శస్త్రచికిత్స లేకుండానే గుండె వాల్వ్‌లకు చికిత్స | - | Sakshi
Sakshi News home page

శస్త్రచికిత్స లేకుండానే గుండె వాల్వ్‌లకు చికిత్స

Jul 11 2026 12:42 AM | Updated on Jul 11 2026 12:42 AM

సాక్షి, చైన్నె : వైద్య రంగంలో చైన్నె అల్వార్‌పేట్‌లోని కావేరీ హాస్పిటల్‌ అరుదైన రికార్డును సృష్టించింది. ఒక రోగిలో పాడైపోయిన రెండు గుండె వాల్వ్‌లకు, ఎలాంటి ఓపెన్‌–హార్ట్‌ సర్జరీ లేకుండా క్యాథెటర్‌ విధానం ద్వారా విజయవంతంగా చికిత్స అందించారు. వైద్య చరిత్రలోనే రాస్‌ ప్రొసీజర్‌ తర్వాత ఇలాంటి డబుల్‌ వాల్వ్‌ చికిత్స చేయడం ప్రథమమని వైద్య నిపుణులు భావిస్తున్నారు. ఈ విధానం గురించి శుక్రవారం జరిగిన సమావేశంలో డాక్టర్‌ రాజారామ్‌ అనంతురామన్‌ బృందం వివరించింది. ఈ అరుదైన చికిత్సను 58 ఏళ్ల వ్యక్తికి నిర్వహించామన్నారు. ఆయనకు సుమారు 25 సంవత్సరాల క్రితం రాస్‌ ప్రొసీజర్‌ అనే సంక్లిష్టమైన గుండె ఆపరేషన్‌ జరిగిందన్నారు. ఈ విధానంలో రోగి స్వంత పల్మనరీ వాల్వ్‌ను తీసి పాడైపోయిన అయోర్టిక్‌ వాల్వ్‌ స్థానంలో అమర్చినట్టు పేర్కొన్నారు. అలాగే పల్మనరీ వాల్వ్‌ స్థానంలో వేరొకరు దానం చేసిన మానవ వాల్వ్‌ను అమర్చామని తెలిపారు. ఈ ఆపరేషన్‌ దీర్ఘకాలం పాటు అద్భుతంగా పనిచేసినప్పటికీ, వయసు పెరిగే కొద్దీ ఈ రెండు వాల్వ్‌లు మళ్లీ పాడైపోయే పరిస్థితి వచ్చిందన్నారు. దీంతో ఆయన తీవ్రమైన సమస్యలలో పడ్డారని, రెండోసారి ఓపెన్‌–హార్ట్‌ సర్జరీ చేయడం ప్రాణాలకే ప్రమాదమని భావించి తాము సర్జరీ లేకుండానే క్యాథెటర్‌ ద్వారా రెండు వాల్వ్‌లను మార్చాలని నిర్ణయించామన్నారు. ఈ ప్రక్రియ కోసం అధునాతన హైబ్రిడ్‌ ఆపరేషన్‌ థియేటర్‌లో ఏఐ ప్రిడిక్టివ్‌ మోడలింగ్‌, వర్చువల్‌ వాల్వ్‌ ఇంప్లాంట్‌ టెక్నాలజీని ఉపయోగించామన్నారు. రెండు వారాల్లోనే అద్భుతంగా రోగి కోలుకున్నారని తెలిపారు. ఆస్పత్రి కో ఫౌండర్‌ అరవిందన్‌ సెల్వరాజ్‌ వైద్యులను అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement