ఇంటింటికీ బూత్‌ స్లిప్పుల పంపిణీకి శ్రీకారం | - | Sakshi
Sakshi News home page

ఇంటింటికీ బూత్‌ స్లిప్పుల పంపిణీకి శ్రీకారం

Apr 13 2026 8:02 AM | Updated on Apr 13 2026 8:02 AM

సాక్షి, చైన్నె: రాష్ట్రంలోని 234 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రక్రియ తుది దశకు చేరుకుంటున్నది. ఓటర్ల కోసం ఎన్నికల యంత్రాంగం ఏర్పాట్లు వేగవంతంచేసింది. ఇందులో భాగంగా బూత్‌ స్లిప్పుల పంపిణీ ఆదివారం నుంచి ప్రారంభించారు. పదో తేదీ నుంచి బూత్‌ స్లిప్పులను బీఎల్‌ఓలకు తరలించారు. వీటిని ఉదయం నుంచి ఇంటింటా బీఎల్‌లోలు పంపిణి చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఆదివారం సెలవు దినం కావడంతో తమ తమ పరిధిలోని జనం ఇళ్లల్లోనే ఉండటంతో తొలి రోజు పెద్ద సంఖ్యలో బూత్‌ స్లిప్పుల పంపిణి జరిగింది. ఐదు రోజులలో ఈ ప్రక్రియను ముగించేందుకు నిర్ణయించారు. రాష్ట్రంలో 5.73 కోట్ల మంది ఓటర్లకు ఈ స్లిప్పులు అందజేయనున్నారు. ఈ ఏడాది బూత్‌ స్లిప్పులను మరింత స్పష్టంగా రూపొందించారు. సీరియల్‌ నంబర్‌, పోలింగ్‌ కేంద్రం వివరాలను పెద్ద అక్షరాలతో ముద్రించారు. అలాగే, కొత్తగా క్యూ ఆర్‌ కోడ్‌ను సైతం పొందు పరిచారు. దీని ద్వారా ఓటర్లు తమ పోలింగ్‌ కేంద్రాన్ని సులభంగా గుర్తించవచ్చు.

ఎన్నికల అధికారుల సమీక్ష

తమిళనాడు ప్రధాన ఎన్నికల అధికారి అర్చనా పట్నాయక్‌ ఆరుగురు జిల్లా కలెక్టర్లతో ఆదివారం వీడియో కాన్ఫరెన్స్‌ సమావేశం నిర్వహించారు. ఎన్నికల ఏర్పాట్లు, ఈవీఎం యంత్రాలపై అభ్యర్థుల గుర్తుల ముద్రణ ,పోలింగ్‌ సిబ్బందికి శిక్షణపై ఆమె దిశానిర్దేశం చేశారు.చైన్నెలో ఈ పనులను కార్పొరేషన్‌ కమిషనర్‌ కుమారగురుబరన్‌ పర్యవేక్షిస్తున్నారు.

17 నుంచి కమల్‌ ప్రచార బాట

సాక్షి, చైన్నె : డీఎంకే కూటమి అభ్యర్థులకు మద్దతుగా ఈనెల 17 నుంచి నటుడు, మక్కల్‌నీది మయ్యంనేత కమలహాసన్‌ ప్రచారం చేయనున్నారు. ఈ ఎన్నికలలో కమల్‌ పార్టీ పోటీ చేయడం లేదన్న విషయం తెలిసిందే. తమ మద్దతును డీఎంకేకు ప్రకటించారు. దీంతో కూటమి అభ్యర్థులకు మద్దతుగా ప్రచారానికి కమల్‌ సిద్ధమయ్యారు. ఈనెల 17వ తేదిన చైన్నె హార్బర్‌, పెరంబూరు, కొలత్తూరు, విల్లివాక్కం నియోజకవర్గాలలో, 18వ తేదిన టీ నగర్‌, మైలాపూర్‌, వేళచ్చేరి,చేపాక్కం–ట్రిప్లికేన్‌లలో పర్యటించనున్నారు. 19వ తేదిన అవినాశి, కోయంబత్తూరు దక్షిణం నియోజకవర్గాలలో 20వ తేదిన తిరుచ్చి ఈస్ట్‌, శ్రీరంగం, లాల్గుడి నియోజకవర్గాల్లో రోడ్‌ షో, ప్రచార సభల రూపంలో కమల్‌ పర్యటన సాగనుంది.

విజిలెన్స్‌ డైరెక్టర్‌గా దురై కుమార్‌

సాక్షి, చైన్నె: డైరెక్టర్‌ ఆఫ్‌ విజిలెన్స్‌, యాంటీ కరెప్షన్‌ విభాగం డైరెక్టర్‌గా ఏటీ దురై కుమార్‌ను నియమిస్తూ కేంద్ర ఎన్నికల కమిషన్‌ ఆది వారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పదవిలో ఉన్న డేవిడ్సన్‌ దేవాశీర్వా దంను ఎన్నికల కమిషన్‌ తప్పించిన విషయం తెలిసిందే. ఆయన స్థానంలో సందీప్‌మిట్టల్‌ను నియమించారు.అయితే, ఆయన ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీ సానుభూతి పరుడుగా ఆధారాలతో డీఎంకే ఫిర్యాదు చేసింది. దీంతో ఆయన్ను ఆ పోస్టు నుంచి తప్పించారు. తాజాగా ఈ పోస్టుకు సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఏటీ దురై కుమార్‌ను నియమించారు.

నర్సింగ్‌ కళాశాల

విద్యార్థిని ఆత్మహత్య

పళ్లిపట్టు: నర్సింగ్‌ కళాశాల విద్యార్ధిని ఆత్మహత్య చేసుకున్న ఘటన శోకాన్ని నింపింది. పళ్లిపట్టు సమీపం రామాపురం గ్రామానికి చెందిన ఆనందన్‌ కుమార్తె శిరీష(19) ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతిలో డిప్లమ నర్సింగ్‌ కళాశాలలో తొలి సంవత్సరం చదువుకునేవారు. కళాశాలలో చదువుకోవడంకు ఇష్టం లేక మూడు నెలలుగా ఇంట్లో వుంటున్నట్లు తెలుస్తోంది. దీంతో తల్లిదండ్రులు శిరీషకు వివాహం చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో శనివారం శిరిష ఇంటరిగా ఉంటున్న సమయంలో ఊరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఘటనకు సంబంధించి పోలీసులు మృతదేహం చేపట్టి పోస్టుమార్టం నిమిత్తం తిరుత్తణి ఆసుపత్రికి తరలించి పొదటూరుపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement