అసెంబ్లీ ఎన్నికల్లో 200కుపైగా సీట్లు గెల్చుకుంటాం
పుదుచ్చేరిలోనూ అద్భుత విజయం సాధించబోతున్నాం
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ధీమా
చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 234 సీట్లకు గాను డీఎంకే కూటమి 200కుపైగా స్థానాలు గెల్చుకోవడం తథ్యమని ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ధీమా వ్యక్తంచేశారు. అన్నా డీఎంకే–బీజేపీ కూటమికి సిద్ధాంతం గానీ, ఒక విధానం గానీ లేవని విమర్శించారు. బీజేపీ స్వరాలకు అనుగుణంగా అన్నాడీఎంకే నర్తిస్తోందని ఎద్దేవా చేశారు. ఆ పార్టీకి ఢిల్లీ బీజేపీయే ప్రధాన కార్యాలయంగా మారిపోయిందని అన్నారు. స్టాలిన్ తాజాగా పీటీఐ వార్తా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. గత ఐదేళ్ల ద్రావిడ మోడల్ పాలనలో ప్రజల కోసం ఎన్నెన్నో సంక్షేమ పథకాలు అమలు చేశామని చెప్పారు.
కళైంజర్ మహిళా పథకం కింద నెలకు రూ.1,000, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, పాఠశాల విద్యార్థులకు అల్పాహారం, రెండు లక్షల మంది రైతులకు ఉచిత విద్యుత్ కనెక్షన్ల జారీ వంటి పథకాలను ప్రస్తావించారు. ప్రజల ప్రేమాభిమానాలు, అండదండలతో లౌకిక ప్రజాస్వామ్య కూటమి(ఎస్‌పీఏ) 200కుపైగా సీట్లు గెల్చుకొని ద్రావిడ మోడల్ 2.0 ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఉద్ఘాటించారు. అన్నాడీఎంకే నాయకులు ఢిల్లీ పెద్దలకు బానిసలుగా మారిపోయారని మండిపడ్డారు. తమిళనాడు హక్కులను తాకట్టుపెట్టాలని చూస్తున్నవారు ముమ్మాటికీ బానిసలేనని తేల్చిచెప్పారు. స్టాలిన్ ఇంకా ఏం చెప్పారంటే..
మహిళల భద్రత మా బాధ్యత
‘‘మా కూటమిలో సీట్ల పంపకం విషయంలో పెద్దగా ఇబ్బందులు ఎదురు కాలేదు. సానుకూలంగా చర్చించుకొని సీట్లు ఖరారు చేసుకున్నాం. కూటమి అభ్యర్థుల విజయం కోసం మిత్రపక్షాలు కలిసికట్టుగా కృషి చేస్తున్నాయి. కొత్త పార్టీల చేరికతో ఎస్‌పీఏ మరింత బలంగా మారింది. తమిళనాడుతోపాటు పుదుచ్చేరిలోనూ అద్భుత విజయం సాధించబోతున్నాం. ద్రావిడ విప్లవ సిద్ధాంతాన్ని విశ్వసించేవారు మా పార్టీలో చేరారు. అందుకే మాజీ సీఎం పన్నీర్‌సెల్వం డీఎంకేను ఎంచుకున్నారు. జాతీయ స్థాయిలో విపక్ష ‘ఇండియా’ కూటమిలో కీలక పాత్ర పోషించాలన్న ఆసక్తి లేదు.
నా పరిధి ఏమిటో నాకు తెలుసు. స్టాలిన్ కుటుంబం పవర్ సెంటర్‌గా మారిందన్న విపక్షాల ఆరోపణల్లో నిజం లేదు. ద్రావిడ మోడల్ సుపరిపాలన, గత ఐదేళ్లలో మేము సాధించిన విజయాలను జీర్ణించుకోలేక ప్రజల దృష్టిని మళ్లించడానికి ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు. మహిళల భద్రతకు మా ప్రభుత్వం పెద్దపీట వేసింది. వారి రక్షణ కోసం పటిష్టమైన చర్యలు చేపట్టాం. మహిళలపై నేరాలకు పాల్పడిన వారికి శిక్షలను కఠినతరం చేశాం. మహిళా ఉద్యోగులు, కార్మికులు అత్యధికంగా ఉన్న రాష్ట్రం తమిళనాడు. వారి భద్రత మా బాధ్యత’’ అన్నారు.
మనసుకు దగ్గరైన పథకాలు
‘‘మహిళలకు నెలకు రూ.1,000 ఆర్థిక సాయం, స్కూల్ విద్యార్థులకు అల్పహారం పథకాలు నా మనసుకు చాలా దగ్గరయ్యాయి. మహిళలకు ఆర్థిక సాయం పథకం దేశంలో అత్యుత్తమంగా అమలవుతున్న పథకం కావడం గర్వకారణం. ఇతర రాష్ట్రాల్లోనూ అమలు చేస్తున్నారు. విమర్శించినవారే ఇప్పుడు ప్రశంసిస్తున్నారు. మళ్లీ అధికారంలోకి రాగానే ఈ సాయాన్ని రూ.2,000కు పెంచుతాం. అలాగే అల్పాహారం పథకాన్ని ఎనిమిదో తరగతి విద్యార్థుల దాకా విస్తరింపజేస్తాం. ఏ ఒక్క విద్యార్థి కూడా ఆకలితో పాఠశాలకు రాకూడదు. అదే మా లక్ష్యం. పిల్లల కడుపు నిండుతోంది, చక్కగా చదువుకుంటున్నారు. అది నాకు చాలా సంతృప్తినిస్తోంది’’ అని ఆయన అన్నారు.
తమిళనాడు పోరాడుతుంది.. గెలుస్తుంది
‘‘మహిళా రిజర్వేషన్ల అమలు విషయంలో కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. రాజకీయ లబ్ధి కోసం ఆయుధంగా ఉపయోగించుకుంటోంది. మహిళలకు రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలి. నియోజకవర్గాల పునర్విభజనతో ముడిపెట్టకూడదు. ఈ పునర్విభజన విషయంలో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగితే సహించే ప్రసక్తే లేదు. జనాభా పెరుగుదలను విజయవంతంగా నియంత్రించిన రాష్ట్రాలను శిక్షించాలనుకోవడం సరైంది కాదు. తమిళనాడు పోరాడుతుంది, తమిళనాడు గెలుస్తుంది. ఇదే మా నినాదం. మైనార్టీలను భయపెట్టాలన్నదే బీజేపీ అసలు ఎజెండా. మోదీ పాలనలో ముస్లింలపై విచ్చలవిడిగా దాడులు జరుగుతున్నాయి. క్రిస్టమస్ పండుగ కూడా ప్రశాంతంగా నిర్వహించుకోలేని దుస్థితి ఏర్పడింది. క్రైస్తవులను కూడా టార్గెట్ చేశారు. భారత్ ఎప్పటికీ లౌకిక దేశంగానే ఉండాలి. మైనార్టీలకు రాజ్యాంగం ఇచ్చిన హక్కులను కాపాడాలి. మైనార్టీల హక్కుల కోసం మొదట మేమే గొంతు వినిపిస్తాం’’ అని స్టాలిన్ స్పష్టం చేశారు.


