మాదక ద్రవ్యాల నిర్మూలనకు కృషి
మాదక ద్రవ్యాల నిర్మూలన సమష్టి బాధ్యతని సీఎం స్టాలిన్ వ్యాఖ్యానించారు. సమాజం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో వ్యవహరించినప్పుడే పూర్తిగా
అరికట్టగలమన్నారు. హార్బర్‌ల ద్వారానే ఈ మాదక ద్రవ్యాలు రాష్ట్రంలోకి ప్రవేశిస్తున్నట్టు ఆరోపించారు.
– సాక్షి, చైన్నె
మాదకద్రవ్యాల నియంత్రణ, మత రాజకీయాలకు చెక్ పెట్టడం లక్ష్యంగా, సమష్టి సామరస్యంతో అడుగులు వేద్దామన్న నినాదంతో ఎండీఎంకే నేత వైగో తిరుచ్చి నుంచి మదురైకు సమానత్వ పాదయాత్ర చేపట్టారు. ఈ యాత్ర తిరుచ్చిలో ప్రారంభమైంది. దీనిని సీఎం స్టాలిన్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ యాత్రకు డీఎంకే కూటమి పార్టీల నేతలందరూ హాజరయ్యారు. అయితే, ఒక్క కాంగ్రెస్ తరఫున ప్రతినిధులు ఎవ్వరూ రాకపోవడం చర్చకు దారి తీసింది. ఈ యాత్ర సందర్భంగా జరిగిన బహిరంగ సభలో సీఎం స్టాలిన్ మాట్లాడుతూ తన ప్రజా జీవితంలో తమిళనాడులో వైగో పాదం మోపని ప్రదేశం అంటూ లేదని ప్రశంసలతో ముంచెత్తారు. 82 ఏళ్ల వయస్సులోనూ 28 ఏళ్ల యువకుడిగా చలాకీగా కనిపిస్తుంటారని వ్యాఖ్యానించారు. యువత ఆయన్ను ఆదర్శంగా తీసుకోవాలని, సమానత్వం వైపుగా అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. కలైంజ్ఞర్ కరుణానిఽధితో వైగోకు ప్రత్యేక అనుబంధం ఉండేదని గుర్తు చేశారు. తాజాగా యువ సైన్యంతో ఆయన సమానత్వ యాత్రకు శ్రీకారం చుట్టడం ఆహ్వానిస్తున్నామని, అదే సమయంలో ఆయన తన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు.
మాదక ద్రవ్యాల నియంత్రణ లక్ష్యం
మాదకద్రవ్యాల నిర్మూలన, కుల, మత ఘర్షణల నియంత్రణ గురించి దేశానికి అవసరమైన ఆలోచలనలను అందించే విధంగా వైగో ఈ సమానత్వ ఉద్యమాన్ని చేపట్టారని వ్యాఖ్యానించారు. ఈ యాత్ర కోట్లాది మందికి ప్రయోజనకరం కావాలని పిలుపునిచ్చారు. ద్రవిడ ఉద్యమంలో తమిళనాడు కోసం , తమిళుల కోసం – వారి హక్కుల కోసం, పార్లమెంట్ వేదికగా వైగో గర్జించి ఉన్నారని గుర్తుచేశారు. యువత భవిష్యత్తును నాశనం చేస్తున్న మాదకద్రవ్యాలను పూర్తిగా నిర్మూలించాల్సిన అవశ్యం ఉందన్నారు. మాదకద్రవ్యాల నెట్ వర్క్ చాలా పెద్దదని, దీనిని రాష్ట్ర ప్రభుత్వాలు మట్టుబెట్టడం కష్టతరంగా పేర్కొన్నారు. ఈ నెట్‌వర్క్‌ను కట్టడి చేయాలంటే కేంద్రం కీలకంగా వ్యవహరించాల్సిన అవశ్యం ఉందన్నారు. రాష్ట్రంలోకి ప్రవేశించే మాదకద్రవ్యాలను పెద్ద ఎత్తున పట్టుకుంటూ వస్తున్నామని ఈసందర్భంగా వివరించారు. తమిళనాడు ప్రభుత్వ విభాగాలు, కేంద్ర ప్రభుత్వ విభాగాలతోపాటు పొరుగు రాష్ట్ర పోలీసు విభాగాలకు పూర్తి సహకారం అందిస్తున్నదని, సమష్టిగా పనిచేయడానికి సిద్ధంగా ఉందన్నారు.
సమష్టి బాధ్యత
మాదకద్రవ్యాల నిర్మూలన సమాజ సమష్టి బాధ్యత అని పేర్కొన్నారు. ప్రధానంగా కళా రంగానికి చెందిన వ్యక్తులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. విభజన శక్తులు, మతతత్వ వాదుల పుణ్యమాని అన్నదమ్ముళ్ల మధ్య నేడు శతృవ్వం నెలకొనే పరిస్థితులు బయలు దేరాయని, అల్లర్లు సృష్టిస్తున్నారని ధ్వజమెత్తారు. ఎండీఎంకే నేత వైగో మాట్లాడుతూ, డీఎంకే స్వర్ణ యుగం పాలన కొనసాగాలని, సాగుతుందని వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ చర్చ
ఇదిలా ఉండగా ఈ యాత్రకు డీఎంకే కూటమిలోని కాంగ్రెస్ నేతలు ఎవ్వరూ హాజరు కాకపోవడం చర్చకు దారి తీసింది. వైగో తన యాత్రలో ఎల్‌టీటీ నేత ప్రభాకరన్ చిత్ర పటంతో ముందుకు సాగడంతోనే ఈ యాత్రకు కాంగ్రెస్ దూరంగా ఉన్నట్టు ఓ చర్చ ఊపందుకుంది. అదే సమయంలో డీఎంకే కూటమికి దూరంగా, టీవీకేకు దగ్గరయ్యే దిశగా కాంగ్రెస్ చేస్తున్న ప్రయత్నాలకు ఇది మరింత బలాన్ని చేకూర్చుతున్నట్టు రాజకీయవర్గాలు పేర్కొంటున్నాయి.
మాదక ద్రవ్యాల నిర్మూలనకు కృషి


