చర్చలను విస్మరించి తీర్థయాత్రలో రంగన్న | - | Sakshi
Sakshi News home page

చర్చలను విస్మరించి తీర్థయాత్రలో రంగన్న

Mar 20 2026 8:14 AM | Updated on Mar 20 2026 8:14 AM

సాక్షి, చైన్నె : పుదుచ్చేరిలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. అధికార ఎన్‌.ఆర్‌. కాంగ్రెస్‌ , బీజేపీ మధ్య పొత్తు దాదాపు ముగిసినట్లే అన్న చర్చ జోరందుకుంది. కేంద్ర మంత్రి మన్సుఖ్‌ మాండవియా నేతృత్వంలోని బందం చర్చల కోసం ఢిల్లీ నుండి పుదుచ్చేరికి ప్రత్యేక విమానంలో బయలు దేరింది. అదే సమయంలో వారిని కలవకుండా సీఎం రంగస్వామి హఠాత్తుగా ఆధ్యాత్మిక యాత్రకు వెళ్లడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

పట్టువదలని రంగన్న

ఇటీవల ఢిల్లీలో ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ నేతల సమక్షంలో జరిగిన సమావేశంలో రంగస్వామి కొన్ని కీలక నిబంధనలు విధించినట్లు సమాచారం. కూటమిలో చేరే కొత్త పార్టీల వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదని బీజేపీ హామీ ఇచ్చినప్పటికీ, రంగస్వామి సంతృప్తి చెందనట్టు తెలిసింది. దీంతో గురువారం మాండవియా బృందం రంగస్వామితో చర్చలు జరపడానికి పుదుచ్చేరి బయలుదేరింది.

ముగింపు?

కేంద్ర మంత్రి తన నివాసానికి వస్తారనే సమాచారం ఉన్నప్పటికీ, సీఎం రంగస్వామి వారిని కలవకుండా మదురై మీనాక్షి అమ్మవారి దర్శనానికి వెళ్లారు. అక్కడి నుండి ఆయన తిరుచెందూర్‌ మురుగన్‌ ఆలయానికి కూడా వెళ్లారు. చర్చలను జాప్యం చేయడానికే ఆయన ఈ యాత్రను ఎంచుకున్నారని రాజకీయవర్గాలు పేర్కొంటున్నాయి. ఽశుక్రవారం కూడా ఆయన పలు ఆలయాల సందర్శనకు ఏర్పాట్లు చేసుకున్నారు.

కొత్త కూటమి దిశగా బీజేపీ

నేషనల్‌ డెమోక్రటిక్‌ అలయన్స్‌(ఎన్‌డీఏ)లో కొనసాగడానికి రంగస్వామి ఆసక్తి చూపడం లేదని ఆయన సన్నిహిత వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. దీంతో పుదుచ్చేరిలో బీజేపీ ఒంటరిగా లేదా అన్నాడీఎంకే, పీఎంకే, లక్ష్య జననాయక కచ్చి వంటి పార్టీలతో కలిసి కొత్త కూటమిని ఏర్పాటు చేసే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది. అదే సమయంలో రంగస్వామి సైతం విజయ్‌ టీవీకేతో జత కట్టే ప్రయత్నాలలో ఉన్నట్టు ప్రచారం ఊపందుకోవడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement