ఏప్రిల్‌ 23న వేతనంతో కూడిన సెలవు | - | Sakshi
Sakshi News home page

ఏప్రిల్‌ 23న వేతనంతో కూడిన సెలవు

Mar 20 2026 8:14 AM | Updated on Mar 20 2026 8:14 AM

– ప్రైవేట్‌ సంస్థలకు ఆదేశం

తిరువొత్తియూరు: తమిళనాడులో ఎన్నికల రోజున (ఏప్రిల్‌ 23వ తేదీన) వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని ప్రైవేట్‌ సంస్థలకు ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. వివరాలు.. తమిళనాడులో శాసనసభ ఎన్నికలు ఏప్రిల్‌ 23వ తేదీన జరుగుతాయి. ఆ తర్వాత, మే 4వ తేదీన ఎన్నికల ఫలితాలు ప్రకటించబడతాయి. ఈ నేపథ్యంలో, ఎన్నికల రోజున (ఏప్రిల్‌ 23వ తేదీన) ప్రైవేట్‌ సంస్థలు, ప్రైవేట్‌ కర్మాగారాల్లోని ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవు అందించాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. ఓటర్లు తమ ప్రజాస్వామ్య హక్కును ఎటువంటి అడ్డంకులు లేకుండా వినియోగించుకునేలా, ఎటువంటి భయం లేకుండా ఓటు వేసేలా నిర్ధారించేందుకు ఎన్నికల సంఘం ఈ ఆదేశాలను జారీ చేసింది. ఈ ఆదేశాలను ఉల్లంఘించే సంస్థలపై కార్మిక సంక్షేమ శాఖ ద్వారా కఠిన చర్యలు తీసుకుంటామని ఎన్నికల సంఘం హెచ్చరించింది. అలాగే కేరళ, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాలలో కూడా ఆయా ఎన్నికల తేదీల్లో సెలవు ప్రకటించారు.

3వ బిడ్డను ప్రసవిస్తే పూర్తి వేతనంతో 12 వారాల సెలవు

– తమిళనాడు ప్రభుత్వ ఉత్తర్వులు

తిరువొత్తియూరు: మహిళా ప్రభుత్వ ఉద్యోగులు 3వ బిడ్డను ప్రసవిస్తే, వారికి పూర్తి వేతనంతో 12 వారాల ప్రసూతి సెలవు మంజూరు చేస్తామని తమిళనాడు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తమిళనాడులో, మహిళా ప్రభుత్వ ఉద్యోగులు 2 పిల్లలను ప్రసవించడానికి మాత్రమే ఒక్కో ప్రసవానికి ఒక సంవత్సరం (365 రోజులకు మించకుండా) పూర్తి వేతనంతో ప్రసూతి సెలవు మంజూరు చేస్తున్నారు. మొదటి ప్రసవంలో కవలలు జన్మించినా, 2వ ప్రసవానికి కూడా ఒక సంవత్సరం సెలవు ఇస్తారు. 3వ బిడ్డను ప్రసవించేటప్పుడు, వారికి ప్రసూతి సెలవు మంజూరు చేయడం లేదు. ఈ నేపథ్యంలో 3వ బిడ్డను ప్రసవించడానికి కూడా ప్రసూతి సెలవు మంజూరు చేయాలని కోరుతూ మహిళా ప్రభుత్వ ఉద్యోగులు చైన్నె హైకోర్టులో కేసు దాఖలు చేశారు. దీనిని అనుసరించి, గత జనవరి 21న హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల వివరాలు గత 2025 మే 23న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో, సెలవు మంజూరు చేయడానికి పిల్లలు పుట్టే గరిష్ట పరిమితిని నిర్ణయించకూడదు. 3వ బిడ్డకు కావాలంటే, జాతీయ స్థాయిలో 26 వారాల ప్రసూతి సెలవును 12 వారాలకు తగ్గించవచ్చు. ప్రసవం తేదీకి 6 వారాల ముందు సెలవు మంజూరు చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వును తమిళనాడు ప్రభుత్వం అమలు చేయాలని ఆదేశిస్తూ హైకోర్టు కేసును మూసివేసింది. దీని ఆధారంగా తమిళనాడు ప్రభుత్వం ప్రాథమిక నిబంధనలను సవరించి మార్చి 13న ప్రభుత్వ ఉత్తర్వును జారీ చేసింది. మూడో బిడ్డకు 12 వారాల ప్రసూతి సెలవు మంజూరు చేస్తామని పేర్కొన్నారు.

రిజర్వ్‌ ఫారెస్టులో

42 రిసార్టులకు తాళం

– హైకోర్టుకు అటవీ శాఖ సమాచారం

సాక్షి, చైన్నె: ఈ రోడ్‌జిల్లా సత్యమంగళం టైగర్‌ రిజర్వ్‌ పరిధిలో 42 అక్రమ రిసార్ట్‌లకు తాళం వేసినట్టు అటవీ శాఖ ప్రకటించింది. పర్యావరణ పరిరక్షణ , వన్యప్రాణుల రక్షణలో భాగంగా ఈ కఠిన చర్యలు తీసుకున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. కోయంబత్తూరుకు చెందిన ఓ సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌ ఆధారంగా వ్యవహారం ఇటీవల హైకోర్టుకు చేరింది. నేషనల్‌ బోర్డ్‌ ఫర్‌ వైల్డ్‌ లైఫ్‌ , హిల్‌ ఏరియా కన్జర్వేషన్‌ అథారిటీ నుండి ఎటువంటి అనుమతులు లేకుండా ఈ రిసార్ట్‌లు నడుస్తున్నాయని, దీనివల్ల పశ్చిమ కనుమల పర్యావరణ వ్యవస్థ దెబ్బతింటోందని ఆమె కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. హైకోర్టు సీజే జస్టిస్‌ ఎస్‌.ఎ. ధర్మాధికారి, జస్టిస్‌ జి. అరుల్‌ మురుగన్‌ లతో కూడిన ధర్మాసనం ఎదుట ప్రత్యేక ప్రభుత్వ న్యాయవాది టి. శ్రీనివాసన్‌ వాదనలు వినిపిస్తూ.. అటవీ ప్రాంతంలోని మొత్తం 53 రిసార్ట్‌లు , ఫామ్‌హౌస్‌లలో అధికారులు క్షేత్రస్థాయి తనిఖీలు నిర్వహించారని తెలిపారు. వీటిలో కేవలం 11 రిసార్ట్‌లు మాత్రమే సరైన అనుమతులతో నడుస్తున్నట్లు గుర్తించామన్నారు. ఎటువంటి లైసెన్సులు లేని 42 రిసార్ట్‌లను తక్షణమే సీల్‌ చేసి, వాటి కార్యకలాపాలను నిలిపివేశామన్నారు. కేసు తదుపరి విచారణను ఏప్రిల్‌ 7వ తేదీకి వాయిదా వేసింది.

సహాయకాల పంపిణీ

సాక్షి, చైన్నె: చైన్నెలో రేష్మా ఫౌండేషన్‌ చారిటబుల్‌ ఆర్గనైజేషన్‌ నేతృత్వంలో పేదలు, దివ్యాంగులు, అందులకు గురువారం సహాయకాలను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో తమిళమానిల కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జీఆర్‌ వెంకటే ష్‌, నేతలు రాజం ఎంపీనాథన్‌, మణివణ్ణన్‌, నాగరాజన్‌, వేల్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement