సాక్షి, చైన్నె : మిత్రులకు సీట్ల సంఖ్య పెంచే విషయంలో తగ్గే ప్రసక్తే లేదని డీఎంకే సీట్ల సర్దుబాటు కమిటీ స్పష్టం చేసింది. దీంతో వీసీకే నేత తిరుమావళవన్ డీఎంకే అధ్యక్షుడు,సీఎం స్టాలిన్‌తో గురువారం గంట పాటుగా సీట్ల విషయంగా చర్చించినట్టు సమాచారాలు వెలువడ్డాయి. అదే సమయంలో తమకు రెండు సీట్లే ఇస్తామని డీఎంకే తేల్చడంతో పార్టీ వర్గాలతో శుక్రవారం విస్తృత స్థాయి సమావేశానికి మక్కల్ నీది మయ్యం నేత కమలహాసన్ నిర్ణయించారు. డీఎంకే కూటమిలో ఈసారి పార్టీల సంఖ్య అధికం అన్న విషయం తెలిసిందే. దీంతో ఆది నుంచి కొనసాగుతూ వస్తున్న మిత్రులకు 2021లో ఇచ్చిన సీట్ల కంటే కాస్త తగ్గించే పనిలో డీఎంకే నిమగ్నమైంది. ఒక్కకాంగ్రెస్‌కు గతంలో కంటే మూడు సీట్లను అదనంగా కేటాయిస్తూ, 28 సీట్లు అందజేశారు. మిగిలిన వారందరికి సీట్లు తగ్గించారు. అయితే ఈ సీట్ల తగ్గింపు విషయంగా వీసీకే నేత తిరుమావళవన్, సీపీఎం నేత షణ్ముగం, మక్కల్ నీది మయ్యంనేత కమలహాసన్‌లు అసంతృప్తితో ఉన్నట్టు సమాచారాలు వెలువడ్డాయి.
మూడు పార్టీల అయోమయం..
తిరుమావళవన్‌కు గతంలో ఇచ్చిన ఆరులో ఓ స్థానం తగ్గించి ఐదు, సీపీఎంకు సైతం అదే సంఖ్య సీటు ఇవ్వడానికి డీఎంకే సర్దుబాటు కమిటీ నిర్ణయించినట్టు సమాచారాలు వెలువడ్డాయి. అలాగే, మక్కల్ నీది మయ్యంకు రెండు స్థానాలు ఇవ్వడానికి నిర్ణయించినట్టు సంకేతాలు వెలువడ్డాయి. అయితే, తమకు కనీసం పది స్థానాలు కావాలని వీసీకే నేత తిరుమావళవన్ పట్టుబడుతున్నట్టు తెలిసింది. ఈ విషయంగా ఆయన గురువారం డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌ను కలిసి మాట్లాడినట్టు సమాచారాలు వెలువడ్డాయి. సీట్లను తగ్గించుకోవాలని స్టాలిన్ సైతం సూచించడంతో ఆయనమౌనంగా అక్కడి నుంచి వెళ్లి పోయినట్టు చర్చ జరుగుతోంది. ఇక, సీపీఎం సైతం తదుపరి నిర్ణయంపై పార్టీ వర్గాలతోచర్చిస్తున్నది. అదే సమయంలో మక్కల్ నీది మయ్యం నేత కమలహాసన్ సైతం పార్టీ వర్గాల అభిప్రాయాలను సేకరించినానంతరం ఆ రెండుసీట్లు తీసుకోవాలా..? వద్దా? అన్న విషయంగా శుక్రవారం తేల్చనున్నారు. మిత్రులు సీట్ల కోసం కుస్తీలుపడుతుంటే, ఆ బాధ్యతలను పార్టీ కోశాధికారి టీఆర్‌బాలు నేతృత్వంలోని కమిటీకి అప్పగించిన స్టాలిన్, తాను మాత్రం పార్టీ తరపున పోటీచేసేందుకు దరఖాస్తు చేసుకున్న ఆశావహుల ఇంటర్వ్యూలో గురువారం అంతా నిమగ్నమయ్యారు.


