రజనీ ఉద్దేశం అదే అయితే.. రాజకీయ భవిష్యత్తే ఉండదు

Stalin on Rajinikanth Met Karunanidhi - Sakshi

సాక్షి, చెన్నై : రజనీకాంత్‌ పొలిటికల్‌ అరంగ్రేటం ఒక ఎత్తయితే.. డీఎంకే పార్టీ కురు వృద్ధుడు కరుణానిధితో భేటీ కావటం అరవ రాజకీయాలను ఆసక్తికరంగా మార్చింది. గతంలో జయలలితకు వ్యతిరేకంగా.. డీఎంకేకు మద్దతు ఇచ్చి పెద్ద తప్పు చేశానంటూ రజనీ వ్యాఖ్యలు చేయటం తెలిసిందే. అయితే నిన్న సాయంత్రం హడావుడిగా కరుణ నివాసానికి వెళ్లిన రజనీ ఆయన ఆశీర్వాదం తీసుకున్నాడు. దీనిపై మీడియాలో రకరకాల కథనాలు వెలువడుతుండగా.. కరుణానిధి తనయుడు, డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌ స్పందించారు. 

‘‘ పెరియార్‌, అన్నాదురై, కరుణానిధి లాంటి నేతలతో ద్రవిడ భూమి తరించింది.  కానీ, ద్రవిడ సిద్ధాంతాన్ని నిర్మూలించేందుకే రజనీ రాజకీయాల్లో వచ్చాడంటూ ఆయన అనుచరులు ప్రచారం చేస్తున్నారు. ఒకవేళ అదే నిజమైతే మాత్రం ఆయన అడ్డుకునేందుకు ముందు మేమే ఉంటాం. ఆయన రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారటం ఖాయం. గతంలో అలా ప్రయత్నించి విఫలమైనవారు చాలా మందే ఉన్నారు. కానీ, తనది ఆధ్యాత్మిక పార్టీ అని రజనీకాంత్‌ చెబుతున్నారు కాబట్టి దాని గురించి ఇప్పుడే ఏం స్పందించలేం.  పార్టీ ప్రారంభించే ముందు కేవలం సంప్రదాయ రీతిలో మాత్రమే కరుణను కలిశారు.. వేరే ఉద్దేశం లేదు. ఇంతకుముందు విజయ్‌కాంత్‌ కూడా పార్టీ ప్రారంభించే సమయంలో ఇలానే కరుణను కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు’’ అని స్టాలిన్‌ పేర్కొన్నారు. 

కాగా, కరుణానిధిని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయటంతోపాటు ఆరోగ్యం గురించి రజనీ వాకబు చేశారు. ఆపై తన రాజకీయ ఎంట్రీ గురించి ఆయనతో కాసేపు చర్చించినట్లు రజనీ సన్నిహితులు తెలిపారు. ఇదిలా ఉంటే రజనీ ఇంతకు ముందులా ట్విట్టర్‌లో అభిప్రాయాలను తెలియజేయటం మానుకుని.. ప్రజల్లోకి రావాలంటూ డీఎండీకే పార్టీ అధ్యక్షుడు విజయ్‌కాంత్‌ సతీమణి ప్రేమలత చెబుతున్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top