బర్డ్ ఫ్లూ భయం!
సేలం: రాష్ట్రంలోకి బర్డ్ ఫ్లూ ఎక్కడ ప్రవేశిస్తుందో అన్న ఆందోళన ఫౌల్ట్రీ యజమానుల్లో నెలకొంది. కేరళలో ఈ ఫ్లూ బయట పడటంతో తమిళనాడులోకి ప్రవేశించకుండా ముందు జాగ్రత్తల్లో అధికార వర్గాలు నిమగ్నం అయ్యాయి. రెండు రాష్ట్రాల సరిహద్దుల్లో వైద్య బృందాలు తిష్ట వేశాయి. కేరళ నుంచి వచ్చే వాహనాలకు క్రిమి సంహారక మందులను స్ప్రే చేసినానంతరం అనుమతిస్తున్నారు. వివరాలు.. కేరళలో లోకి బర్డ్‌ఫ్లూ ప్రవేశించినట్టుగా రెండు రోజులుగా ప్రచారం జరుగుతూ వస్తున్నది. తాజాగా ఈ బర్డ్ ఫ్లూను గుర్తించినట్టు అక్కడి అధికారుల నుంచి సమాచారాలు రావడంతో రాష్ట్రంలోని కోళ్ల పరిశ్రమల యాజమానాల్ల్లో ఆందోళన బయలుదేరింది. రాష్ట్రంలో అక్కడక్కడ కోళ్ల ఫారాలు ఉన్నా, పెద్ద ఎత్తున మాత్రం నామక్కల్ జిల్లాలోనే ఉన్నాయి. ఇక్కడ వెయ్యికిపైగా ఫౌల్ట్రీల్లో రోజుకు మూడు నుంచి నాలుగు కోట్లకు పైగా గుడ్డు, నాలుగు నుంచి ఐదు కోట్లకు పైగా కోళ్ల ఉత్పత్తి జరుగుతోంది. ఇక్కడి నుంచే రాష్ట్రం, పొరుగున ఉన్న కేరళతో పాటూ ఇతర రాష్ట్రాలకు గుడ్లు, మాంసం కోళ్లు సైతం సరఫరా అవుతోండటంతో ఫౌల్ట్రీ యజమానులు భయాందోళన చెందుతున్నారు.
అప్రమత్తం..
కేరళలోకి బర్డ్ ఫ్లూ సమాచారంతో ఎక్కడ రాష్ట్రంలో కూడా ఆ వైరస్ ప్రవేశిస్తుందో అన్న ఆందోళన బయలు దేరింది. కోళ్ల మీద ప్రభావం ఏ మేరకు ఉంటుందో అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. తమ కోళ్లను రక్షించుకునేందుకు ముందు జాగ్రత్త చర్యగా ఫౌల్ట్రీల పరిసరాల్లో వ్యాధి నిరోధక క్రిమి సంహాకరక మందుల్ని స్ప్రే చేసే పనిలో పడ్డారు. ఇక, కేరళలోకి గుడ్లు, కోళ్ల సరఫరా ఆగిన పక్షంలో నష్టాలు ఏమేరకు చవి చూడాల్సి వస్తుందో అన్న బెంగ సైతం యజామానుల్లో నెలకొంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. బర్డ్ ఫ్లూ రాష్ట్రంలోకి ప్రవేశించకుండా తగిన ముందస్తు జాగ్రత్తలపై దృష్టి పెట్టారు. దీంతో పశుసంవర్ధక శాఖ వర్గాలు రంగంలోకి దిగారు. ఫౌల్ట్రీల పరిసరాలలో ఆరోగ్య పరమైన జాగ్రత్తలు విస్తృతం చశారు. క్రిమి సంహారక మందులను పిచికారి చేయించే పనిలో ఫౌల్ట్రీ యజమానులు ఉన్నాయి.
సరిహద్దులలో..
కేరళ నుంచి తమిళనాడు వైపుగా వచ్చే అన్ని వాహనాలపై క్రిమి సంహారక మందుల్ని స్ప్రే చేసేందుకు చర్యలు చేపట్టారు. కేరళ నుంచి కన్యాకుమారి , సెంగోట్టై, తేని, కోయంబత్తూరు, నీలగిరి వైపులుగా ఉన్న అన్ని మార్గాల్లో వైద్య బృందాలు తిష్ట వేశాయి. క్రిమి సంహారక మందులను వాహనాలపై స్ప్రే చేయడమే లక్ష్యంగా ప్రత్యేక బృందాలు ఉరకలు తీస్తున్నాయి. ప్రత్యేకంగా చెక్ పోస్టులు కూడా అనేక చోట్ల ఏర్పాటు చేశారు. నీలగిరి జిల్లాలో కేరళ వైపుగా ఉన్న ఏడు మార్గాలలలో పశు సంవర్థకశాఖ అధికారులు, వైద్యులు తిష్ట వేశారు. కేరళ నుంచి వచ్చే వాహనాలపై క్రిమి సంహారక మందులు చల్లడమే కాకుండా, అన్ని వాహనాలను తనిఖీలు చేస్తున్నారు. కేరళ నుంచి రాష్ట్రంలోకి కోళ్లు, వాటికి అవసరమయ్యే ధానా సరఫరా వాహనాలను అడ్డుకునేందుకు తగ్గ చర్యలు తీసుకన్నారు. ఇక కోళ్ల పరిశ్రమల్లో నిపుణుల ద్వారా పరిశోధనలు సాగించేందుకు సిద్దమయ్యారు. రాష్ట్రంలో ఎలాంటి బర్డ్ ఫ్లూ లక్షణాలు బయట పడ లేదని, ఆందోళన వద్దని భరోసా ఇచ్చే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.
బర్డ్ ఫ్లూ భయం!


