విజయ్ వైపు.. ఆ ఇద్దరి చూపు
సాక్షి, చైన్నె: టీవీకే నేత విజయ్ వైపుగా మాజీ సీఎం పన్నీరు సెల్వం, అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం నేత టీటీవీ దినకరన్ దృష్టి పెట్టినట్టు సంకేతాలు వెలువడ్డాయి. బీజేపీకి దూరంగా ఈ సారి ఎన్నికలలో నిలబడే దిశగా ఈ రెండు శిబిరాలు మరికొద్ది రోజులలో నిర్ణయాన్ని ప్రకటించబోతున్నట్టు రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. తమిళగ వెట్రి కళగం(టీవీకే) అధికారంలోకి వస్తే మిత్రులకు అధికారంలో వాటా అని ఇప్పటికే విజయ్ ప్రకటించిన విషయం తెలిసిందే. విజయ్‌కు పక్క బలంగా ఉండే రీతిలో అన్నాడీఎంకేలో కీలకంగా ఉన్న సెంగొట్టయ్యన్ టీవీకేలో చేరారు. ఆయన అన్నాడీఎంకే అసంతృప్తి నేతలందర్నీ ఏకంచేస్తూ వస్తున్నారు. అందర్నీ విజయ్‌వైపుగా తీసుకొచ్చే దిశగా వ్యూహాలకు పదును పెట్టారు. ఇందుకు అనుగుణంగా గురువారం సెంగొట్టయ్యన్ వ్యాఖ్యలు చేశారు. చూస్తూ ఉండండీ త్వరలో అన్నాడీఎంకేలో ఉన్న ముఖ్యలందరూ విజయ్ పక్షాన ఉంటారన్నారు.
బీజేపీకి ఝలక్
లోక్‌సభ ఎన్నికలలో మాజీ సీఎం పన్నీరు సెల్వం శిబిరం, అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం నేత టీటీవీ దినకరన్‌లు బీజేపీ ఎన్‌డీఏ కూటమితో కలిసి పయనించారు. ఎన్నికల అనంతరం వారిని బీజేపీ వర్గాలు పట్టించుకోలేదు. దీంతో ఎన్‌డీఏ నుంచి బయటకు వచ్చేశారు. అన్నాడీఎంకేలో అందరూ ఏకం కావాలన్న నినాదాన్ని అందుకున్నా, బీజేపీ వర్గాలు ఆ దిశగా ప్రయత్నాలు చేయలేదు. తాజాగా మళ్లీ వీరిపై బీజేపీ దృష్టి పెట్టింది. ఏకం అన్నది పక్కన పెట్టి, వీరి మద్దతును ఎన్‌డీఏ కూటమి ద్వారా తీసుకునేందుకు సిద్ధమయ్యారు. చైన్నెలో బీజేపీ త్రిమూర్తుల భేటీలో సైతం ఇదే నిర్ణయాన్ని తీసుకున్నట్టు సమాచారాలు వెలువడ్డాయి. అయితే ఈసారి పన్నీరు, దినకరన్‌లు బీజేపీకి ఝలక్ ఇవ్వబోతున్నట్టు తాజాగా సంకేతాలు వెలువడ్డాయి. విజయ్‌తో పొత్తు దిశగా వీరు ప్రయత్నాలు మొదలెట్టి ఉన్నారు. ఇందుకు అద్దం పట్టే విధంగా తన మద్దతుదారుల సమావేశంలో పన్నీరు తీర్మానించినట్టు తాజాగా సంకేతాలు వెలువడటం గమనార్హం. టీటీవీ దినకరన్ సైతం విజయ్‌ను పొగడ్తలో ముంచెత్తే వ్యాఖ్యలు చేస్తుండడం బట్టి చూస్తే, సెంగొట్టయ్యన్ వ్యాఖ్యలకు మరింత బలాన్ని చేకూర్చే విధంగా పరిస్థితులు మారుతున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి.


