చెన్నై: ఉత్తరాదిలో కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి తరచూ ఓటమి పాలవ్వడానికి తెలంగాణ మాజీ గవర్నర్, తమిళనాడు బీజేపీ నాయకురాలు తమిళిసై సౌందరరాజన్ కొత్త భాష్యం చెప్పారు. ఇండియా కూటమి ఓటమికి తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకే పార్టీయే కారణమని విశ్లేషించారు. శనివారం ఆమె చెన్నైలోని రాజ్‌భవన్ సమీపంలో ఉన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి పూలమాల వేసి, నివాళులు అర్పించిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.
దేశాన్ని సమైక్యంగా ఉంచేందుకు పటేల్ కృషి చేశారని, డీఎంకే మాత్రం బిహారీలు, ఉత్తర భారతీయులపై వివక్ష చూపుతోందని తమిళిసై విమర్శించారు. ముఖ్యంగా బిహార్ ప్రజల గురించి డీఎంకే దారుణంగా మాట్లాడుతోందని దుయ్యబట్టారు. ‘‘బిహారీలు అజ్ఞానులంటూ డీఎంకే మంత్రి కేఎన్ నెహ్రూ అంటున్నారు. బల్లలు ఊడ్చడం, మరుగుదొడ్లను శుభ్రం చేయడంలో బిహారీలు మంచి పనివారని డీఎంకే వ్యాఖ్యలు చేసింది. బిహారీలు గోమూత్రం తాగేవారంటూ ఏకంగా చట్టసభల్లో డీఎంకే నేతలు విమర్శలు చేశారు’’ అని ఆమె వ్యాఖ్యానించారు. డీఎంకే వల్లే ఉత్తరాదిలో ఇండియా కూటమి ఓడిపోతోందని స్పష్టం చేశారు.
మోదీ నుంచి మొదలు..
ఇటీవల బిహార్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ప్రధాని నరేంద్ర మోదీ తొలుత డీఎంకే అంశాన్ని లేవనెత్తారు. డీఎంకే తమిళనాడులో ఉన్న ఉత్తరాది కార్మికులను వేధిస్తోందని విమర్శించారు. ఈ వ్యాఖ్యలను డీఎంకే నేతలు ఖండిస్తున్న నేపథ్యంలో.. తమిళనాడు బీజేపీ నేతలు ప్రతివిమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తమిళిసై శనివారం డీఎంకేపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.


