మళ్లీ నిర్మాతగా ధనుష్
తమిళసినిమా: బహుభాషా కథానాయకుడు, దర్శకుడు, నిర్మాత, కథకుడు, గాయకుడు అంటూ పలు ముఖాలు కలిగిన నటుడు ధనుష్. ఈయన ఇంతకుముందు పలు విజయవంతమైన చిత్రాలు నిర్మించిన విషయం తెలిసిందే. చివరగా నెలకు ఎన్ మేల్ ఎన్నడీ కోపం చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. ఆ చిత్రం ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకపోవడంతో ధనుష్ చిత్రం నిర్మాణాన్ని నిలిపేస్తున్నట్లు ప్రచారం జరిగింది. అయితే తాజాగా మరోసారి ఈయన హీరోగా నటిస్తూ చిత్రాన్ని నిర్మించడానికి తెలిసింది. తను ప్రస్తుతం తన 54వ చిత్రం షూటింగు పూర్తి చేశారు. దీంతో 55వ చిత్రంలో నటించడానికి సిద్ధమయ్యారు. ఈచిత్రానికి అమరన్ చిత్రం ఫేమ్ రాజ్‌కుమార్ పెరియస్వామి దర్శకత్వం వహిస్తున్నారు. దీన్ని ప్రముఖ ఫైనాన్షియర్, డిస్ట్రిబ్యూటర్, నిర్మాత అన్బుచెళియన్ తన గోపురం ఫిలిమ్స్ పతాకంపై నిర్మించడానికి సన్నాహాలు చేశారు. ఇతనికి సంబంధించిన పూజాకార్యక్రమాలను కూడా నిర్వహించారు. అలాంటిది ఆయన ఈ చిత్రం నిర్మాణం నుంచి వైదొలగినట్లు తాజా సమాచారం. దీంతో చిత్ర కథ నచ్చడంతో ధనుష్ ఈ చిత్ర నిర్మాణాన్ని చేపట్టినట్లు తెలిసింది .అందుకని ఇప్పటివరకు ఈ చిత్రానికి ఖర్చు చేసిన రూ.30 కోట్లను అన్బుచెళియన్‌కు చెల్లించినట్లు ప్రచారం జరుగుతోంది. కాగా ఈయన కథానాయకుడిగా నటిస్తూ రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో నటించనున్న చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది.


