ఆగని బస్సులు! | - | Sakshi
Sakshi News home page

ఆగని బస్సులు!

Aug 20 2026 3:52 AM | Updated on Aug 20 2026 3:52 AM

● ఫిర్యాదుల జోరు ● కండెక్టర్లు, డ్రైవర్లకు ఎంటీసీ హెచ్చరిక

సాక్షి, చైన్నె: నిర్దేశించిన బస్సు స్టాప్‌లలో బస్సులను ఆపడం లేదంటూ ఎంటీసీకి ఫిర్యాదులు హోరెత్తుతున్నాయి. దీంతో ప్రయాణికులను బస్సు ఆపి మరీ, లోనికి ఎక్కించుకుని వెళ్లాలని డైవర్లు , కండెక్లర్లకు చైన్నెనగర రవాణా సంస్థ (ఎంటీసీ) ఆదేశించింది. వివరాలు.. చైన్నె నగరంలో వివిధ మార్గాలలో బస్సు స్టాప్‌లలో ప్రయాణికులు, ముఖ్యంగా మహిళలు బస్సును ఆపమని సైగ చేసినప్పటికీ, కొన్ని బస్సులు ఆగకుండా వెళ్తున్నాయని ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. ప్రయాణికులకు నాణ్యమైన, సురక్షితమైన ,నమ్మకమైన ప్రజా రవాణా సేవలను అందించడం ఎంటీసీ ప్రాథమిక బాధ్యతగా ఉంది. ఈ దృష్ట్యా, కొందరు డ్రైవర్లు, కండక్టర్ల తీరుతో ఎంటీసీ విమర్శల పాలు అవుతున్నది. దీంతో ఎంటీసీ ఉన్నతాధికారులు స్పందించారు. డ్రైవర్లు, కండెక్లర్ల పాటించాల్సిన మార్గదర్శకాలను తప్పనిసరిచేస్తూ ఆదేశాలు ఇచ్చారు.

స్టాప్‌లలో ఆపడం తప్పనిసరి

సాధారణ ఛార్జీల బస్సులు అన్ని బస్టాప్‌లలో తప్పనిసరిగా ఆపి ప్రయాణికులను ఎక్కించుకుని, దించాలని ఆదేశించారు. ఎక్స్‌ప్రెస్‌, డీలక్స్‌, ఏసీ బస్సులు తమకు కేటాయించిన నిర్దేశిత స్టాప్‌లలో తప్పక ఆపాల్సిందేనని స్పష్టం చేశారు. బస్సు లో ఎక్కేవారు, దిగే వారు, ప్రయాణించే వారితో కఠినంగా మాట్లాడటం, అవమానించేలా ప్రవర్తించడం లేదా ఎక్కించుకోవడానికి నిరాకరించడం వంటి చర్యలకు డ్రైవర్లు, కండక్టర్లు పాల్పడకూడదని హెచ్చరించారు.

క్రమశిక్షణా చర్యలు

బస్సు స్టాప్‌లలో ఆపకుండా వెళ్లడం, ప్రయాణికులను ఎక్కించుకోకపోవడం లేదా వారితో అనుచితంగా ప్రవర్తిస్తే కఠినమైన క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.బ్రాంచ్‌ మేనేజర్లు, జోనల్‌ మేనేజర్లు , సంబంధిత పరిశీలనాధికారులు మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో ముఖ్య మైన బస్సుస్టాప్‌లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి బస్సులు సరిగ్గా ఆగుతున్నాయో లేదో పర్యవేక్షించాలని ఆదేశించారు. కొత్తగా విధుల్లో చేరే డ్రైవర్లు, కండక్టర్లకు అలాగే రిఫ్రెషర్‌ శిక్షణకు వచ్చే సిబ్బందికి ఉన్నతాధికారులు ఆంక్షలు, మార్గదర్శకాలను పాటించేలా శిక్షణ ఇవ్వాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement