కార్యకర్తలకు స్టాలిన్ లేఖ
10 రోజులే సమయం.. ఇంటింటికీ వెళ్లండి
జననాయగన్ లీక్‌పై స్పందించాల్సిన అవసరం లేదని వ్యాఖ్య
‘ప్రతి ఓటూ ఎంతో ముఖ్యం. నా పోలింగ్ బూత్ – విజయపు పోలింగ్ బూత్’ అని నిరూపించుకునేలా ప్రతి కార్యకర్త కష్టపడితే ప్రతి నియోజకవర్గంలోనూ విజయం తథ్యమని డీఎంకే అధ్యక్షుడు , సీఎం స్టాలిన్ వ్యాఖ్యానించారు. ఇదే ప్రతి కార్యకర్త నుంచి తాను ఆశిస్తున్నానని వ్యాఖ్యానించారు. ఆదివారం సామాజిక మాధ్యం వేదికగా డీఎంకే కేడర్‌కు స్టాలిన్ లేఖ రాశారు.
సాక్షి, చైన్నె : 2026 అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు పది రోజులు మాత్రమే సమయం ఉందని సీఎం స్టాలిన్ డీఎంకే కేడర్‌కు గుర్తి చేశారు. తాను ప్రతి చోటా కార్యకర్తల ఉత్సాహాన్ని స్వయంగా చూస్తున్నానని, తమిళనాడు ప్రజల్లో ఆనందాన్ని గమనిస్తున్నానని వ్యాఖ్యానించారు. గత ఐదేళ్ల ద్రావిడ మోడల్ పాలనలో ప్రతి పథకం ప్రజలకు అందించిన ప్రయోజనం అని పేర్కొంటూ, రాబోయే ద్రావిడ మోడల్ 2.ఓ పాలనలో చేపట్టబోయే విప్లవాత్మక పథకాలపై ప్రజల్లో ఉన్న అంచనాలు అన్ని నియోజకవర్గాల్లోనూ స్పష్టంగా కనిపిస్తున్నాయని వివరించారు. ఎన్నికల క్షేత్రంలో డిఎంకే కార్యకర్తల పనితీరు శత్రువులను సైతం విస్మయానికి గురిచేస్తుందనేది చరిత్ర అని పేర్కొంటూ, గత ఏడాది కాలంగా తమిళనాడులోని 75 వేల పోలింగ్ బూత్‌లో కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుస్తూనే ఉన్నారని పేర్కొన్నారు.. ప్రజలతో ఉన్న ఈ బంధం ఎప్పటికీ కొనసాగాలని, ముఖ్యంగా రానున్న ఈ 10 రోజులు కార్యకర్తలు ప్రజల్లో మమేకమై క్షేత్రస్థాయిలో పనిచేయాలని పిలుపు నిచ్చారు. ప్రతి గ్రామంలోనూ ఇంటింటికీ వెళ్లి కరపత్రాలను పంపిణీ చేస్తూ ఓట్లను సేకరించడంపై పూర్తి దృష్టి సారించాలని, కూటమి పార్టీలు పోటీ చేసే నియోజకవర్గాల్లో కూడా ’మీలో ఒకడినైన నేనే నిలబడ్డాను’ అనే భావనతో పనిచేసి విజయాన్ని ఖాయం చేయాలని సూచించారు. 92 ఏళ్ల వయసున్న ద్రావిడర్ కళగం అధ్యక్షుడు కి.వీరమణి మండుటెండలోనూ ప్రచారం చేస్తున్నారని, 80 ఏళ్లు దాటిన సోదరులు చిదంబరం, వైకో రాష్ట్రంలోని ప్రతి మూలకూ వెళ్లి ద్రావిడ మోడల్ పాలన మళ్లీ రావాల్సిన ఆవశ్యకతను వివరిస్తున్నారని పేర్కొన్నారు. 87 ఏళ్ల పార్టీ ప్రధాన కార్యదర్శి దురైమురుగన్ మొదలు, 28 ఏళ్ల చిన్న వయసున్న అవినాశి అభ్యర్థి డాక్టర్ కోకిలామణి వరకు బొంగరం వలే తిరుగుతూ పనిచేస్తున్నారన్నారు. అందరూ ఐక్యంగా , సమన్వయంతో పనిచేస్తున్నారన్న సమాచారం తన దృష్టికి వచ్చిందని, అలుపు లేకుండా శ్రమించడంలో డీఎంకే కార్యకర్తలకు సాటి ఎవరూ లేరని పేర్కొంటూ, భారతదేశానికే దిక్సూచిగా నిలిచే ద్రావిడ మోడల్ 2.ఓ పాలన లక్ష్యంగా దివంగత నేత కరుణానిధి సైనికులైన (కార్యకర్తలు) ఈ పదిరోజుల పాటుగా మరింతగా దూసుకెళ్లాలని పిలుపు నిచ్చారు.
జననాయకన్ లీక్‌పై స్పందించాల్సిన అవసరం లేదు:
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం రామనాథపురం జిల్లా పరమకుడిలో స్టాలిన్ పర్యటించారు. ఉదయాన్నే ఆయన వాకింగ్‌చే స్తూ పరమకుడి రోడ్లుపై తిరుగుతూ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేశారు. రామనాథపురం జిల్లాలో పోటీ చేస్తున్న డీఎంకే అభ్యర్థులు కాదర్ బాషా ముత్తురామలింగం (రామనాథపురం), కదిరవన్ (పరమకుడి), రాజకన్నప్పన్ (ముదుకులత్తూరు) , తిరువాడనై కాంగ్రెస్ అభ్యర్థి కరుమాణిక్కంకు మద్దతుగా గంటలకు పరమకుడి ప్రచారసభలో ప్రసంగించారు. అంతకుముందు, శివగంగ జిల్లా తిరుపత్తూరులో ప్రచారాన్ని ముగించుకుని పరమకుడిలోని ఓ ప్రైవేట్ మహల్‌లో బస చేశారు. ఉదయం పరమకుడిలో వాకింగ్‌కు వెళ్లిన స్టాలిన్, పరమకుడి గాంధీ విగ్రహం, పెరియ బజార్ ప్రాంతాల్లో ప్రజలను కలుసుకున్నారు. ఎమనేశ్వరం ప్రాంతంలో ప్రజలతో ముచ్చటించి డిఎంకే అభ్యర్థులకు ఓటు వేయాలని కోరారు. ప్రజలు ముఖ్యమంత్రితో కరచాలనం చేస్తూ, సెల్ఫీలు దిగుతూ, పుస్తకాలను బహుకరిస్తూ సంతోషం వ్యక్తం చేశారు.
మహిళలను పలకరిస్తున్న స్టాలిన్
పిల్లలతో ముచ్చటిస్తూ...
మగ్గంపై స్టాలిన్
విలేకరులతో మాట్లాడుతూ:
‘నేను రోజూ నడవడం కేవలం ఓటర్లను కలవడం కోసం మాత్రమే కాదని, చైన్నెలో ఉన్నా, ఏ ఊరికి వెళ్లినా ఉదయాన్నే నడవడం తనకు అలవాటు అని పేర్కొన్నారు. ఇప్పుడు ఎన్నికల సమయం కావడంతో నడక సమయంలో ప్రజలు వచ్చి నన్ను కలుస్తున్నారన్నారు. పళనిస్వామి ఓటమి భయంతో నిరాశలో ఉన్నారని, ఆ విరక్తిలోనే డీఎంకే నాయకులపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. తమిళనాడుకు, ఢిల్లీకి మధ్యే పోటీ అని నేను చెప్పడానికి కారణం.. అన్నాడీఎంకే ముసుగు వేసుకుని రాష్ట్రంలోకి బీజేపీ ప్రవేశిస్తుండటమేనని వివరించారు. విజయ్ నటించిన ‘జననాయగన్’ సినిమా లీక్ గురించి ప్రశ్నించగా, స్పందించాల్సిన అవసరం లేదన్నారు. విజయ్ వ్యాఖ్యలపై ప్రశ్నించగా, నో కామెంట్స్ ... సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. కాగా రామనాథపురం జిల్లా మత్స్యకార సంఘాల సమాఖ్య స భ్యులు, రైతు సంఘాల ప్రతినిధులు, పరిశ్రమ, వాణిజ్య సంఘాల ప్రతినిదులు స్టాలిన్‌ను కలిసి తమ మద్దతు తెలియజేశారు.


