సాక్షి,చైన్నె : అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో ప్రచారాన్ని హోరెత్తించేందుకు ప్రధాని మోదీ రెండు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈనెల 15న, 18 తేదీలలో ఈ పర్యటనకు ఏర్పాట్లు కచేపట్టారు. బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. తాజాగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ సైతం ప్రచార బాట పట్టారు. విరుదునగర్‌జిల్లా సాత్తూరులో పోటీచేస్తున్న బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్‌కుమద్దతుగా ఆదివారం నితిన్ నబిన్ రోడ్ షో నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు అవినీతికి, సుపరిపాలనకు మధ్య జరుగుతున్న సమరంగా వ్యాఖ్యలుచేశారు. ఈ పరిస్థితులలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన ఖరారు కావడంతో బీజేపీవర్గాలలో జోష్ నెలకొంది. ఈనెల 15వ తేదీన కేరళ తిరువనంతపురం నుంచి నాగర్ కోయిల్‌కు పీఎం మోదీ హెలికాఫ్టర్‌లో రానున్నారు. కన్యాకుమారి జిల్లా నాగర్ కోయిల్‌లో రోడ్‌షో నిర్వహించనున్నారు. ఈ జిల్లాలోని ఎన్‌డీఏ కూటమి అభ్యర్థులకు మద్దతుగా ఫ్రచార సభలో ప్రసంగించి ఢిల్లీ బయలుదేరి వెళ్తారు. తదుపరి పర్యటనగా ఏప్రిల్ 18వ తేదిన కోయంబత్తూరు బహిరంగ సభకు ఏర్పాట్లు చేపట్టారు. కోయంబత్తూరులోని కొడిస్సీయా మైదానంలో జరగనున్న భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు. ఈ సభలో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామి సైతం పాల్గొనున్నారు.
ప్రధాని పర్యటనతో పాటుగా బీజేపీ అభ్యర్థుల కోసం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వేర్వేరు ప్రాంతాలలో పర్యటించేందుకు కార్యాచరణ సిద్ధమైనట్టు బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇదిలా ఉండగా సోమవారం తమిళనాడు బీజేపీ నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి మోదీ ప్రసంగించనున్న సమాచారంతో అందుకు సంబంధించిన ఏర్పాట్లను అన్ని చోట్ల బీజేపీ వర్గాలు చేపట్టాయి.


