Dravida country
-
తమిళ పార్టీలకు చిక్కని ఓటరు నాడి
సాక్షి, చెన్నై: తమిళనాడు రాజకీయాలు మిగతా దేశానికి పూర్తి భిన్నంగా ఉంటాయి. ద్రవిడవాదం తమిళ ప్రజల గుండెల్లో పాతు కుపోయింది. ద్రవిడ మున్నేట్ర కళగం (డీఎంకే), ఆలిండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కళగం (అన్నాడీఎంకే) ఆ నినాదం దన్నుతోనే ఒకరి తర్వాత మరొకరు అధికారంలోకి వస్తున్నారు. దివంగత సీఎంలు అన్నాదురై, కరుణానిధి, ఎంజీఆర్, జయలలిత బాటలోనే ముఖ్యమంత్రి, డీఎంకే చీఫ్ ఎం.కె.స్టాలిన్ కూడా ద్రవిడ సిద్ధాంతమే ప్రధానాస్త్రంగా అధికారాన్ని నిలుపుకునేందుకు సర్వ శక్తులూ ఒడ్డుతున్నారు.స్టాలిన్ మహా మెగా కూటమిజయలలిత మాదిరిగా వరుసగా తమిళనాట రెండోసారి విజయం సాధించిన ముఖ్యమంత్రిగా స్టాలిన్ నిలుస్తారా అన్నది ఈసారి ఆసక్తికరమైన అంశంగా మారింది. ఎన్నికలను ఆయన అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కాంగ్రెస్, డీఎండీకే, సీపీఎం, సీపీఐ, వీసీకే, ఐయూఎంఎల్ వంటి 21 పార్టీలతో మహా మెగా కూటమికి తెర తీశారు. స్టాలిన్‌తో పాటు డిప్యూటీ సీఎం ఉదయనిధి తదితరులు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ద్రావిడ మోడల్ 2.0 పాలన నినాదాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, గృహిణులకు రూ.1,000 ప్రోత్సాహం వంటి పథకాలను విజయవంతంగా కొనసాగిస్తున్న వైనాన్ని పదేపదే ప్రస్తావిస్తున్నారు. ఈసారి గెలిపిస్తే రూ.8,000 విలువైన కూపన్లు తదితర హామీలతో మహిళా ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నంలో పడ్డారు. అయితే అన్నాడీఎంకే సారథ్యంలోని ఎన్డీఏ కూటమి కంటే కొత్తగా బరిలో దిగిన సినీ నటుడు జోసెఫ్ విజయ్ డీఎంకేకు గుబులు పుట్టిస్తున్నారు. ఆయన ఎవరి ఓటు బ్యాంకుకు గండి కొడతారో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రజలను ఆకట్టుకోవడానికి అందివచ్చిన ఏ అవకాశాన్నీ స్టాలిన్ వదులుకోవడం లేదు. నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణను అందివచ్చిన అస్త్రంగా వాడుకునేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. లోక్‌సభ స్థానాల పెంపులో తమిళనాడుకు బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేయనుందంటూ ఇప్పటికే ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. దీనిపై కేంద్రంతో ఢీ అంటే ఢీ అనడం ద్వారా ప్రధాని మోదీని ఎదుర్కొంటున్న నేతగా నిలిచే ప్రయత్నంలో పడ్డారు. మైనారిటీ ఓట్లు కూడ ఎంతో కొంత గట్టెక్కిస్తాయని డీఎంకే నమ్ముతోంది.అన్నా కూటమి ఆపసోపాలుఅన్నాడీఎంకే నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రధానంగా ప్రభుత్వ వ్యతిరేకతపైనే ఆశలన్నీ పెట్టుకుంది. బీజేపీతో పాటు అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం, అన్బుమణి రాందాసు నేతృత్వంలోని పీఎంకే, జికే వాసన్ సారథ్యంలోని తమిళ మానిల కాంగ్రెస్ తదితర పార్టీలను కలుపుకుని పోరాడుతోంది. డీఎంకే కుటుంబ రాజకీయాలు, అవినీతి, ఆశ్రిత పక్షపాతం, రాష్ట్రంలో పేట్రేగుతున్న హింస తదితరాలను అన్నాడీఎంకే చీఫ్ ఎడప్పాడి పళనిస్వామి ప్రధాన ప్రచారాస్త్రా లుగా మలచుకుంటున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ప్రధాని మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు తమిళనాడులో ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. డీఎంకే మాదిరిగానే అన్నాడీఎంకేకు కూడా విజయ్ పార్టీ గుబులు పట్టుకుంది. ఆయన పార్టీ అంతిమంగా ఎవరి ఓట్లు చీలుస్తోందన్నది ఆసక్తికరంగా మారింది. ఒంటరిగానే బరిలో ఉన్న మరో సినీ నటుడు, దర్శకుడు సీమాన్ నేతృత్వంలో నామ్ తమిళర్ కట్చి కూడా ప్రధాన కూటముల ఓట్లను చీల్చేలా కన్పిస్తోంది. గత లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీ 8 శాతానికి పైగా ఓట్లు సాధించింది. ఈసారి ఏకంగా 116 మంది మహిళలకు, ఒక ట్రాన్స్‌జెండర్‌కు కూడా టికెటిచ్చింది! వీరికి తోడు జయలలిత నెచ్చెలి శశికళ పార్టీ కూడా పలు నియోజకవర్గాల్లో బరిలో ఉంది!ఓటరు నాడి ఎటో..!ఈసారి తమిళ ఓటరు నాడి ఎవరికీ అందడం లేదు! ఇప్పటిదాకా జరిగిన సర్వేలు కూడా ఈ విషయంలో ఎటూ తేల్చిచెప్పలేకపో యాయి. కాకపోతే విజయ్ పార్టీ టీవీకే కనీసం 15 నుంచి 30 స్థానాల దాకా గెలుచుకోవచ్చని పలు సర్వేల్లో తేలింది. అయితే టీవీకే ప్రధాన కూటముల్లో దేని ఓటు బ్యాంకుకు గండి కొట్టవచ్చన్నది ఎవరికీ అంతుపట్టడం లేదు.మూడో శక్తిగా విజయ్తొలిసారి ఎన్నికల బరిలోకి దిగుతున్న నటుడు విజయ్ పార్టీ తమిళగ వెట్రి కళగం (టీవీకే) రాష్ట్రంలో మూడో శక్తిగా అవతరిస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది. ప్రజల్లో, ముఖ్యంగా యువతలో విజయ్‌కి ఉన్న ఆదరణనే టీవీకే నమ్ముకుంది. ఆ ఆదరణ ఏ మేరకు ఓట్ల రూపంలో ప్రతిఫలిస్తుందన్నది ప్రశ్నగా మారింది. దీనికి తోడు విజయ్‌ని మినహాయిస్తే పార్టీలో పెద్దగా ప్రజాదరణ ఉన్న నేతలంటూ ఎవరూ లేకపోవడం ప్రతికూలాంశంగా కనిపిస్తోంది. టీవీకేతో ఎలాగైనా పొత్తు పెట్టుకోవాలని బీజేపీ ఎంతగా ప్రయత్నించినా చివరికి ఆ పార్టీ అన్ని స్థానాల్లోనూ ఒంటరిగానే పోటీ చేస్తోంది. ఈ ఎన్నికల్లో అధికారం చేజిక్కించుకోలేక పోయినా భవిష్యత్తులో రాష్ట్రంలో ప్రధాన శక్తిగా ఎదగాలన్న భావన టీవీకేలో కనిపిస్తోంది. పార్టీలో జోష్ నింపేందుకు విజయ్ రెండుచోట్ల నుంచి పోటీ చేస్తున్నారు. యువత, మహిళల్లో డీఎంకే, అన్నాడీఎంకే ఓటు బ్యాంకుకు ఈసారి టీవీకే భారీగా గండి కొట్టవచ్చన్న విశ్లేషణలున్నాయి. -
వచ్చేది ద్రావిడ మోడల్ 2.0 ప్రభుత్వమే
చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 234 సీట్లకు గాను డీఎంకే కూటమి 200కుపైగా స్థానాలు గెల్చుకోవడం తథ్యమని ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ధీమా వ్యక్తంచేశారు. అన్నా డీఎంకే–బీజేపీ కూటమికి సిద్ధాంతం గానీ, ఒక విధానం గానీ లేవని విమర్శించారు. బీజేపీ స్వరాలకు అనుగుణంగా అన్నాడీఎంకే నర్తిస్తోందని ఎద్దేవా చేశారు. ఆ పార్టీకి ఢిల్లీ బీజేపీయే ప్రధాన కార్యాలయంగా మారిపోయిందని అన్నారు. స్టాలిన్ తాజాగా పీటీఐ వార్తా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. గత ఐదేళ్ల ద్రావిడ మోడల్ పాలనలో ప్రజల కోసం ఎన్నెన్నో సంక్షేమ పథకాలు అమలు చేశామని చెప్పారు. కళైంజర్ మహిళా పథకం కింద నెలకు రూ.1,000, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, పాఠశాల విద్యార్థులకు అల్పాహారం, రెండు లక్షల మంది రైతులకు ఉచిత విద్యుత్ కనెక్షన్ల జారీ వంటి పథకాలను ప్రస్తావించారు. ప్రజల ప్రేమాభిమానాలు, అండదండలతో లౌకిక ప్రజాస్వామ్య కూటమి(ఎస్పీఏ) 200కుపైగా సీట్లు గెల్చుకొని ద్రావిడ మోడల్ 2.0 ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఉద్ఘాటించారు. అన్నాడీఎంకే నాయకులు ఢిల్లీ పెద్దలకు బానిసలుగా మారిపోయారని మండిపడ్డారు. తమిళనాడు హక్కులను తాకట్టుపెట్టాలని చూస్తున్నవారు ముమ్మాటికీ బానిసలేనని తేల్చిచెప్పారు. స్టాలిన్ ఇంకా ఏం చెప్పారంటే.. మహిళల భద్రత మా బాధ్యత ‘‘మా కూటమిలో సీట్ల పంపకం విషయంలో పెద్దగా ఇబ్బందులు ఎదురు కాలేదు. సానుకూలంగా చర్చించుకొని సీట్లు ఖరారు చేసుకున్నాం. కూటమి అభ్యర్థుల విజయం కోసం మిత్రపక్షాలు కలిసికట్టుగా కృషి చేస్తున్నాయి. కొత్త పార్టీల చేరికతో ఎస్పీఏ మరింత బలంగా మారింది. తమిళనాడుతోపాటు పుదుచ్చేరిలోనూ అద్భుత విజయం సాధించబోతున్నాం. ద్రావిడ విప్లవ సిద్ధాంతాన్ని విశ్వసించేవారు మా పార్టీలో చేరారు. అందుకే మాజీ సీఎం పన్నీర్‌సెల్వం డీఎంకేను ఎంచుకున్నారు. జాతీయ స్థాయిలో విపక్ష ‘ఇండియా’ కూటమిలో కీలక పాత్ర పోషించాలన్న ఆసక్తి లేదు. నా పరిధి ఏమిటో నాకు తెలుసు. స్టాలిన్ కుటుంబం పవర్ సెంటర్‌గా మారిందన్న విపక్షాల ఆరోపణల్లో నిజం లేదు. ద్రావిడ మోడల్ సుపరిపాలన, గత ఐదేళ్లలో మేము సాధించిన విజయాలను జీర్ణించుకోలేక ప్రజల దృష్టిని మళ్లించడానికి ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు. మహిళల భద్రతకు మా ప్రభుత్వం పెద్దపీట వేసింది. వారి రక్షణ కోసం పటిష్టమైన చర్యలు చేపట్టాం. మహిళలపై నేరాలకు పాల్పడిన వారికి శిక్షలను కఠినతరం చేశాం. మహిళా ఉద్యోగులు, కార్మికులు అత్యధికంగా ఉన్న రాష్ట్రం తమిళనాడు. వారి భద్రత మా బాధ్యత’’ అన్నారు. మనసుకు దగ్గరైన పథకాలు ‘‘మహిళలకు నెలకు రూ.1,000 ఆర్థిక సాయం, స్కూల్ విద్యార్థులకు అల్పహారం పథకాలు నా మనసుకు చాలా దగ్గరయ్యాయి. మహిళలకు ఆర్థిక సాయం పథకం దేశంలో అత్యుత్తమంగా అమలవుతున్న పథకం కావడం గర్వకారణం. ఇతర రాష్ట్రాల్లోనూ అమలు చేస్తున్నారు. విమర్శించినవారే ఇప్పుడు ప్రశంసిస్తున్నారు. మళ్లీ అధికారంలోకి రాగానే ఈ సాయాన్ని రూ.2,000కు పెంచుతాం. అలాగే అల్పాహారం పథకాన్ని ఎనిమిదో తరగతి విద్యార్థుల దాకా విస్తరింపజేస్తాం. ఏ ఒక్క విద్యార్థి కూడా ఆకలితో పాఠశాలకు రాకూడదు. అదే మా లక్ష్యం. పిల్లల కడుపు నిండుతోంది, చక్కగా చదువుకుంటున్నారు. అది నాకు చాలా సంతృప్తినిస్తోంది’’ అని ఆయన అన్నారు. తమిళనాడు పోరాడుతుంది.. గెలుస్తుంది‘‘మహిళా రిజర్వేషన్ల అమలు విషయంలో కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. రాజకీయ లబ్ధి కోసం ఆయుధంగా ఉపయోగించుకుంటోంది. మహిళలకు రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలి. నియోజకవర్గాల పునర్విభజనతో ముడిపెట్టకూడదు. ఈ పునర్విభజన విషయంలో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగితే సహించే ప్రసక్తే లేదు. జనాభా పెరుగుదలను విజయవంతంగా నియంత్రించిన రాష్ట్రాలను శిక్షించాలనుకోవడం సరైంది కాదు. తమిళనాడు పోరాడుతుంది, తమిళనాడు గెలుస్తుంది. ఇదే మా నినాదం. మైనార్టీలను భయపెట్టాలన్నదే బీజేపీ అసలు ఎజెండా. మోదీ పాలనలో ముస్లింలపై విచ్చలవిడిగా దాడులు జరుగుతున్నాయి. క్రిస్టమస్ పండుగ కూడా ప్రశాంతంగా నిర్వహించుకోలేని దుస్థితి ఏర్పడింది. క్రైస్తవులను కూడా టార్గెట్ చేశారు. భారత్ ఎప్పటికీ లౌకిక దేశంగానే ఉండాలి. మైనార్టీలకు రాజ్యాంగం ఇచ్చిన హక్కులను కాపాడాలి. మైనార్టీల హక్కుల కోసం మొదట మేమే గొంతు వినిపిస్తాం’’ అని స్టాలిన్ స్పష్టం చేశారు. -
ద్రవిడ నేలపై కమలం వికసించేనా?
స్టేట్ స్కాన్ దక్షిణాదిని పాదాక్రాంతం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతున్న బీజేపీ ఈ లోక్‌సభ ఎన్నికల్లో ప్రధా నంగా తమిళనాడుపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ద్రవిడ పార్టీల ఆవిర్భావంతో దశాబ్దాలుగా జాతీయ పార్టీలకు ఆ రాష్ట్రం కొరకరాని కొయ్యగా మారిపోయింది. డీఎంకే, అన్నాడీఎంకేల్లో ఏదో ఒకదానికి తోక పార్టీగా కొనసాగడం మినహా కాంగ్రెస్, బీజేపీలకు మరో దారి లేని పరిస్థితి! ఈసారి ఈ పరిస్థితిని ఎలాగైనా మార్చాలని బీజేపీ కంకణం కట్టుకుంది. కె.అన్నామలై రాష్ట్ర బీజేపీ పగ్గాలు చేపట్టిన నాటినుంచీ దూకుడుగా వెళ్తున్నారు. రాష్ట్రమంతటా కలియదిరుగుతూ ఇటు జనాన్ని ఆకట్టుకుంటున్నారు. మంత్రుల అవినీతిపై వీడియోలు విడుదల చేస్తూ అటు అధికార డీఎంకేకు వణుకు పుట్టిస్తున్నారు. రాష్ట్రంలోని మొత్తం 39 లోక్‌సభ స్థానాలకూ ఏప్రిల్19న తొలి విడతలోనే పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో తమిళనాట ఎన్నికల వేడి ఇప్పటికే పరాకాష్టకు చేరింది... జాతీయ పార్టీలతో కుర్చిలాట తమిళనాట 50 ఏళ్లుగా ద్రవిడ పార్టీలైన డీఎంకే, అన్నాడీఎంకేలదే హవా. రాష్ట్రంలో కాంగ్రెస్‌కు 1967లో డీఎంకే తొలిసారి ఓటమి రుచి చూపింది. 234 అసెంబ్లీ స్థానాలకు గాను ఏకంగా డీఎంకే 179 చోట్ల గెలవగా కాంగ్రెస్ 51 స్థానాలకు పరిమితమైంది. నాటినుంచి నేటిదాకా రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాలేకపోయింది! కరుణానిధితో విభేదాలతో 1972లో ఎంజీ రామచంద్రన్ డీఎంకేను చీల్చి అన్నాడీఎంకేను ఏర్పాటు చేశారు. నాటినుంచీ వాటి మధ్యే ప్రధాన పోరు సాగుతూ వస్తోంది. జాతీయ రాజకీయాల్లో సంకీర్ణ యుగం ఆవిర్భావంతో 1989 నుంచి రెండు దశాబ్దాల పాటు కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటులో డీఎంకే, అన్నాడీఎంకే కీలక పాత్ర పోషించాయి. ఆ క్రమంలో రాష్ట్రంలోనూ కాంగ్రెస్, బీజేపీలతో మార్చి మార్చి పొత్తు పెట్టుకుంటూ వస్తున్నాయి. డీఎంకే 2004 దాకా కాంగ్రెస్‌కు బద్ధ విరోధిగా కొనసాగింది. అన్నాడీఎంకే కేంద్రంలో వాజ్‌పేయి ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించడంతో 1999లో బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమిలో చేరింది. కానీ 2004లో అన్నాడీఎంకే మళ్లీ ఎన్డీఏ గూటికి చేరడంతో డీఎంకే తన వైఖరి మార్చుకుని కాంగ్రెస్‌తో చేతులు కలిపింది. నాటినుంచీ 2014లో మినహాయిస్తే వాటి బంధం అన్ని ఎన్నికల్లోనూ కొనసాగుతూ వస్తోంది. ఇక అన్నాడీఎంకే తాను తొలిసారి ఎన్నికల బరిలో 1977లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంది. తర్వాత 1984 నుంచి 1991 ఎన్నికల దాకా వాటి బంధం సాగింది. 1998లో తొలిసారి బీజేపీతో చేతులు కలిపినా ఏడాదికే మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరింది. 2004లో మళ్లీ బీజేపీతో జట్టు కట్టింది. అప్పటినుంచీ కాంగ్రెస్‌ను దూరం పెట్టింది. 2004 లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాజయం నేపథ్యంలో 2009, 2014 ఎన్నికల్లో బీజేపీతో బంధం తెంచుకుంది. 2019లో మళ్లీ ఎన్డీఏలో చేరినా ఈసారి మాత్రం ఒంటరిగానే పోటీ చేస్తోంది. చిన్న పార్టీలైన పీఎంకే, ఎండీఎంకే కూడా పరిస్థితిని బట్టి డీఎంకే, అన్నాడీఎంకేలతో పొత్తు పెట్టుకుంటూ వస్తున్నాయి. పొత్తులు ఇలా... డీఎంకే ఈసారి కూడా చిరకాల మిత్రులు కాంగ్రెస్, వామపక్షాలతో పొత్తు పెట్టుకోగా అన్నాడీఎంకే మాత్రం బీజేపీతో దూరం పాటిస్తోంది. దివంగత నటుడు విజయ్‌కాంత్‌కు చెందిన డీఎండీకేతో పొత్తు పెట్టుకుంది. ఇక బీజేపీ ఈసారి పీఎంకే, ఏఎంఎంకే, టీఎంసీ (ఎం) వంటి చిన్న పార్టీలతో జట్టు కట్టింది. 1999లో రాష్ట్రంలో అత్యధికంగా 4 లోక్‌సభ స్థానాల్లో నెగ్గిన బీజేపీ ఈసారి ఆ రికార్డును అధిగమించాలని పట్టుదలతో ఉంది. పోలింగ్ తేదీ సమీపిస్తుండటంతో ప్రధాని నరేంద్ర మోదీ తమిళనాట పర్యటనలతో హోరెత్తిస్తున్నారు. ఈ మధ్యకాలంలోనే రాష్ట్రానికి ఆయన ఏకంగా ఆరుసార్లు వచ్చారు. ఎవరి సర్వేలు ఏమంటున్నాయి... సీఎన్ఎన్–న్యూస్ 18 సర్వే ఈసారి ఎన్డీఏకు రాష్ట్రంలో 5 సీట్ల దాకా వస్తాయని పేర్కొనగా ఇండియాటుడే సర్వే మాత్రం మొత్తం 39 సీట్లనూ విపక్ష ఇండియా కూటమి క్లీన్‌స్వీప్ చేస్తుందని జోస్యం చెప్పింది. ఎవరెన్ని సీట్లలో... తమిళనాట ఎన్డీఏ, ఇండియా, అన్నాడీఎంకే కూటముల మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. ఇండియా కూటమిలో డీఎంకే 22 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేస్తోంది. కాంగ్రెస్‌కు 9, వామపక్షాలకు 4, ఇతర పార్టీలకు మరో 4 స్థానాలు కేటాయించింది. ఎన్డీఏ కూటమి విషయానికొస్తే బీజేపీ 20 చోట్ల, పీఎంకే 10, టీఎంసీ(ఎం) 3, ఏఎంఎంకే 2 చోట్ల, ఇతర పార్టీలు మూడింట బరిలో ఉన్నాయి. మరోచోట ఎన్డీఏ మద్దతుతో ఒ.పనీర్‌సెల్వం స్వతంత్రునిగా బరిలో దిగుతున్నారు. ఇక అన్నాడీఎంకే 32 స్థానాల్లో పోటీ చేస్తోంది. డీఎండీకేకు 5, ఇతరులకు 2 సీట్లు కేటాయించింది. యువ ఓటర్లపైనే బీజేపీ ఆశలు... తమిళనాట బీజేపీ ప్రధానంగా యువ ఓటర్లపైనే ఆశలు పెట్టుకుంది. ద్రవిడ పార్టీలతో విసిగిపోయారని, మార్పు కోసం చూస్తున్నారని నమ్ముతోంది. బీజేపీ రాష్ట్ర సారథి అన్నామలైకి వారిలో ఆదరణ నానాటికీ పెరుగుతోందని పరిశీలకులు చెబుతున్నారు. దీనికితోడు ద్రవిడ పార్టీల నేతలపైనా బీజేపీ కన్నేసింది. ఇప్పటికే అన్నాడీఎంకేకు చెందిన ఒక మాజీ ఎంపీ, 17 మంది మాజీ ఎమ్మెల్యేలు ఇటీవలే బీజేపీలో చేరారు. దక్షిణ తమిళనాట పదేళ్లుగా తమకు గట్టి పునాదే ఏర్పడిందని పార్టీ భావిస్తోంది. అక్కడి కొంగు ప్రాంతంలో పార్టీకి సంస్థాగతంగా చెప్పుకోదగ్గ బలమే ఉంది. దీనికితోడు కోయంబత్తూరు నుంచి రాష్ట్ర పార్టీ సారథి అన్నామలై పోటీ చేస్తున్నారు. పీఎంకేతో పొత్తు ద్వారా ఉత్తర తమిళనాడులో తన బలహీనతను అధిగమిస్తానని బీజేపీ భావిస్తోంది. 2014లోనూ ఇలాగే చిన్న పార్టీలతో జట్టు కట్టి బీజేపీ ఏకంగా 19 శాతం ఓట్లు రాబట్టడమే గాక ఒక లోక్‌సభ స్థానాన్ని గెలుచుకుందని ఆ పార్టీ అభిమానులు గుర్తు చేస్తున్నారు. కాకపోతే అప్పటి భాగస్వాముల్లో డీఎండీకే, ఎండీఎంకే ఇప్పుడు ఎన్డీఏతో లేవు. పైగా ముక్కోణపు పోటీలో విపక్షాల ఓట్లు చీలి ఇండియా కూటమికే లబ్ధి చేకూరవచ్చన్న విశ్లేషణలున్నాయి. ఇక 2019 లోక్‌సభ ఎన్నికల్లో ప్రస్తుత ఇండియా కూటమి ఏకంగా 53 శాతం ఓట్లు ఒడిసిపట్టింది! ఎన్డీఏ కేవలం 10 శాతంతో సరిపెట్టుకోగా అన్నాడీఎంకే కూటమికి 21 శాతం వచ్చాయి. అయితే ఈసారి ఏఎంఎంకే వంటి భాగస్వాములు అన్నాడీఎంకే ఓటు శాతానికి గండి కొట్టి తమవైపు మళ్లిస్తాయని బీజేపీ ఆశ పెట్టుకుంది. అన్నాడీఎంకే ఓట్లను ఏకంగా మూడొంతల దాకా ఒడిసిపట్టడంతో పాటు మోదీ చరిష్మా, స్టాలిన్ సర్కారుపై వ్యతిరేకత సాయంతో ఇండియా కూటమి ఓట్లలోనూ 10 శాతం దాకా ఎన్డీఏ కొల్లగొట్టగలిగితే 7 సీట్ల దాకా నెగ్గవచ్చని విశ్లేషకుల అంచనా. కాకపోతే అన్నాడీఎంకే ఓటు శాతానికి అంతగా గండి పెట్టడం బీజేపీకి పెనుసవాలే! ప్రచారంలో సినీ తళుకులు.. బీజేపీ తరఫున సినీ నటులు ఖుష్బూ, ఇటీవలే తన పార్టీని విలీనం చేసిన శరత్ కుమార్, సెంథిల్ ప్రచారంలో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నారు. డీఎంకేకు కమల్‌హాసన్, అన్నాడీఎంకేకు గౌతమి, గాయత్రీ రఘురాం తదితర సినీ స్టార్లు ప్రచారం చేయనున్నారు. -
భారత్.. నాదీ కాదు, మోదీ-షాలదీ కాదు: ఒవైసీ సంచలన వ్యాఖ్యలు
భారత దేశం గురించి ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్.. నాది(ఒవైసీ) కాదు, మోదీ-షాలదీ కాదు.. అంతుకుమించి థాక్రేలది అసలే కాదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నిజానికి భారత దేశం ద్రవిడియన్లు, ఆదివాసీలది అని కామెంట్స్ చేశారు. వివరాల ప్రకారం.. ఒవైసీ శనివారం మహారాష్ట్రలోని బీవండిలో జరిగిన ఓ సభలో మాట్లాడుతూ.. కేంద్రంలో ఉన్న బీజేపీ, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)పై విరుచుకుపడ్డారు. భారత్.. ద్రవిడియన్లు, ఆదివాసీలది మాత్రమేనని అభిప్రాయపడ్డారు. నాదీ కాదు, మోదీ-షాలదీ, థాక్రేలది అసలే కాదని అన్నారు. ఆఫ్రికా, మధ్య ఆసియా, ఇరాన్, తూర్పు ఆసియా నుంచి వలస వచ్చిన వారితోనే భారత్ ఏర్పడిందని వ్యాఖ్యానించారు. దేశంలోకి మొగల్స్ వచ్చి వెళ్లిన తర్వాతే ఆర్ఎస్ఎస్, బీజేపీలు వెలుగులోకి వచ్చాయని తెలిపారు. ఈ క్రమంలోనే ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్‌పై మండిపడ్డారు. శివసేన ఎంపీ సంజయ్ రౌత్‌కు చేసినట్లుగా నవాబ్ మాలిక్ అరెస్ట్‌పై ప్రధాని మోదీని ఎందుకు కలవలేదని ప్రశ్నించారు. బీజేపీ, ఎన్సీపీ, కాంగ్రెస్, ఎస్పీ పార్టీలు లౌకిక పార్టీలు అని వ్యాఖ్యలు చేశారు. అయితే, సంజయ్ రౌత్‌పై కేంద్ర దర్యాప్తు సంస్థలు(సీబీఐ, ఈడీ) ఎలాంటి చర్య తీసుకోకుండా శరద్ పవార్, ప్రధాని మోదీని కలిశారని తెలిపారు. ఇదే సమయంలో ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ అరెస్ట్ అయితే ఆయనకు ఎందుకు సాయం చేయలేదని విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో నవాబ్ మాలిక్.. ముస్లిం కావడం వల్లేనా..? అని ప్రశ్నించారు. దీంతో ఆయన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. Bhiwandi, Maharashtra | India is neither mine, nor Thackeray's, nor Modi-Shah's. If India belongs to anyone, it's Dravidians & Adivasis but BJP-RSS only after Mughals. India was formed after people migrated from Africa, Iran, Central Asia, East Asia:AIMIM's Asaduddin Owaisi(28.5) pic.twitter.com/NmpxCYo2oC — ANI (@ANI) May 28, 2022 ఇది కూడా చదవండి: యూపీ సీఎం యోగి సంచలన నిర్ణయం -
రజనీతో జట్టు కట్టను: కమల్
సాక్షి ప్రతినిధి, చెన్నై: ఆధ్యాత్మిక భావాలు, సిద్ధాంతాలతో నటుడు రజనీకాంత్ ప్రారంభించబోయే రాజకీయ పార్టీతో తాను కలసి పనిచేసే అవకాశం లేదని నటుడు కమల్ హసన్ చెప్పారు. దివంగత రాష్ట్రపతి కలాం ఈ దేశం గురించి ఎన్నో కలలు కనేవారని, తనకూ అలాంటి కలలే ఉన్నాయని చెప్పారు. గతంలో ఒకసారి విమానంలో కలాంతో కలసి ప్రయాణం చేసే అవకాశం వచ్చిందని, ఆ సందర్భంగా అనేక అంశాలపై తాము మాట్లాడుకున్నామని తెలిపారు. ద్రవిడ సిద్ధాంతం తమిళనాడుకు మాత్రమే పరిమితం కాదని, దేశవ్యాప్తంగా వ్యాపించి ఉందని వ్యాఖ్యానించారు. కమల్ తన రాజకీయ ప్రస్థానాన్ని రామేశ్వరంలోని దివంగత కలాం ఇంటి నుంచి ప్రారంభించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. -
రజనీ ఉద్దేశం అదే అయితే.. రాజకీయ భవిష్యత్తే ఉండదు
సాక్షి, చెన్నై : రజనీకాంత్ పొలిటికల్ అరంగ్రేటం ఒక ఎత్తయితే.. డీఎంకే పార్టీ కురు వృద్ధుడు కరుణానిధితో భేటీ కావటం అరవ రాజకీయాలను ఆసక్తికరంగా మార్చింది. గతంలో జయలలితకు వ్యతిరేకంగా.. డీఎంకేకు మద్దతు ఇచ్చి పెద్ద తప్పు చేశానంటూ రజనీ వ్యాఖ్యలు చేయటం తెలిసిందే. అయితే నిన్న సాయంత్రం హడావుడిగా కరుణ నివాసానికి వెళ్లిన రజనీ ఆయన ఆశీర్వాదం తీసుకున్నాడు. దీనిపై మీడియాలో రకరకాల కథనాలు వెలువడుతుండగా.. కరుణానిధి తనయుడు, డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ స్పందించారు. ‘‘ పెరియార్, అన్నాదురై, కరుణానిధి లాంటి నేతలతో ద్రవిడ భూమి తరించింది. కానీ, ద్రవిడ సిద్ధాంతాన్ని నిర్మూలించేందుకే రజనీ రాజకీయాల్లో వచ్చాడంటూ ఆయన అనుచరులు ప్రచారం చేస్తున్నారు. ఒకవేళ అదే నిజమైతే మాత్రం ఆయన అడ్డుకునేందుకు ముందు మేమే ఉంటాం. ఆయన రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారటం ఖాయం. గతంలో అలా ప్రయత్నించి విఫలమైనవారు చాలా మందే ఉన్నారు. కానీ, తనది ఆధ్యాత్మిక పార్టీ అని రజనీకాంత్ చెబుతున్నారు కాబట్టి దాని గురించి ఇప్పుడే ఏం స్పందించలేం. పార్టీ ప్రారంభించే ముందు కేవలం సంప్రదాయ రీతిలో మాత్రమే కరుణను కలిశారు.. వేరే ఉద్దేశం లేదు. ఇంతకుముందు విజయ్‌కాంత్ కూడా పార్టీ ప్రారంభించే సమయంలో ఇలానే కరుణను కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు’’ అని స్టాలిన్ పేర్కొన్నారు. కాగా, కరుణానిధిని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయటంతోపాటు ఆరోగ్యం గురించి రజనీ వాకబు చేశారు. ఆపై తన రాజకీయ ఎంట్రీ గురించి ఆయనతో కాసేపు చర్చించినట్లు రజనీ సన్నిహితులు తెలిపారు. ఇదిలా ఉంటే రజనీ ఇంతకు ముందులా ట్విట్టర్లో అభిప్రాయాలను తెలియజేయటం మానుకుని.. ప్రజల్లోకి రావాలంటూ డీఎండీకే పార్టీ అధ్యక్షుడు విజయ్‌కాంత్ సతీమణి ప్రేమలత చెబుతున్నారు. -
ప్రకృతి చిత్రం భళా
ప్రకృతి పలకరించిన ఆమె కుంచె కాన్వాస్‌పై కడలి అలజడిని చూపిస్తుంది.. సెలయేళ్లను పారిస్తుంది.. వసంత గాలికి చిగురించిన వనదేవతను సాక్షాత్కరిస్తుంది. ద్రవిడ దేశంలో వికసించిన ఆ కళ.. తెలుగింటి కోడలిగా అడుగిడిన తర్వాత మరింత రమణీయంగా పల్లవించింది. ఈ తమిళ పడుచు వేసిన చిత్రమాలిక తొలి ప్రదర్శన ఐలమ్మ ఆర్ట్ గ్యాలరీలో కొలువుదీరింది. తన కళకు హైదరాబాదీల నుంచి మంచి రె స్పాన్స్ వస్తోందంటున్న యువ ఆర్టిస్ట్ గాయత్రి వెంకటరమణ్ ‘సిటీప్లస్’తో ముచ్చటించారు. మాది చెన్నై దగ్గర ఓ పల్లెటూరు. పచ్చని పంట పొలాలు, ఆహ్లాదకరమైన వాతావరణం, కల్మషం లేని పల్లె మనుషులు అందంగా ఉండేది. మా పేరెంట్స్ నన్ను ఇంజనీర్‌గా చూడాలనుకున్నారు. చిన్నప్పటి నుంచే నాకు పెయింటింగ్స్ అంటే ఆసక్తి. స్కూల్‌డేస్‌లోనే పెయింటింగ్ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొనేదాన్ని. బహుమతులు కూడా గెలుచుకునేదాన్ని. ఆ విజయాలే నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచాయి. ఇటు చిత్రకళపై పట్టు సాధిస్తూనే.. అటు ఇంజనీరింగ్ పూర్తి చేశాను. తర్వాత 5జీ సాఫ్ట్వేర్ కంపెనీలో టెకీగా రెండేళ్లు పనిచేశాను. కళనే వారధి.. 2010లో రాజమండ్రికి చెందిన వెంకటరమణతో పెళ్లయింది. చెన్నైలో ఉద్యోగం మానేశాను. కొన్ని రోజులకు మావారికి హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ రావడంతో సిటీకి షిఫ్ట్ అయ్యాం. పెళ్లయినా నా ఆర్ట్‌కు నేను దూరం కాలేదు. ఆక్రిలిక్, వాటర్ కలర్, ఆయిల్ పెయింటింగ్స్ ఎక్కువగా వేస్తుంటాను. గృహిణిగా నా బాధ్యతలు నిర్వర్తిస్తూనే.. చిన్నప్పటి నుంచి నేనెరిగిన ప్రకృతిని పెయింటింగ్స్ వేస్తున్నా. పచ్చని ప్రకృతిపై అవేర్నెస్ తీసుకురావడానికి నా కళను ఒక వారధిగా మార్చుకునే ప్రయత్నంలో ఉన్నా. అందుకే నేను గీసిన పెయింటింగ్స్‌తో ప్రదర్శన ఏర్పాటు చేశాను. మరిన్ని థీమ్స్‌తో.. నగరీకరణ వల్ల వాతావరణంలో కాలుష్యం పెరిగి ప్రకృతి సంపద కనుమరుగవుతోంది. వాతావరణ సమతుల్యత దెబ్బతినడంతో జనాలకు అనారోగ్య సమస్యలు కూడా పెరుగుతున్నాయి. అందుకే ప్రకృతిని పరిరక్షిస్తే మనకే మేలనే నా పెయింటింగ్స్ ద్వారా సందేశాన్ని అందిస్తున్నాను. ఇక వినాయకుడంటే అమితమైన భక్తి. అందుకే వివిధ భంగిమల్లో గణేశుడి చిత్రాలు కూడా గీస్తున్నాను. నా తొలి ఆర్ట్ ఎగ్జిబిషన్‌కు హైదరాబాద్ వేదిక కావడం ఆనందంగా ఉంది. రానున్న రోజుల్లో పలు రకాల థీమ్స్‌పై చిత్రాలు గీసి ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తాను.


