తిరుత్తణిలో వేడుకగా మెట్లోత్సవం
తిరుత్తణి: తిరుత్తణి సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో మెట్లోత్సవం సందర్భంగా బుధవారం సందడి నెలకొంది. భారీ సంఖ్యలో భక్తులు మెట్లోత్సవంలో పాల్గొని స్వామి దర్శనం చేసుకున్నారు. సుబ్రహ్మణ్యస్వామి ఆరు పుణ్యక్షేత్రాల్లో ఐదవ క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన తిరుత్తణి సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో ఏడాదికి గుర్తుగా 365 మెట్లు ఉండడం ప్రసిద్ధి. ఈ ఆలయంలో ఏటా డిసెంబర్ 31న మెట్లోత్సవం వైభవంగా నిర్వహించడం పరిపాటి. మొట్లోత్సవం సందర్భంగా వేకువజామున మూలవర్లకు విశేష అభిషేక పూజలు నిర్వహించారు. ఉదయం 9 గంటలకు ఆలయ శరవణపొయ్‌గై పుష్కరణి సమీపంలోని తొలిమెట్టుకు పుష్పాలతో సర్వాంగసుందరంగా అలంకరించారు. తిరుత్తణి ఆలయ అధికారులు, భక్తుల సమక్షంలో దీప ప్రజ్వలన చేసి మెట్లోత్సవం ప్రారంభించారు. దీంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి విచ్చేసిన భక్తులు, మహిళలు, బజన బృందాలు 365 మొట్లకు పసుకు కుంకుమ దిద్ది కొబ్బరికాయలు కొట్టి భక్తజన బృందాలు మురుగన్ ఆధ్మాత్మిక పాటలు పాడుతూ కొండకు చేరుకుని స్వామి దర్శనం చేసుకున్నారు. ఉదయం 11 గంటలకు ఉత్సవర్లు వెండి నెమలి వాహనంలో కొలువుదీరి భక్తులకు కనువిందు చేశారు. ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా కొండ ఆలయం పరిసర ప్రాంతాలు విద్యుదీపాలతో సర్వాంగసుందరంగా అలంకరించారు. అర్ధరాత్రి 12.01 గంటలకు ఆంగ్ల నూతన సంవత్సరం ప్రారంభం సందర్భంగా స్వామికి నిర్వహించే ప్రత్యేక అభిషేక పూజల్లో పాల్గొని స్వామి తొలి దర్శనం కోసం రాత్రి 10 గంటలకే కొండ ఆలయంలో భక్తులు పోటెత్తి చలిని సైతం లెక్కచేయకుండా మాడ వీధుల్లో వేచివుండి రత్రంతా స్వామి దర్శనం చేసుకున్నారు. భక్తుల సౌకర్యార్థ్యం ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లు చేపట్టగా.. డీఎస్పీ కందన్ ఆధ్వర్యంలో 100 మంది పోలీసులు బందోబస్తు చేపట్టారు.
తిరుత్తణిలో వేడుకగా మెట్లోత్సవం


