– 5 కి.మీ పరిధిలోని ప్రజలకు వర్తింపు
సాక్షి, చైన్నె : రామాపురంలోని ఎస్‌ఆర్‌ఎం ప్రైమ్ హాస్పిటల్ తమ సమీప ప్రాంతాల ప్రజల ఆరోగ్య సంరక్షణ, ప్రయోజనాలు లక్ష్యంగా ప్రైమ్ జోన్ అనే సరికొత్త హెల్త్ కేర్ సేవలకు శ్రీకారం చుట్టింది. ఆస్పత్రికి 5 కిలోమీటర్ల పరిధిలో ఉన్న కుటుంబాలకు నాణ్యమైన వైద్యాన్ని అత్యంత సులభంగా, తక్కువ ఖర్చుతో అందించడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని ప్రకటించింది. ఈ పథకం ద్వారా కేకే నగర్, రామాపురం, వలసరవాక్కం, మణపాక్కం, పోరూర్, మొగళివాక్కం, నేశపాక్కం, పరిసర ప్రాంతాల వారికి ప్రత్యేక వైద్య ప్రయోజనాలు లభించనున్నాయని వివరించింది. ఈ హెల్త్‌కేర్ సేవలను ప్రముఖ నేపధ్య గాయకుడు మనో ప్రారంభించారు. ఎస్‌ఆర్‌ఎం ప్రైమ్ హాస్పిటల్ సీఈఓ శివ, హెల్త్‌కేర్ సేవల వైస్ ప్రెసిడెంట్ సెల్వ రామసామి, అసిస్టెంట్ డైరెక్టర్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ శ్రీలేఖ వెంకటేశన్‌తో పాటు స్థానిక రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. మొదటి దశలో 10,000 కుటుంబాలకు ఉచితంగా ఎస్‌ఆర్‌ఎం ప్రైమ్ కార్డ్‌లను పంపిణీ చేయనున్నారు. ఈ కార్డుదారులు పొందే వారికి ప్రత్యేక వైద్య శిబిరాల ద్వారా పూర్తి ఉచిత హెల్త్ స్క్రీనింగ్, అన్ని వైద్య విభాగాల స్పెషలిస్ట్ వైద్యులతో నిర్ణీత సంఖ్యలో ఉచిత పరీక్షలు, ఉచిత డైట్ కన్సల్టేషన్‌తోపాటు రాయితీలను కల్పించనన్నారు. అలాగే 5 కి.మీ పరిధిలో అత్యవసర సమయాల్లో ఉచిత ఆంబులెన్స్ పిక్–అప్ సౌకర్యం కల్పిస్తూ చర్యలు తీసుకున్నామని ఆస్పత్రి సీఈఓ శివ తెలిపారు.


