రోగులను ఆప్యాయంగా పలకరించాలి
వేలూరు: నర్సింగ్ విద్యార్థినులు రోగుల పట్ల ప్రేమతో నడుచుకోవాలని సినీ నటుడు మిర్చి శివ అన్నారు. వేలూరు శ్రీపురంలోని నారాయణి నర్సింగ్ కళాశాలలో బీఎస్సీ నర్సింగ్ 20వ వార్షిక సంవత్సరంతో పాటు మొదటి సంవత్సరం విద్యార్థినులను జ్యోతి ప్రజ్వలన చేసి స్వాగతం పలికే కార్యక్రమం కళాశాల డైరెక్టర్ బాలాజీ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనేక సేవా కార్యక్రమాలున్నప్పటికీ నర్సులు చేసే సేవ మరవరాదన్నారు. రోగులు తీవ్ర ఇబ్బందులతో ఆసుపత్రికి వస్తుంటారని వారిని ప్రేమతో పలకరించడంతోనే రోగులకు సగం రోగం నయమవుంతుందన్నారు. ప్రస్తుతం 40 మంది నర్సింగ్ విద్యార్థినిలు కొత్తగా చేరారని వారందరూ పేద కుటుంబాల నుంచి వచ్చిన వారే కావడంతో విద్యను పూర్తి చేసి విధుల్లో ఉండే సమయంలో రోగులకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే చదవాలన్నారు. డబ్బే ప్రదానంగా పనిచేయకుండా రోగులకు ఎంత సేవ చేశామని ఆత్మ విమర్శ చేసుకోవాలన్నారు. నాలుగు సంవత్సరాలు పాటూ చదివే నర్సింగ్ విద్యలో క్రమ శిక్షణతో విద్యను పూర్తి చేయాలన్నారు. ప్రతి విద్యార్థికి జీవితంలో లక్ష్యం ఉండాలని దాన్ని పట్టుదలతో సాధించేందుకు ప్రయత్నం చేయాలన్నారు. అనంతరం విద్యార్థినులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో వేలూరు ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ రోహణిదేవి, నారాయణి నర్సింగ్ కళాశాల సూపరింటెండెంట్ గీత, మాజీ ఎమ్మెల్యే కలైఅరసన్, ప్రిన్సిపల్ ప్రభ, ఫ్రొఫెసర్‌లు, విద్యార్థినులు పాల్గొన్నారు.


