ఆసక్తికర కథతో మురుగదాస్ చిత్రం
తమిళసినిమా: అజిత్, విజయకాంత్, సూర్య, అమీర్‌ఖాన్, విజయ్, రజనీకాంత్, శివకార్తికేయన్ వంటి స్టార్ హీరోలతో చిత్రాలు చేసిన దర్శకుడు ఏఆర్ మురుగదాస్. ఇటీవల ఈయన దర్శకత్వం వహించిన చిత్రాలు ఆశించినట్లుగా ప్రేక్షకులను అలరించలేకపోతున్నాయనే చెప్పాలి. ముఖ్యంగా రజనీకాంత్ హీరోగా ఏఆర్ మురుగదాస్ తెరకెక్కించిన దర్బార్ చిత్రం పూర్తిగా నిరాశపరచింది. అదేవిధంగా హిందీలో సల్మాన్‌ఖాన్ కథానాయకుడిగా రూపొందించిన చిత్రం అపజయం పాలైంది. ఆ తరువాత కొంచెం గ్యాప్ తరువాత శివకార్తీకేయన్ హీరోగా చేసిన మదరాసీ చిత్రం కూడా ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. దీంతో ఏఆర్ మురుగదాస్ తదుపరి చిత్రం ఏమిటన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఒక స్టార్ హీరో నటించే చిత్రానికి దర్శకత్వం వహించనున్నట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. అయితే ఈసారి ఆయన స్టార్ హీరోలతో కాకుండా ఒక వానరాన్ని నమ్ముకున్నారు. నిజమే ఓ వానరాన్ని ప్రధాన పాత్రలో నటింపజేయడానికి సన్నాహాలు చేస్తున్నారట. దీని గురించి ఆయన ఇటీవల ఒక భేటీలో పేర్కొంటూ తన తదుపరి చిత్రంలో ఒక కోతిని ప్రధాన పాత్రలో నటింపజేయనున్నట్లు చెప్పారు. ఆ కోతిని గ్రాఫిక్స్‌లో రూపొందించనున్నట్లు తెలిపారు. తాను సహాయ దర్శకుడిగా పని చేస్తున్న సమయంలోనే ఈ కథతో చిత్రం చేయాలని భావించానని, ఇది బాలల ఇతి వృత్తంతో రూపొందే కథా చిత్రంగా ఉంటుందని చెప్పారు. ఇలా గ్రాఫిక్స్ కథా చిత్రంతో తను మరో రౌండ్ రావాలని ఏఆర్.మురుగదాస్ భావిస్తున్నట్లుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన అధికారిక ప్రకటన వెలువడాల్సిఉందన్నది గమనార్హం.


