చెక్కు చెదరని బ్రిటీష్ కళాతృష్ణ
సాక్షి,చైన్నె: బ్రిటీష్ పాలకులు భారతదేశాన్ని విడిచి పెట్టే నాటికి ఇక్కడ జ్ఞాపికగా వదలి వెళ్లిన సుందర భవనాలలో విక్టోరియా హాల్ కూడా ఒకటి. చైన్నె సెంట్రల్‌కు సమీపంలో గంభీరంగా కనిపించే ఈ పురాతన భవనాన్ని బ్రిటీషు కళాతృష్ణ చెక్కు చెదరని విధంగా పునరుద్ధరించారు. రూ. 32 కోట్లతో బ్రహ్మాండంగా రూపుదిద్దుకున్న ఈ భవనాన్ని మంగళవారం రాత్రి సీఎం ఎంకే స్టాలిన్ ప్రారంభించి, చైన్నె వాసులకు అంకితం ఇచ్చారు. వివరాలు.. చైన్నెలోని బ్రిటీష్ వారి చారిత్రాత్మక నిర్మాణాల్లో విక్టోరియా పబ్లిక్ హాల్ ఒకటి. విక్టోరియా మహారాణి గోల్డన్ జూబ్లీ సంవత్సర జ్ఞాపకార్థం దీనిని నిర్మించారు. బ్రిటీష్ వారి అధ్బుత ఆర్కిటెక్చర్‌కు ఈ నిర్మాణం ఒక తార్కాణం. 19వ శతాబం చివరిలో, 20వ శతాబ్ది ఆరంభ కాలంలో ఈ హాల్‌ను థియేటర్‌గా, ప్రజాదర్బార్‌గా వినియోగించేవారు. అప్పట్లో రూ.16,425 నిధులను సమీకరించి ఈ భవన నిర్మాణం జరిగినట్టు 12 మంది సభ్యులతో కూడిన ట్రస్ట్ పర్యవేక్షణా ఏర్పాట్లు చేసినట్టు చెబుతారు. అప్పట్లో ఈ విక్టోరియా హాలు నిర్మాణం పూర్తికావడానికి ఐదేళ్లు పట్టిందని చెబుతారు. రాబర్ట్ ఫెల్లోవ్స్ చిస్లోం అనే వ్యక్తి ఇండో– సరాసెనిక్ ఆర్కిటెక్చర్‌లో ఈ నిర్మాణానికి రూపకల్పన చేశారు. 1887లో లార్డ్ కన్నెమర చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసి ప్రజా వినియోగానికి తీసుకొచ్చారు. అనాటి నగర పౌరుల సమావేశంలో ఈ భవనాన్ని విక్టోరియా హాల్‌గా నామకరణం చేశారు. ఆ తరువాత ఈ హాలు ముఖ్యమైన బహిరంగ, సామాజికి కార్యక్రమాలకు ఒక ప్రధాన వేదికగా మారింది. మహాత్మాగాంధీ, స్వామి వివేకానంద, గోపాలకృష్ణ గోఖలే, సుబ్రహ్మణ్య భారతి, సర్దార్ వల్లభాయ్ పటేల్ వంటి మహామహులు ఈ హాలు జరిగిన కార్యక్రమాల్లో పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగించినట్టు చరిత్ర చెబుతోంది.
నగర నడ్డి బొడ్డన గంభీరంగా..
చైన్నె నగర నడిబొడ్డులో బ్రిటీష్ వారి గాంభీర్యాన్ని చాటుతూ గంభీరంగా ఉండే విక్టోరియా హాల్‌ను పునరుద్ధరించి పూర్వవైభవం తేవాలని గతంలో దివంగత ముఖ్యమంత్రి అన్నాదురై సంకల్పించారు. అయితే అనుకున్నది నెరవేర లేదు. 2010లో హాల్‌ను పునరిద్దరించడం కోసం డీఎంకే దివంగత నేత కరుణానిధి సీఎంగా ఉన్నప్పుడు చర్యలు చేపట్టినా పనులు ముందుకు సాగలేదు. 2021లో డీఎంకే సర్కారు అధికారంలోకి వచ్చినానంతరం విక్టోరియా హాల్‌పై ప్రత్యేక దృష్టి పెట్టింది. మునిసిపల్ కార్పొరేషన్ భవనం రిప్పన్ బిల్డింగ్, సెంట్రల్ రైల్వే స్టేషన్‌కు మధ్యలో పురాతన భవనంగా ఉన్న విక్టోరియా హాల్‌ను రూ. 32 కోట్లను ఖర్చు పెట్టి బ్రిటీషు కళాకృతులు చెక్కు చెదరని రీతిలో పునరుద్దరించారు. పురాతన ఈ భవనం చెక్కు చెదరని రీతిలో మరింత సుందరంగా కొత్త విద్యుత్ హంగులతో దేదీప్యమానంగా అలరారుతున్నది. ఈ బ్రహ్మాండ హాల్‌ను మంగళవారం రాత్రి చైన్నెలో జరిగిన కార్యక్రమంలో సీఎం ఎంకే స్టాలిన్ ప్రారంభించారు. ఇక్కడి ఏర్పాట్లను పరిశీలించారు. పురాతనత చెక్కు చెదరకుండా తీర్చిదిద్దిన ఇంజినీర్లను అభినందించారు.
చెక్కు చెదరని బ్రిటీష్ కళాతృష్ణ


