మార్మోగిన శివనామ స్మరణ
సాక్షి, చైన్నె: చిదంబరం నటరాజస్వామి ఆలయ పరిసరాలు శుక్రవారం శివనామస్మరణతో మార్మోగాయి. రథోత్సవ వైభవం కనులపండువగా జరిగింది. వేలాదిగా భక్తులు తరలి రావడంతో ఆధ్యాత్మిక వాతావరణంలో చిదంబరం మునిగింది. కడలూరు జిల్లా చిదంబరంలో నటరాజస్వామి ఆలయం కొలువై ఉన్న విషయం తెలిసిందే. పంచభూతాలలో ఆకాశ స్థలంగా ఈ ఆలయం ప్రసిద్ధి చెందింది. ఇక్కడ మార్గళి మాసంలో ఆరుద్ర దర్శనం మహోత్సవాలు జరుగుతాయి. ఈ ఏడాది ఉత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాల్లో అత్యంత ముఖ్య ఘట్టంగా రథోత్సవాన్ని కూడా భావిస్తుంటారు. దీంతో శుక్రవారం వేకువజాము నుంచి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. శివగామసుందరీ సమేత నటరాజస్వామి వారికి ప్రత్యేక అలంకరణలు చేశారు. దీపారాధనల అనంతరం రథం మండపం వద్దకు స్వామి, అమ్మవార్లను తీసుకొచ్చారు. ఉదయం ఆరున్నర గంటలకు శివగామ సుందరి సమేత నటరాజస్వామి రథంపై ఆశీనులయ్యారు. ముందుగా వినాయకుడు ఓ రథంపై ఆశీనుడు కాగా, భక్తులు ఆ రథాన్ని లాగుతూ కదిలారు. స్వామివార్ల రథాన్ని మరో రథంపై ఆశీనులై సుబ్రహ్మణ్యస్వామి, అంబాల్, చండికేశ్వరర్ స్వామి అనుసరించారు. వేలాది మంది భక్తులు శివనామస్మరణ నడుమ రథోత్సవం కనుల పండువగా జరిగింది. పెద్ద ఎత్తున భక్తులు శివ, పార్వతుల వేషధారణలతో రథం ముందు నడుస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ ఉత్సవాలలో అత్యంత ముఖ్య ఘట్టం ఆరుద్ర దర్శనం శనివారం సాయంత్రం జరగనుంది. ఈ దర్శనం కోసం పెద్ద ఎత్తున భక్తులు చిదంబరానికి పోటెత్తుతున్నారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పకడ్బందీగా పోలీసు యంత్రాంగం చర్యలు తీసుకుంది. అలాగే, కన్యాకుమారి జిల్లా సుచీంద్రంలోని తనుమలయన్‌స్వామి ఆలయ రథోత్సవం సైతం అత్యంత వేడుకగా జరిగింది. మంత్రులు మనోతంగరాజ్, శేఖర్‌బాబు, ఎంపీ విజయ్ వసంత్‌కుమార్ రథోత్సవానికి హజరయ్యారు.
మార్మోగిన శివనామ స్మరణ


