు అవుతుందన్నారు.

నేనూ బాగానే మాట్లాడుతా..

పంచాయతీరాజ్‌, విద్యా శాఖ, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధికి సంబంధించిన గ్రాంట్ల అభ్యర్థనలపై చర్చ సందర్భంగా మంత్రి ఆనంద్‌ సమాధానాలు ఇచ్చిన క్రమంలో తమపై చేసిన ఆరోపణలకు డీఎంకే వర్గాలు తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. ఈ సమయంలో హఠాత్తుగా లేచి నిలబడ్డ సీఎం విజయ్‌ ప్రతి పక్షాలు ప్రతి ఒక్క అంశానికి ఆధారం..ఆధారం అని అడుగుతున్నాయని వివరించారు. ఇందుకు ఆధారం తన టేబుల్‌పై ఉందన్నారు. ప్రస్తుతం 3 ఫైళ్లు ఉన్నాయని, వాటిని ప్రస్తుతం తెరిచే పరిస్థితి తెచ్చుకోవద్దని హితవు పలికారు. అవసరమైనప్పుడు అందులోని ఆధారాలను సాక్ష్యాలుగా బయట పెడుతానని, తాను ప్రజలతో ఎప్పడు మాట్లాడాలి?, ఎలా మాట్లాడాలి?, వారితో తాను ఎలా మాట్లాడాను.. అంటూ ప్రేమత, ఆప్యాయంగా తనను తీసుకొచ్చి ఈసీటులో ప్రజలు కూర్చోబెట్టారని , తానూ మాట్లాడగలనంటూ మాస్‌ వార్నింగ్‌ ఇచ్చారు. ఉపఎన్నికలలోనైనా తమరికి మంచి జరగాలంటూ చమత్కరించారు. కాగా, సభలోని డీఎంకే సీనియర్‌ నేత దురై మురుగన్‌ను ఉద్దేశించి టీవీకే ఎమ్మెల్యే ఆరోపణలు చేయడాన్ని డీఎంకే తీవ్రంగా వ్యతిరేకించింది. దీంతో ఆయన వ్యాఖ్యలను రికార్డుల నుంచి స్పీకర్‌ తొలగించారు. ఇక, డీఎంకే ఎమ్మెల్యే ఐపెరియస్వామి తన ప్రసంగంలో ప్రభుత్వ లోగుట్టును బయటపెట్టారు. గృహ నిర్మాణాలకు గతంలో తాము కేటాయించిన నిధులే ప్రస్తుతం కూడా కేటాయించారని, అయితే, లబ్ధిదారులకు ఇచ్చే మొత్తాన్ని పెంచినట్టు పెంచి, లబ్ధిదారుల సంఖ్యను తగ్గించేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు.

శాసనసభలో ఎమ్మెల్యే జ్యోతి మణి చేసిన విజ్ఞప్తిపై సీఎం విజయ్‌ అసెంబ్లీ వేదికగా మూడో ప్రకటన చేశారు. ‘‘సామాన్య నేపథ్యం ఉన్నవారిని ప్రజలు ఎమ్మెల్యేలుగా ఎన్నుకున్నారు. వారు ప్రజల సేవను ఎలాంటి ఆటంకం లేకుండా చేయడానికి వీలుగా ఎమ్మెల్యేలందరికీ ప్రభుత్వం తరఫున వాహనం అందించబడుతుంది. వాహన ఇంధనం, డ్రైవర్‌ తదితర నిర్వహణ ఖర్చుల కోసం నెలకు రూ. 75,000 అందజేస్తారు’’ అని ప్రకటించారు. అలాగే ఎమ్మెల్యేలు తమ వ్యక్తిగత సహాయకుడిని (అసిస్టెంట్‌) నియమించుకోవడానికి నెలకు రూ. 25,000 ఇవ్వడం జరుగుతుందని ప్రకటించారు. కాట్టుమన్నార్కోవిల్‌ నియోజకవర్గ సభ్యుడు జోతిమణి విజ్ఞప్తిని గుర్తు చేస్తూ, , చాలామంది ఎమ్మెల్యేల కు సొంత వాహనాలు లేవని, నియోజకవర్గ పనులను పరిశీలించడం కష్టంగా ఉందని కోరారని, ఆర్థిక బలం లేకుండా తొలిసారిగా శాసనసభకు ఎన్నికై నవారు ప్రజాసేవను నిరంతరాయంగా కొనసాగించేందుకు వీలుగా అందరి ఎమ్మెల్యేలకు ప్రభుత్వం తరఫున వాహనం అందించబడుతుందన్నారు. వాహన నిర్వహణ, డ్రైవర్‌, ఇంధన ఖర్చుల కోసం నెలకు రూ. 75 వేలు, కార్యాలయ పనుల్లో సహాయపడేందుకు ఒక సహాయకుడిని నియమించుకోవడానికి నెలకు రూ. 25 వేలు అలవెన్స్‌గా అందిస్తారన్నారు. సీఎం చేసిన ఈ ప్రకటనకు వీసీకే ఎమ్మెల్యే జ్యోతి హర్షం వ్యక్తం చేశారు. సీఎం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల చాలామందికి ఉపాధి లభిస్తుందని మంత్రి రాజ్‌ మోహన్‌ పేర్కొన్నారు. టీవీకే ఎమ్మెల్యే సింధు అయితే, ఎంజీఆర్‌ చిత్రంలోని ఓ పాటను సభలో పాడి సీఎంను పొగడ్తలతో ముంచేశారు. ఏఎంఎంకే ఎమ్మెల్యే కామరాజ్‌ అయితే, తనకు చాలా కార్లు ఉన్న ప్పటికీ, సీఎం విజయ్‌ ప్రభుత్వం ఇచ్చే కారులో నియోజకవర్గంలోకి వెళ్లడం ఒక గెత్తు(గొప్పతనం) అంటూ వ్యాఖ్యలు చేశారు. టీవీకే ఎమ్మెల్యేషణ్ముగం అయితే, మరో అడుగు ముందుకు వేసి ఇచ్చేకారు ఏదో ఇన్నోవాగా ఉంటే బాగుటుందంటూ చమత్కరించి సభలో నవ్వులు పూయించారు. పెరియకులం ఎమ్మెల్యే శబరి మాట్లాడుతూ కళాశాల చదువుకునే రోజులలో ప్రేమ విఫలమైందని, ఆ సమయంలో తనకు ఏమీ లేదని, ఇప్పుడు తనకు ఓ పని ఇచ్చి...కారు కూడా సీఎం విజయ్‌ ఇస్తున్నారంటూ ఆనందంలో ఉబ్బితబ్బి పోయారు. తాను రైలులో ప్రయాణించి, ఆటో పట్టుకుని చైన్నె సచివాలయానికి వచ్చేలోపు పలు చోట్ల భద్రతా సిబ్బంది వద్ద ఎమ్మెల్యే..ఎమ్మెల్యే అని ఐడీ కార్డు చూపించుకోవాల్సి ఉందని వ్యాఖ్యలు చేశారు. చివరకు అసెంబ్లీలోకి రావాలన్నా ఐడీ కార్డు చూపించుకుని లోనికి వస్తున్నట్టు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement