dmk alliance
-
వచ్చేది ద్రావిడ మోడల్ 2.0 ప్రభుత్వమే
చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 234 సీట్లకు గాను డీఎంకే కూటమి 200కుపైగా స్థానాలు గెల్చుకోవడం తథ్యమని ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ధీమా వ్యక్తంచేశారు. అన్నా డీఎంకే–బీజేపీ కూటమికి సిద్ధాంతం గానీ, ఒక విధానం గానీ లేవని విమర్శించారు. బీజేపీ స్వరాలకు అనుగుణంగా అన్నాడీఎంకే నర్తిస్తోందని ఎద్దేవా చేశారు. ఆ పార్టీకి ఢిల్లీ బీజేపీయే ప్రధాన కార్యాలయంగా మారిపోయిందని అన్నారు. స్టాలిన్ తాజాగా పీటీఐ వార్తా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. గత ఐదేళ్ల ద్రావిడ మోడల్ పాలనలో ప్రజల కోసం ఎన్నెన్నో సంక్షేమ పథకాలు అమలు చేశామని చెప్పారు. కళైంజర్ మహిళా పథకం కింద నెలకు రూ.1,000, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, పాఠశాల విద్యార్థులకు అల్పాహారం, రెండు లక్షల మంది రైతులకు ఉచిత విద్యుత్ కనెక్షన్ల జారీ వంటి పథకాలను ప్రస్తావించారు. ప్రజల ప్రేమాభిమానాలు, అండదండలతో లౌకిక ప్రజాస్వామ్య కూటమి(ఎస్పీఏ) 200కుపైగా సీట్లు గెల్చుకొని ద్రావిడ మోడల్ 2.0 ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఉద్ఘాటించారు. అన్నాడీఎంకే నాయకులు ఢిల్లీ పెద్దలకు బానిసలుగా మారిపోయారని మండిపడ్డారు. తమిళనాడు హక్కులను తాకట్టుపెట్టాలని చూస్తున్నవారు ముమ్మాటికీ బానిసలేనని తేల్చిచెప్పారు. స్టాలిన్ ఇంకా ఏం చెప్పారంటే.. మహిళల భద్రత మా బాధ్యత ‘‘మా కూటమిలో సీట్ల పంపకం విషయంలో పెద్దగా ఇబ్బందులు ఎదురు కాలేదు. సానుకూలంగా చర్చించుకొని సీట్లు ఖరారు చేసుకున్నాం. కూటమి అభ్యర్థుల విజయం కోసం మిత్రపక్షాలు కలిసికట్టుగా కృషి చేస్తున్నాయి. కొత్త పార్టీల చేరికతో ఎస్పీఏ మరింత బలంగా మారింది. తమిళనాడుతోపాటు పుదుచ్చేరిలోనూ అద్భుత విజయం సాధించబోతున్నాం. ద్రావిడ విప్లవ సిద్ధాంతాన్ని విశ్వసించేవారు మా పార్టీలో చేరారు. అందుకే మాజీ సీఎం పన్నీర్‌సెల్వం డీఎంకేను ఎంచుకున్నారు. జాతీయ స్థాయిలో విపక్ష ‘ఇండియా’ కూటమిలో కీలక పాత్ర పోషించాలన్న ఆసక్తి లేదు. నా పరిధి ఏమిటో నాకు తెలుసు. స్టాలిన్ కుటుంబం పవర్ సెంటర్‌గా మారిందన్న విపక్షాల ఆరోపణల్లో నిజం లేదు. ద్రావిడ మోడల్ సుపరిపాలన, గత ఐదేళ్లలో మేము సాధించిన విజయాలను జీర్ణించుకోలేక ప్రజల దృష్టిని మళ్లించడానికి ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు. మహిళల భద్రతకు మా ప్రభుత్వం పెద్దపీట వేసింది. వారి రక్షణ కోసం పటిష్టమైన చర్యలు చేపట్టాం. మహిళలపై నేరాలకు పాల్పడిన వారికి శిక్షలను కఠినతరం చేశాం. మహిళా ఉద్యోగులు, కార్మికులు అత్యధికంగా ఉన్న రాష్ట్రం తమిళనాడు. వారి భద్రత మా బాధ్యత’’ అన్నారు. మనసుకు దగ్గరైన పథకాలు ‘‘మహిళలకు నెలకు రూ.1,000 ఆర్థిక సాయం, స్కూల్ విద్యార్థులకు అల్పహారం పథకాలు నా మనసుకు చాలా దగ్గరయ్యాయి. మహిళలకు ఆర్థిక సాయం పథకం దేశంలో అత్యుత్తమంగా అమలవుతున్న పథకం కావడం గర్వకారణం. ఇతర రాష్ట్రాల్లోనూ అమలు చేస్తున్నారు. విమర్శించినవారే ఇప్పుడు ప్రశంసిస్తున్నారు. మళ్లీ అధికారంలోకి రాగానే ఈ సాయాన్ని రూ.2,000కు పెంచుతాం. అలాగే అల్పాహారం పథకాన్ని ఎనిమిదో తరగతి విద్యార్థుల దాకా విస్తరింపజేస్తాం. ఏ ఒక్క విద్యార్థి కూడా ఆకలితో పాఠశాలకు రాకూడదు. అదే మా లక్ష్యం. పిల్లల కడుపు నిండుతోంది, చక్కగా చదువుకుంటున్నారు. అది నాకు చాలా సంతృప్తినిస్తోంది’’ అని ఆయన అన్నారు. తమిళనాడు పోరాడుతుంది.. గెలుస్తుంది‘‘మహిళా రిజర్వేషన్ల అమలు విషయంలో కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. రాజకీయ లబ్ధి కోసం ఆయుధంగా ఉపయోగించుకుంటోంది. మహిళలకు రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలి. నియోజకవర్గాల పునర్విభజనతో ముడిపెట్టకూడదు. ఈ పునర్విభజన విషయంలో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగితే సహించే ప్రసక్తే లేదు. జనాభా పెరుగుదలను విజయవంతంగా నియంత్రించిన రాష్ట్రాలను శిక్షించాలనుకోవడం సరైంది కాదు. తమిళనాడు పోరాడుతుంది, తమిళనాడు గెలుస్తుంది. ఇదే మా నినాదం. మైనార్టీలను భయపెట్టాలన్నదే బీజేపీ అసలు ఎజెండా. మోదీ పాలనలో ముస్లింలపై విచ్చలవిడిగా దాడులు జరుగుతున్నాయి. క్రిస్టమస్ పండుగ కూడా ప్రశాంతంగా నిర్వహించుకోలేని దుస్థితి ఏర్పడింది. క్రైస్తవులను కూడా టార్గెట్ చేశారు. భారత్ ఎప్పటికీ లౌకిక దేశంగానే ఉండాలి. మైనార్టీలకు రాజ్యాంగం ఇచ్చిన హక్కులను కాపాడాలి. మైనార్టీల హక్కుల కోసం మొదట మేమే గొంతు వినిపిస్తాం’’ అని స్టాలిన్ స్పష్టం చేశారు. -
ముక్కోణపు పోరు
ఇటు కాంగ్రెస్ తదితర పార్టీలతో కూడిన అధికార డీఎంకే కూటమి. అటు బీజేపీ–అన్నాడీఎంకేల విపక్ష కూటమి. మరోవైపు కొత్తగా దూసుకొచ్చిన సినీ నటుడు విజయ్ సారథ్యంలోని టీవీకే. దాంతో తమిళనాడులో ఈసారి అత్యంత ఆసక్తికరమైన ముక్కోణపు పోరుకు రంగం సిద్ధమైంది. ముఖ్యంగా డీఎంకే అధినేత, సీఎం ఎంకే స్టాలిన్ నాయకత్వ పటిమకు ఈ అసెంబ్లీ ఎన్నికలు అగ్నిపరీక్షగా మారాయి. దశాబ్దాలుగా తనకు ఏ మాత్రమూ కొరుకుడు పడని తమిళ గడ్డపై ఎలాగైనా కాషాయ జెండా పాతాలని బీజేపీ పట్టుదలగా ఉంది. ప్రజల్లో, ముఖ్యంగా యువత, మహిళల విశేషమైన ఆదరణ కచి్చతంగా ఓట్ల రూపంలో ప్రతిఫలిస్తుందని విజయ్ భారీ ఆశలే పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో అన్నా కూటమిని, విజయ్ పార్టీని స్టాలిన్ ఏ మేరకు నిలువరిస్తారన్నది ఆసక్తికరం. మరోసారి అన్ని స్థానాల్లోనూ ఒంటరిగా బరిలో దిగుతున్న సీమన్ సారథ్యంలోని ఎన్టీకే ఎవరి ఓటు బ్యాంకును చీలుస్తుందన్నది కూడా కీలకంగా మారనుంది...డీఎంకే కూటమికి... మోదమో, ఖేదమో! తమిళనాడులో ఈసారి అసెంబ్లీ ఎన్నికల పోరు హోరాహోరీగా సాగనుంది. అన్నాడీఎంకే కూటమితో పాటు కొత్త పార్టీ టీవీకే నుంచి గట్టి పోటీ తప్పదని తేలిపోవడంతో అధికార డీఎంకే సర్వశక్తులూ ఒడ్డుతోంది. సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్ (ఎస్పీఏ) పేరిట కాంగ్రెస్, వామపక్షాలతో పాటు దాదాపు 20 పార్టీలతో మరోసారి జట్టు కట్టి ఎన్నికల బరిలోకి దిగుతోంది! కాంగ్రెస్, ఎండీఎంకేతో పాటు విజయ్‌కాంత్ స్థాపించిన డీఎంఎంకేలతో సీట్ల సర్దుబాటు ఇప్పటికే పూర్తయింది. ఎప్పట్లా ద్రవిడ నినాదంతో పాటు ప్రధానంగా సంక్షేమ పథకాలనే స్టాలిన్ పార్టీ నమ్ముకుంటోంది. విద్యార్థులకు ఉచిత అల్పాహారం, మహిళలకు నెలవారీ ఆర్థిక సాయం తదితర పథకాలే తమను ఒడ్డున పడేస్తాయని భావిస్తోంది. దీనికి తోడు తమిళ అస్తిత్వం, రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రధాని నరేంద్ర మోదీతో తలపడుతున్న యోధునిగా స్టాలిన్‌కు ఉన్న ఇమేజీ కూడా కలిసొస్తుందని ఆశిస్తోంది. ముస్లింలు, మైనారిటీల ఓట్లపైనా ఆశలు పెట్టుకుంది. కాకపోతే ప్రభుత్వ వ్యతిరేకత, మంత్రుల విచ్చలవిడి అవినీతి, రాష్ట్రంలో పెచ్చరిల్లుతున్న నేరాలు, డ్రగ్స్ వంటివి డీఎంకేకు పెద్ద తలనొప్పిగా మారాయి. కుటుంబ రాజకీయాల ముద్ర కూడా ప్రతికూలంగా మారుతుందేమోనన్న భయం డీఎంకేను వెంటాడుతోంది. దీనికి తోడు సీమన్ పార్టీ నామ్ తమిళార్ కట్చి (ఎన్టీకే) కూడా స్టాలిన్ పార్టీకి తలనొప్పిగా మారేలా ఉంది. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్టీకే సీట్లేమీ గెలుచుకోకపోయినా 6 శాతం ఓట్లు సాధించింది. దాని ఓటు షేరు ఈసారి 10 నుంచి 15 శాతానికి పెరగవచ్చని పలు సర్వేలు చెబుతున్నాయి! ఎన్టీకే ప్రధానంగా డీఎంకే ఓటు బ్యాంకుకే గండి కొట్టవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. ఆ అంచనాలే గనక నిజమైతే ముక్కోణపు పోరులో కోలుకోలేని నష్టం తప్పదేమోనని డీఎంకే కలవరపడుతోంది.డీఎంకే కూటమి సానుకూలతలు → భాగస్వాములతో సజావుగా సాగిన పొత్తుల ఖరారు → డీఎంకేకు బూత్ స్థాయి దాకా పటిష్టమైన నిర్మాణం → సంక్షేమ పథకాలు. ముఖ్యంగా మహిళలు, విద్యార్థులు మొదలుకుని గిగ్ వర్కర్ల దాకా నగదు బదిలీ పథకాలు → డీఎంకే వ్యతిరేక ఓట్లను టీవీకే చీల్చనుందన్న సంకేతాలు → మైనారిటీల మద్దతు ప్రతికూలతలు → మంత్రులు, నేతలపై అవినీతి ఆరోపణలు → రాష్ట్రంలో బాగా పెరిగిన నేరాలు → తీవ్రమైన ప్రభుత్వ వ్యతిరేకతఅన్నాడీఎంకే... కష్టాలకు ఎదురీత!జయలలిత మరణానంతరం పదేళ్లుగా ఒక్క ఎన్నికల్లో కూడా గెలుపు ముఖం చూడని అన్నాడీఎంకే ఈసారి కూడా కష్టాలకు ఎదురీదుతోంది. కీలక నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. మాజీ సీఎం ఒ.పన్నీర్‌సెల్వంతో పాటు పలువురు ఎమ్మెల్యేలు రాజీనామా చేసి డీఎంకే, టీవీకే గూటికి చేరారు. దీనికి తోడు నాయకత్వ లేమి పార్టీని తీవ్రంగా బాధిస్తోంది. అయితే క్షేత్రస్థాయిలో ఇప్పటికీ బలంగానే ఉండటం అన్నాడీఎంకేకు అతి పెద్ద సానుకూలత. దానికి బీజేపీ బలం కూడా తోడవుతోంది. కన్యాకుమారి తదితర జిల్లాలతో పాటు రాష్ట్రంలో పశి్చమ ప్రాంతాల్లో కొన్నేళ్లుగా కాషాయ పార్టీ క్రమంగా పుంజుకుంటూ వస్తోంది. తన క్షేత్రస్థాయి బలానికి బీజేపీ ఆర్థిక వెన్నుదన్ను తోడై మెరుగైన ఫలితాలు సాధిస్తానని అన్నాడీఎంకే నమ్ముతోంది. అయితే విజయ్ పార్టీని కూటమిలోకి తీసుకొచ్చేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు ఆ పార్టీకి రుచించడం లేదు. ఇది అంతిమంగా వాటి మధ్య సామరస్యాన్ని దెబ్బతీసే ఆస్కారం లేకపోలేదు. పైగా బీజేపీ హిందూత్వ ఎజెండా తమిళనాడులో పెద్దగా ఫలించకపోవచ్చని గత అనుభవాలు చాటుతున్నాయి.అంతేగాక బీజేపీకి ఉన్న మైనారిటీ వ్యతిరేక ముద్ర అంతిమంగా కూటమికి చేటు చేయవచ్చన్న అంచనాలూ లేకపోలేదు. పైగా జయలలిత నెచ్చెలి శశికళ పెట్టిన కొత్త పార్టీ కూడా అన్నాడీఎంకే ఓట్లకు ఎంతోకొంత గండి కొట్టవచ్చంటున్నారు. ఇన్ని సవాళ్ల నేపథ్యంలో పార్టీ పునాదులను పదిలంగా కాపాడుకోవడమే ఎడప్పాడి కె.పళనిస్వా మికి పరీక్షగా నిలవనుంది. అయితే కావేరీ డెల్టాలో రైతుల దుస్థితి తదితర సమస్యలపై గళమెత్తడం ద్వారా ప్రజల్లోకి వెళ్తూ ఆయన గట్టిగానే చెమటోడుస్తున్నారు.అన్నాడీఎంకే–బీజేపీ కూటమి సానుకూలతలు → బీజేపీ రూపంలో అపారమైన అర్థ, అంగ బలాలు → అన్నాడీఎంకేకు క్షేత్రస్థాయి దాకా ఉన్న పట్టు → జయలలిత పట్ల ప్రజల్లో చెక్కుచెదరని ఆదరణ ప్రతికూలతలు → నాయకత్వ లేమి → శశికళ సొంత పార్టీతో ఓట్లు చీలే ఆస్కారం → ముఖ్య నేతల వలసలు → బీజేపీపై హిందూత్వ, తమిళ వ్యతిరేక ముద్రవిజయ్ పార్టీ... ఆశల పల్లకీలో! సినీ నటుడు విజయ్ తమిళ రాజకీయాల్లో ఎక్స్ ఫ్యాక్టర్‌గా దూసుకొచ్చారు. ఆయన స్థాపించిన తమిళగ వెట్రి కళగం పార్టీ డీఎంకే, అన్నాడీఎంకే కూటములకు ఆందోళన కలిగించింది. వాటికి మూడో ప్రత్యామ్నాయంగా కనిపించింది. విజయ్ రోడ్ షోలు, సభలకు జనం విరగబడ్డారు. కానీ వీఎంకే జోరుకు కొన్నాళ్లుగా బ్రేకులు పడుతూ వస్తున్నాయి. గత సెప్టెంబర్‌లో కరూర్ బహిరంగ సభలో జరిగిన తొక్కిసలాట ఉదంతం విజయ్‌కి బాగా మైనస్‌గా మారింది. ఏకంగా 41 మంది కార్యకర్తలు దుర్మరణం పాలైతే వేదిక నుంచి హడావుడిగా నిష్క్రమించారన్న ప్రచారం చేటు చేసింది. కనీసం ఆ తర్వాతైనా చనిపోయిన వారి కుటుంబాలను కలిసేందుకు అయిష్టత వెలిబుచ్చడం విజయ్ ఇమేజీని మసకబార్చింది. తొక్కిసలాటపై ఆయన పలుమార్లు సీబీఐ విచారణకు హాజరు కావాల్సి వచి్చంది. బీజేపీతో పొత్తు దిశగా ఒత్తిడి పెంచేందుకు దీన్ని మోదీ సర్కారు వాడుకుంటోందన్న ప్రచారాన్ని విజయ్ గట్టిగా ఖండించకపోవడం టీవీకేకు మరింత చేటు చేస్తోంది. దీనికి తోడు ఎన్నికలు సమీపించిన తరుణంలో విజయ్‌తో విడాకులు కోరుతూ ఆయన భార్య కోర్టుకెక్కడం మరో మైనస్‌గా మారింది. సినీ నటి త్రిషతో ఆయన బంధమే ఇందుకు కారణమన్న ప్రచారం మహిళల్లో ప్రతికూలంగా మారేలా కనిపిస్తోంది. పైపెచ్చు డీఎంకే, అన్నాడీఎంకేలతో పోలిస్తే టీవీకేకు రాష్ట్రవ్యాప్తంగా బలమైన వ్యవస్థాగత నిర్మాణం లేకపోవడం పెద్ద లోటే. ఇప్పటికైతే ఒంటరి పోరుకే విజయ్ పార్టీ మొగ్గుతోంది. అదే జరిగితే డీఎంకే, అన్నాడీఎంకే కూటముల్లో దేని ఓట్లకు టీవీకే గండికొడుతుందన్నది అంతిమ ఫలితాల్లో నిర్ణాయకంగా మారేలా కనిపిస్తోంది.టీవీకే సానుకూలతలు → విజయ్ కరిష్మా. యువత, మహిళల్లో భారీ ఫాలోయింగ్ → కొత్త పార్టీ కావడంతో క్లీన్ ఇమేజీ → మూడో ప్రత్యామ్నాయంగా తటస్థ ఓటర్లను ఆకట్టుకునే అవకాశం ప్రతికూలతలు → బలహీనమైన వ్యవస్థాగత నిర్మాణం → ఆదరణను ఓట్లుగా మలిచే యంత్రాంగం లేకపోవడం → నాయకుల లేమి, అనుభవ రాహిత్యం → విజయ్ విడాకుల కేసు, ఆయనపై సీబీఐ విచారణ -
ఉత్తరాదిలో ‘ఇండియా’కూటమి ఓటమికి డీఎంకేనే కారణం: తమిళిసై
చెన్నై: ఉత్తరాదిలో కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి తరచూ ఓటమి పాలవ్వడానికి తెలంగాణ మాజీ గవర్నర్, తమిళనాడు బీజేపీ నాయకురాలు తమిళిసై సౌందరరాజన్ కొత్త భాష్యం చెప్పారు. ఇండియా కూటమి ఓటమికి తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకే పార్టీయే కారణమని విశ్లేషించారు. శనివారం ఆమె చెన్నైలోని రాజ్‌భవన్ సమీపంలో ఉన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి పూలమాల వేసి, నివాళులు అర్పించిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.దేశాన్ని సమైక్యంగా ఉంచేందుకు పటేల్ కృషి చేశారని, డీఎంకే మాత్రం బిహారీలు, ఉత్తర భారతీయులపై వివక్ష చూపుతోందని తమిళిసై విమర్శించారు. ముఖ్యంగా బిహార్ ప్రజల గురించి డీఎంకే దారుణంగా మాట్లాడుతోందని దుయ్యబట్టారు. ‘‘బిహారీలు అజ్ఞానులంటూ డీఎంకే మంత్రి కేఎన్ నెహ్రూ అంటున్నారు. బల్లలు ఊడ్చడం, మరుగుదొడ్లను శుభ్రం చేయడంలో బిహారీలు మంచి పనివారని డీఎంకే వ్యాఖ్యలు చేసింది. బిహారీలు గోమూత్రం తాగేవారంటూ ఏకంగా చట్టసభల్లో డీఎంకే నేతలు విమర్శలు చేశారు’’ అని ఆమె వ్యాఖ్యానించారు. డీఎంకే వల్లే ఉత్తరాదిలో ఇండియా కూటమి ఓడిపోతోందని స్పష్టం చేశారు.మోదీ నుంచి మొదలు..ఇటీవల బిహార్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ప్రధాని నరేంద్ర మోదీ తొలుత డీఎంకే అంశాన్ని లేవనెత్తారు. డీఎంకే తమిళనాడులో ఉన్న ఉత్తరాది కార్మికులను వేధిస్తోందని విమర్శించారు. ఈ వ్యాఖ్యలను డీఎంకే నేతలు ఖండిస్తున్న నేపథ్యంలో.. తమిళనాడు బీజేపీ నేతలు ప్రతివిమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తమిళిసై శనివారం డీఎంకేపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. -
Lok sabha elections 2024: మాణిక్కం ఠాగూర్ వర్సెస్ రాధిక
సాక్షి, న్యూఢిల్లీ: డీఎంకేతో పొత్తులో భాగంగా తమిళనాడులో పోటీ చేస్తున్న తొమ్మిది స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై కసరత్తును కాంగ్రెస్ వేగవంతం చేసింది. శుక్రవారం జరిగిన సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీలో విరుధునగర్ సహా నాలుగు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. విరుధునగర్ నుంచి కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎంపీ మాణిక్కం ఠాగూర్ మరోసారి బరిలో దిగుతున్నారు. మరోవైపు ఈ స్థానాన్ని సినీ నటి రాధికా శరత్‌కుమార్‌కు కేటాయిస్తూ బీజేపీ కూడా శుక్రవారమే నిర్ణయం తీసుకుంది! దాంతో ఇక్కడ పోటీ ఆసక్తికరంగా మారింది. 2009లో కూడా ఇక్కడ మాణిక్కం నెగ్గారు. 2014లో డీఎంకే, కాంగ్రెస్ విడిగా పోటీ చేయడంతో అన్నాడీఎంకే అభ్యర్థి టి.రాధాకృష్ణ భారీ గెలుపొందారు. 2019లో కాంగ్రెస్, డీఎంకే కలిసి పోటీ చేయడంతో మాణిక్కం ఠాగూర్ మరోసారి నెగ్గారు. డీఎంకే మద్దతుతో ఈసారీ సునాయాసంగా నెగ్గుతామని కాంగ్రెస్ భావిస్తోంది. -
తమిళులకు డీఎంకే–కాంగ్రెస్ ద్రోహం చేశాయి: నడ్డా
సాక్షి ప్రతినిధి, చెన్నై: పదేళ్ల యూపీఏ పాలనలో తమిళనాడు ప్రజలకు డీఎంకే–కాంగ్రెస్ కూటమి మేలు చేయకపోగా తీరని ద్రోహం చేసిందని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా విమర్శించారు. తమిళనాడు రాష్ట్రం కన్యాకుమారి లోక్‌సభ ఉప ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికల కూటమి అభ్యర్థుల కోసం ఆయన ఆదివారం ప్రచారం చేశారు. తిరునల్వేలిలోనూ పర్యటించారు. ‘కుటుంబరాజకీయం, అవినీతిమయ పాలనలో ఆరితేరిన డీఎంకే, కాంగ్రెస్‌లతో దేశానికి అరిష్టం. తమిళనాడులో జల్లికట్టు క్రీడపై నిషే«ధానికి కాంగ్రెస్ హయాంలో పర్యావరణశాఖ మంత్రిగా ఉన్న జైరాం రమేష్ కారణం. ఆనాడు యూపీఏలో భాగస్వామి అయిన డీఎంకే ఈ నిషేధంపై నోరుమెదపలేదు. 2జీ కుంభకోణమే డీఎంకే మౌనానికి కారణం. మోదీ ప్రధాని అయిన తరువాతనే తమిళుల సంప్రదాయ క్రీడ జల్లికట్టుపై నిషేధం తొలగింది’అని అన్నారు. పశ్చిమబెంగాల్లో రెండో విడత పోలింగ్‌లో బీజేపీ గాలి వీచిందని అన్నారు. కేరళలో స్వల్ప మెజార్టీతోనైనా అధికారంలోకి వస్తామనే నమ్మకం ఉందని చెప్పారు. నాలుగు రాష్ట్రాల్లోనూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. -
మోడీ సభలకు ఏర్పాట్లు షురూ
సాక్షి, చెన్నై: రాష్ట్రంలో గెలుపే లక్ష్యంగా డీఎంకే కూటమి ఉరకలు తీస్తోంది. తమ కూటమి అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేయూలని బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ నిర్ణయించారు. అందుకు తగ్గ ఏర్పాట్లలో బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు పొన్ రాధాకృష్ణన్ నిమగ్నమయ్యూరు. రాష్ట్రంలో డీఎంకే, అన్నాడీఎంకేలకు ప్రత్యామ్నాయంగా బీజేపీ నేతృత్వంలో కూటమి ఆవిర్భవించిన విషయం తెలిసిందే. ఇందులో డీఎండీకే, పీఎంకే, ఎండీఎంకే, ఐజేకే, కొంగునాడు పార్టీలు ఉన్నాయి. అత్యధిక స్థానాల్ని కైవశం చేసుకోవడమే లక్ష్యంగా ఈ కూటమి నేతలు ఉరకలు తీస్తున్నారు. కూటమి అభ్యర్థులకు మద్దతుగా డీఎండీకే నేత విజయకాంత్, ఆయన సతీమణి ప్రేమలత వేర్వేరుగా సుడిగాలి ప్రచారం చేస్తున్నారు. ఎండీఎంకే నేత వైగో కూడా ప్రచార బాటకు శ్రీకారం చుట్టారు. తాను విరుదునగర్ నుంచి పోటీ చేస్తున్నప్పటికీ, కూటమి అభ్యర్థుల విజయం కోసం ప్రచారాన్ని వేగవంతం చేశారు. అలాగే, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పొన్ రాధాకృష్ణన్, పీఎంకే నేత రాందాసు తమకు పట్టున్న చోట్ల ప్రచార సభలతో దూసుకెళుతున్నారు. తమ ప్రచారాలకు అనూహ్య స్పందన వస్తుండడంతో పాటు మోడీ నామ జపం మారుమోగుతోంది. దీంతో ప్రచారానికి మోడీని ఆహ్వానించాలని నిర్ణయించారు. రాష్ట్ర పార్టీ వినతికి స్పందించిన మోడీ రెండు చోట్ల ప్రచార సభలకు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. ఏర్పాట్లలో నాయకులు బిజీ ప్రచారానికి మోడీ వస్తుండడంతో అందుకు తగ్గ ఏర్పాట్లపై బీజేపీ రాష్ట్ర నాయకులు దృష్టి కేంద్రీ కరించారు. ఆయన ప్రచార సభల వేదికల్ని ఎంపిక చేస్తున్నారు. కన్యాకుమారి, చెన్నైలో మోడీ ప్రచార సభలను నిర్వహించే అవకాశాలున్నాయి. ఈ మేరకు సభల ఏర్పాట్లతో పాటు ముఖ్య నాయకుల్ని పిలిపించి వారి ద్వారా కూడా ప్రచారం చేపట్టేందుకు కార్యాచరణ సిద్ధం చేశారు. పార్టీ పార్లమెంటరీ నేత సుష్మాస్వరాజ్ సైతం ఇక్కడికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. మోడీ ప్రచార సభ వేదికపై బీజేపీ కూటమిలోని పార్టీల మిత్రులు ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ విషయంగా మదురైలో పొన్ రాధాకృష్ణన్‌ను మీడియా కదిలించగా మోడీ ప్రచార సభలకు ఏర్పాట్లు చేస్తున్నామని, ఆయన పర్యటనల వివరాల మేరకు ఇక్కడ వేదికల్ని సిద్ధం చేస్తామన్నారు.


