క్లుప్తంగా
భార్యను చంపిన భర్తకు జీవిత ఖైదు
తిరువొత్తియూరు: చైన్నె కన్నగి నగర్‌లో నివసిస్తున్న ఆరుముగం (61) పెరుంగుడి ప్రాంతంలోని అపార్ట్‌మెంట్‌లో వాచ్‌మన్‌గా చేస్తున్నాడు. ఇతనికి కస్తూరి అనే భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. అందరూ అదే ప్రాంతంలో దగ్గర దగ్గరగా నివసిస్తున్నారు. ఆరుముగం తన భార్య ప్రవర్తనపై అనుమానంతో తరచూ భార్య కస్తూరితో గొడవపడేవాడు. ఈ క్రమంలో గత 24.12.2021న ఆరుముగంకు, కస్తూరికి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆ రోజు ఆరుముగం కొడుకు, కూతురు ఇంట్లో లేరు, ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్న ఆరుముగం, గది తలుపులు మూసివేసి భార్య కస్తూరిని కొడవలితో విచక్షణారహితంగా నరికి చంపాడు. దీనిని ప్రత్యక్షంగా చూసిన ఆరుముగం మనవడు, మనవరాలు తండ్రి వెంకటేష్‌కు తెలిపారు. వెంకటేష్, కన్నగి నగర్ పోలీస్ స్టేషన్‌లో ఆరుముగం చేసిన హత్యపై ఫిర్యాదు చేశాడు. పోలీసులు పరారీలో ఉన్న ఆరుముగంను అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఈ కేసు విచారణ కొనసాగుతుండగా మంగళవారం చెంగుల్పట్టు మహిళా కోర్టు న్యాయమూర్తి ఎళిల్ అరసి సమక్షంలో తుది విచారణకు వచ్చింది. ఈ కేసును విచారించిన న్యాయమూర్తి ఎళిల్ అరసి, నిందితుడు ఆరుముగం నేరం చేసినట్లు నిర్ధారణ కావడంతో ఆరుముగంకు యావజ్జీవ శిక్ష, 3 వేలు రూపాయలు జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. ఈ కేసును ప్రభుత్వ తరపు న్యాయవాది శశికళ లోకనాథన్ వాదించారు.
వైభవంగా రామచరిత
మానస్ పారాయణం
కొరుక్కుపేట: చైన్నె గోపాలపురంలోని శ్రీ గీతా భవన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో లోక క్షేమాన్ని కాంక్షిస్తూ 24వ వార్షిక శ్రీ రామచరితమానస్ అఖండ పారాయణం వైభవంగా ఆరంభమైంది. బుధవారం ఉదయం ప్రారంభమైన ఈ కార్యక్రమం గురువారం మధ్యాహ్నం వరకు 24 గంటల పాటు పారాయణం సాగనుంది. ముందుగా శ్రీ సీతారామ లక్ష్మీణులను, ఆంజనేయ స్వామి వార్లను విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలను చేపట్టారు. శ్రీ గీతాభవన్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ మను గోయల్ అధ్యక్షతన స్తపన పూజలను చేపట్టారు. కార్యక్రమంలో ట్రస్ట్ కోశాధికారి మురళీలాల్ సాంతాలియా, ట్రస్టీలు కె.కె. గుప్తా, ఎం ఎల్ భగారియా, విశాల్ అగర్వాల్, మహిళలు పెద్దసంఖ్యలో పాల్గొని సీతారాముల కృపకుపాత్రులయ్యారు. అనంతరం శ్రీరామచరితమానస్ అఖండ పారాయణం ఆరంభించారు. జనవరి 1 వ తేదీన గురువారం కొత్త సంవత్సర హరతి, భజనలు, కీర్తనలు, ముగింపు హారతి, మహా ప్రసాద వినిమయంతో కార్యక్రమం ముగియనుంది. 2026 నూతనసంవత్సరం అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు.
మహిళ బ్యాంకు ఖాతాలో రూ. 35 లక్షలు దోపిడీ
అన్నానగర్: కృష్ణగిరి సమీపంలోని అలప్పట్టి ప్రాంతంలో నివసిస్తున్న సామ్యూల్ ఓ ప్రైవేట్ సంస్థలో బ్రాంచ్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. 11.7.24న జరిగిన ప్రమాదంలో సామ్యూల్ తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చేరాడు. చికిత్స లేకుండా 17.7.2024న మరణించాడు. దీనికి సంబంధించిన రూ. 35 లక్షల బీమా డబ్బు గత సంవత్సరం సామ్యూల్ భార్య సత్య బ్యాంకు ఖాతాకు వచ్చింది. ఈ స్థితిలో, సత్య కొన్ని రోజుల క్రితం బ్యాంకు ఖాతా చూసినప్పుడు, 35 లక్షల రూపాయలు పోయాయని తెలిసి దిగ్భ్రాంతి చెందింది. దీని గురించి సత్య ఆరా తీసినప్పుడు, శామ్యూల్ అన్న వేలన్ తన భార్య అరుణ బ్యాంకు ఖాతాకు 35 లక్షల రూపాయలు విచిత్రమైన రీతిలో బదిలీ చేసినట్లు తెలిసింది. దీని గురించి సత్య శుక్రవారం కృష్ణగిరి జిల్లా పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అందులో, సామ్యూల్ అన్న వేలన్, ఇతని భార్య అరుణ, అక్క, కృష్ణమూర్తి సహా నలుగురు వ్యక్తులు కలిసి డబ్బును మార్చారని తేలింది. దీని తర్వాత పోలీసులు వేలన్‌ను శనివారం అరెస్టు చేశారు. పరారీలో ఉన్న అరుణ, వేలన్ సోదరి, కృష్ణమూర్తి కోసం వెతుకుతున్నారు. వేలన్ సత్య బ్యాంకు ఖాతా నుంచి తన భార్య బ్యాంకు ఖాతాకు డబ్బును ఎలా బదిలీ చేశాడో తెలుసుకోవడానికి దర్యాప్తు చేస్తున్నారు.
విద్యుత్ షాక్‌తో 8వ తరగతి విద్యార్థి మృతి
తిరువొత్తియూరు: చైన్నె వలసరవాక్కం, కామరాజ్ అవెన్యూ ప్రాంతానికి చెందిన జ్యోతిరాజ్. అతని కుమారుడు వీరకుమార్ (15). మధురవాయల్ సమీపంలోని ఆళపాక్కం ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. వీరకుమార్‌కు స్కూల్ సెలవు కావడంతో ఎప్పటిలాగే మంగళవారం మధ్యాహ్నం అదే ప్రాంతంలోని ఏకేఆర్ నగర్‌లో ఉన్న స్నేహితుడి ఇంటికి ఆడుకోవడానికి వెళ్లాడు. అనంతరం స్నేహితులిద్దరూ 2వ అంతస్తులో నిలబడి ఆడుకుంటున్నారు. అప్పుడు, వీరకుమార్ చేయి అనుకోకుండా రైలింగ్ గోడ దగ్గరగా ఉన్న విద్యుత్ వైర్‌కు తగిలింది. దీంతో విద్యుత్ షాక్‌తో మృతి చెందాడు. వలసరవాక్కం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


