తమిళ పార్టీలకు చిక్కని ఓటరు నాడి  | Dmk, Aiadmk and Tvk Triangular war in Tamilnadu Elections 2026 | Sakshi
Sakshi News home page

తమిళ పార్టీలకు చిక్కని ఓటరు నాడి 

Apr 16 2026 6:10 AM | Updated on Apr 16 2026 6:10 AM

Dmk, Aiadmk and Tvk Triangular war in Tamilnadu Elections 2026

స్టాలిన్‌ చరిత్ర సృష్టించేనా?

ద్రవిడ మోడల్‌తో డీఎంకే ప్రచారం

అన్నాడీఎంకే–బీజేపీ కూటమి

ఆశలన్నీ ప్రభుత్వ వ్యతిరేకతపైనే

అధికార, విపక్ష కూటముల్లో విజయ్‌ ఎవరి పుట్టి ముంచేనో!

సాక్షి, చెన్నై: తమిళనాడు రాజకీయాలు మిగతా దేశానికి పూర్తి భిన్నంగా ఉంటాయి. ద్రవిడవాదం తమిళ ప్రజల గుండెల్లో పాతు కుపోయింది. ద్రవిడ మున్నేట్ర కళగం (డీఎంకే), ఆలిండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కళగం (అన్నాడీఎంకే) ఆ నినాదం దన్నుతోనే ఒకరి తర్వాత మరొకరు అధికారంలోకి వస్తున్నారు. దివంగత సీఎంలు అన్నాదురై, కరుణానిధి, ఎంజీఆర్, జయలలిత బాటలోనే ముఖ్యమంత్రి, డీఎంకే చీఫ్‌ ఎం.కె.స్టాలిన్‌ కూడా ద్రవిడ సిద్ధాంతమే ప్రధానాస్త్రంగా అధికారాన్ని నిలుపుకునేందుకు సర్వ శక్తులూ ఒడ్డుతున్నారు.

స్టాలిన్‌ మహా మెగా కూటమి
జయలలిత మాదిరిగా వరుసగా తమిళనాట రెండోసారి విజయం సాధించిన ముఖ్యమంత్రిగా స్టాలిన్‌ నిలుస్తారా అన్నది ఈసారి ఆసక్తికరమైన అంశంగా మారింది. ఎన్నికలను ఆయన అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కాంగ్రెస్, డీఎండీకే,  సీపీఎం, సీపీఐ, వీసీకే, ఐయూఎంఎల్‌ వంటి 21 పార్టీలతో మహా మెగా కూటమికి తెర తీశారు. స్టాలిన్‌తో పాటు డిప్యూటీ సీఎం ఉదయనిధి తదితరులు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ద్రావిడ మోడల్‌ 2.0 పాలన నినాదాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, గృహిణులకు రూ.1,000 ప్రోత్సాహం వంటి పథకాలను విజయవంతంగా కొనసాగిస్తున్న వైనాన్ని పదేపదే ప్రస్తావిస్తున్నారు. 

ఈసారి గెలిపిస్తే రూ.8,000 విలువైన కూపన్లు తదితర హామీలతో మహిళా ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నంలో పడ్డారు. అయితే అన్నాడీఎంకే సారథ్యంలోని ఎన్డీఏ కూటమి కంటే కొత్తగా బరిలో దిగిన సినీ నటుడు జోసెఫ్‌ విజయ్‌ డీఎంకేకు గుబులు పుట్టిస్తున్నారు. ఆయన ఎవరి ఓటు బ్యాంకుకు గండి కొడతారో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రజలను ఆకట్టుకోవడానికి అందివచ్చిన ఏ అవకాశాన్నీ స్టాలిన్‌ వదులుకోవడం లేదు. నియోజకవర్గాల పునర్‌ వ్యవస్థీకరణను అందివచ్చిన అస్త్రంగా వాడుకునేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. లోక్‌సభ స్థానాల పెంపులో తమిళనాడుకు బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేయనుందంటూ ఇప్పటికే ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. దీనిపై కేంద్రంతో ఢీ అంటే ఢీ అనడం ద్వారా ప్రధాని మోదీని ఎదుర్కొంటున్న నేతగా నిలిచే ప్రయత్నంలో పడ్డారు. మైనారిటీ ఓట్లు కూడ ఎంతో కొంత గట్టెక్కిస్తాయని డీఎంకే నమ్ముతోంది.

అన్నా కూటమి ఆపసోపాలు
అన్నాడీఎంకే నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రధానంగా ప్రభుత్వ వ్యతిరేకతపైనే ఆశలన్నీ పెట్టుకుంది. బీజేపీతో పాటు అమ్మ మక్కల్‌ మున్నేట్ర కళగం, అన్బుమణి రాందాసు నేతృత్వంలోని పీఎంకే, జికే వాసన్‌ సారథ్యంలోని తమిళ మానిల కాంగ్రెస్‌ తదితర పార్టీలను కలుపుకుని పోరాడుతోంది. డీఎంకే కుటుంబ రాజకీయాలు, అవినీతి, ఆశ్రిత పక్షపాతం, రాష్ట్రంలో పేట్రేగుతున్న హింస తదితరాలను అన్నాడీఎంకే చీఫ్‌ ఎడప్పాడి పళనిస్వామి ప్రధాన ప్రచారాస్త్రా లుగా మలచుకుంటున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ప్రధాని మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు తమిళనాడులో ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. డీఎంకే మాదిరిగానే అన్నాడీఎంకేకు కూడా విజయ్‌ పార్టీ గుబులు పట్టుకుంది. ఆయన పార్టీ అంతిమంగా ఎవరి ఓట్లు చీలుస్తోందన్నది ఆసక్తికరంగా మారింది. ఒంటరిగానే బరిలో ఉన్న మరో సినీ నటుడు, దర్శకుడు సీమాన్‌ నేతృత్వంలో నామ్‌ తమిళర్‌ కట్చి కూడా ప్రధాన కూటముల ఓట్లను చీల్చేలా కన్పిస్తోంది. గత లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీ 8 శాతానికి పైగా ఓట్లు సాధించింది. ఈసారి ఏకంగా 116 మంది మహిళలకు, ఒక ట్రాన్స్‌జెండర్‌కు కూడా టికెటిచ్చింది! వీరికి తోడు జయలలిత నెచ్చెలి శశికళ పార్టీ కూడా పలు నియోజకవర్గాల్లో బరిలో ఉంది!

ఓటరు నాడి ఎటో..!
ఈసారి తమిళ ఓటరు నాడి ఎవరికీ అందడం లేదు! ఇప్పటిదాకా జరిగిన సర్వేలు కూడా ఈ విషయంలో ఎటూ తేల్చిచెప్పలేకపో యాయి. కాకపోతే విజయ్‌ పార్టీ టీవీకే కనీసం 15 నుంచి 30 స్థానాల దాకా గెలుచుకోవచ్చని పలు సర్వేల్లో తేలింది. అయితే టీవీకే ప్రధాన కూటముల్లో దేని ఓటు బ్యాంకుకు గండి కొట్టవచ్చన్నది ఎవరికీ అంతుపట్టడం లేదు.

మూడో శక్తిగా విజయ్‌
తొలిసారి ఎన్నికల బరిలోకి దిగుతున్న నటుడు విజయ్‌ పార్టీ తమిళగ వెట్రి కళగం (టీవీకే) రాష్ట్రంలో మూడో శక్తిగా అవతరిస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది. ప్రజల్లో, ముఖ్యంగా యువతలో విజయ్‌కి ఉన్న ఆదరణనే టీవీకే నమ్ముకుంది. ఆ ఆదరణ ఏ మేరకు ఓట్ల రూపంలో ప్రతిఫలిస్తుందన్నది ప్రశ్నగా మారింది. దీనికి తోడు విజయ్‌ని మినహాయిస్తే పార్టీలో పెద్దగా ప్రజాదరణ ఉన్న నేతలంటూ ఎవరూ లేకపోవడం ప్రతికూలాంశంగా కనిపిస్తోంది. టీవీకేతో ఎలాగైనా పొత్తు పెట్టుకోవాలని బీజేపీ ఎంతగా ప్రయత్నించినా చివరికి ఆ పార్టీ అన్ని స్థానాల్లోనూ ఒంటరిగానే పోటీ చేస్తోంది. ఈ ఎన్నికల్లో అధికారం చేజిక్కించుకోలేక పోయినా భవిష్యత్తులో రాష్ట్రంలో ప్రధాన శక్తిగా ఎదగాలన్న భావన టీవీకేలో కనిపిస్తోంది. పార్టీలో జోష్‌ నింపేందుకు విజయ్‌ రెండుచోట్ల నుంచి పోటీ చేస్తున్నారు. యువత, మహిళల్లో డీఎంకే, అన్నాడీఎంకే ఓటు బ్యాంకుకు ఈసారి టీవీకే భారీగా గండి కొట్టవచ్చన్న విశ్లేషణలున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement