తిరుత్తణి: పది పబ్లిక్ పరీక్షలకు భయపడి ఓ బాలుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పది పబ్లిక్ పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. తిరుత్తణి పరీక్ష కేంద్రంలో పరీక్షలు రాసి ఇంటికి వెళ్లిన విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన విషాదాన్ని మిగిల్చింది. తిరుత్తణిలోని సువాల్‌పేట భారతియార్ వీధికి చెందిన అరవిందన్ కుమారుడు గణేష్(15) డాక్టర్ రాధాకృష్ణన్ ప్రభుత్వ బాలుర మహోన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. పది పబ్లిక్ పరీక్షలు బుధవారం మొదలయ్యాయి. గణేష్ పరీక్షకు హాజరై పరీక్ష రాసి మధ్యాహ్నం ఇంటికి వెళ్లాడు. సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఇంట్లోని ఓ గదిలో చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడం చూసి తల్లిదండ్రులు దిగ్భ్రాంతి చెందారు. విషయం తెలిసి అక్కడికి వెళ్లి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల విచారణలో పరీక్షల భయంతో ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది.


