తిరువళ్లూరు: కన్నిగైపేర్‌లోని ప్రసిద్ధి చెందిన సెల్లియమ్మన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారికి పెద్ద ఎత్తున పాలాభిషేకం చేశారు. తిరువళ్లూ రు జిల్లా ఎల్లాపురం యూనియన్ కన్నిగైపేర్ గ్రామంలో సెల్లియమ్మన్ ఆలయం వుంది. ఇక్కడ ప్రతి ఏటా ఆషాడ మాసం మూడవ శుక్రవారం పాలాభిషేకం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగానే 21వ సంవత్సరం పాలాభిషేక మహోత్సవాన్ని శుక్రవారం ఉదయం ఘనంగా నిర్వహించారు. అంతకు ముందు సుమారు రెండు వందల మంది మహిళలు పాల బిందెలతో ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. పుట్టింటి తరపున అమ్మవారికి పసుపు కుంకుమ, గాజులు, సారె సైతం సమర్పించారు. రాత్రి అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి గ్రామంలో ఊరేగించారు.
ఊత్తుక్కాట్టు ఎల్లైయమ్మన్‌కు పాలాభిషేకం
తిరువొత్తియూరు: పూందమల్లిలోని కుమనంచావిడిలో ఉన్న ఊత్తుక్కాట్టు ఎల్లైయమ్మన్ అమ్మవారికి 1,008 బిందెల పాలతో అభిషేకాన్ని ఘనంగా నిర్వహించారు. పూందమల్లి కుమనంచావిడిలోని ఊత్తుక్కాట్టు ఎల్లైయమ్మన్ ఆలయంలో 32వ ఏడాది ఆడి మాస ఉత్సవాలు గత వారం కాప్పుకట్టు (రక్షాబంధనం) కార్యక్రమంతో ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో ప్రతిరోజూ అమ్మవారికి ఈశ్వరి, చాముండేశ్వరి, కా మాక్షి, మహాలక్ష్మి, కరుమారి, కంబానది, మహిషాసు ర మర్దిని, ఎల్లైయమ్మన్, సమయాపురం మారియమ్మ న్ వంటి వివిధ అలంకారాలు చేసి భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు. ఇందులో భాగంగా గురువారం 1,008 బిందెల పాలతో అభిషేకం చేశారు. మహిళలు కాట్టుపాక్కం వేంబులి అమ్మన్ ఆలయం నుంచి 1,008 బిందెలలో పాలు తీసుకుని ఊరేగింపుగా పూందమల్లి రహదారి గుండా 3 కిలోమీటర్లు నడిచి ఆలయానికి చేరుకున్నారు. అనంతరం అమ్మవారికి అభిషేకం చేశా రు. తమిళనాడు అంతటా సమృద్ధిగా వర్షాలు కురవాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని పాలాభిషేకం చేసినట్టు ఆలయ నిర్వాహకులు తెలిపారు. సాయంత్రం అమ్మవారికి మహా దీపారాధన, ఉత్సవ మూర్తి వీధి ఊరేగింపు కార్యక్రమాలు జరిగాయి. ఉత్సవ ఏర్పాట్ల ను ఆలయ ధర్మకర్త పూవై ఎమ్.జ్ఞానం, నిర్మలా జ్ఞా నం, డాక్టర్ ప్రేమ్ కుమార్, వారి కుటుంబ సభ్యులు, ఉత్సవ కమిటీ సభ్యులు, దాతలు, గ్రామ ప్రజలు చేశారు. వేలాది మంది భక్తులకు అన్నదానం చేశారు.
వేలూరు, తిరువణ్ణామలైలో..
వేలూరు: వేలూరు, తిరువణ్ణామలై జిల్లాల్లోని అమ్మవారి ఆలయాల్లోనూ ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. వాలాజలోని ధన్వంతరి ఆరోగ్య పీఠంలో పీఠాఽధిపతి మురళీధర స్వామిజీ ఆధ్వర్యంలో వరమహాలక్ష్మి యాగం, శాంతి దుర్గ హోమం చేశారు. అదే విధంగా పీఠంలోని నవదుర్గ అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, పుష్పాలంకరణలు చేసి భక్తులకు దర్శనం కల్పించారు. తిరువణ్ణామలై అరుణాచలేశ్వరాలయంలోని ఉన్నామలై అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు చేశారు. వేలూరు జిల్లాలో ప్రసిద్ది చెందిన వెట్టువనం పడవేటమ్మన్ ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేసి ప్రత్యేక అలంకరణలు చేశారు. తొర్రపాడిలోని పడవేటమ్మన్ ఆలయ కరగం భక్తుల మేళ తాళాల నడుమ ఊరేగింపుగా తీసుకొచ్చి భక్తులకు అంబలి పోశారు.


