బై..బై స్టాలిన్‌, ఉదయనిధి! | - | Sakshi
Sakshi News home page

బై..బై స్టాలిన్‌, ఉదయనిధి!

Apr 10 2026 10:15 AM | Updated on Apr 10 2026 10:15 AM

● కుటుంబ పాలనకు చరమ గీతం ● చైన్నె అన్నాడీఎంకే కంచుకోట ● చేపాక్కం, థౌజండ్‌ లైట్స్‌లో పళణి ప్రచారం

సాక్షి, చైన్నె : శాసనసభ ఎన్నికల ప్రచారంలో భాగంగా అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె. పళనిస్వామి గురువారం చైన్నెలోని చేపాక్కం–ట్రిప్లికేన్‌, థౌజండ్‌ లైట్స్‌ తదితర నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటన చేశారు. ఈ సందర్భంగా ఆయన అధికార డీఎంకే ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. డీఎంకే ప్రభుత్వం రాజకీయ కక్షతో పేదల ఆకలి తీర్చే అమ్మ క్యాంటీన్లను నిర్వీర్యం చేసిందన్నారు. పదార్థాల నాణ్యతను తగ్గించి, సిబ్బందిని తొలగించిందన్నారు. అన్నాడీఎంకే అధికారంలోకి రాగానే, అమ్మ క్యాంటీన్లను బలోపేతం చేస్తామన్నారు. పేదలకు మళ్లీ నాణ్యమైన, రుచికరమైన భోజనాన్ని తక్కువ ధరకే అందిస్తామని హామీ ఇచ్చారు.

డీఎంకేపై ఘాటు విమర్శలు

చేపాక్కం– ట్రిప్లికేన్‌లో ఇక్కడి డీఎంకే అభ్యర్థి, డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్‌, సీఎం స్టాలిన్‌లను పళనిస్వామి టార్గెట్‌ చేశారు.నీట్‌ రద్దు చేస్తామని, రహస్యం ఉందని చెప్పి డీఎంకే యువతను ఉదయ నిధి మోసం చేశారని విమర్శించారు. తమిళనాడులో గంజాయి విక్రయాలు విచ్చలవిడిగా పెరిగాయని, డీఎంకే నాయకుల అండదండలతోనే ఇదంతా జరుగుతోందని ఆరోపించారు. తాము అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే గంజాయిని పూర్తిగా నిర్మూలిస్తామని స్పష్టం చేశారు.గత అన్నాడీఎంకే పాలనతో పోలిస్తే తాజాగా నిత్యావసరాల ధరలు, విద్యుత్‌ ఛార్జీలు, రిజిస్ట్రేషన్‌ ఫీజులు భారీగా పెరిగాయని పళనిస్వామి పేర్కొన్నారు.ఈ సందర్భంగా తమ ఎన్నికల మేనిఫెస్టోలోని అంశాలను ప్రస్తావించారు. చైన్నె అన్నాడీఎంకే కంచుకోట అని ఈసారి అన్ని స్థానాలను కై వసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. అదే సమయంలో తాను సీఎం స్టాలిన్‌ను ఉద్దేశించి ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదని పేర్కొన్నారు. ఈ ఎన్నికలు కేవలం అధికారం మార్పిడి కోసం కాదు.. స్టాలిన్‌ కుటుంబ పాలనకు ముగింపు పలికేందుకు వచ్చిన అవకాశం అని వివరించారు.. బై బై స్టాలిన్‌.. బై బై ఉదయనిధి అని చెప్పే సమయం వచ్చేసిందంటూ, ప్రజల చేత ఈ నినాదాన్ని పదే పదే చెప్పించి తన ప్రసంగాన్ని ముగించారు.

థౌజండ్‌ లైట్స్‌ అభ్యర్థి వలర్మతికి మద్దతుగా పళణిస్వామి ప్రచారం, చేపాక్కం,ట్రిప్లికేన్‌ అభ్యర్థి ఆదిరాజారామ్‌కు మద్దతుగా పళణి ప్రచారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement