గంజాయి మత్తులో పిల్లలపై దాడి
తిరువళ్లూరు: వీధిలో ఆడుకుంటున్న బాలుడిపై గంజాయి మత్తులో వున్న యువకుడు దాడి చేశాడు. బిహార్‌కు చెందిన ఓ యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. తిరువళ్లూరు జిల్లా వీఎం నగర్‌కు చెందిన ఆనందరాజ్ రాసాత్తి దంపతులు వుంటున్నారు. వీరికి మోగేష్‌రాజ్(08), కనీష్‌రాజ్(10) ఇద్దరు పిల్లలు. ఈక్రమంలో సోమవారం రాత్రి ఇంటి వద్ద పిల్లలు ఆడుకుంటుండగా అటువైపు వచ్చిన యువకుడు దాడి చేసినట్టు తెలుస్తుంది. పిల్లలు కేకలు పెట్టడంతో స్థానికులు గంజాయి మత్తులో వున్న యువకుడ్ని పట్టుకుని తిరువళ్లూరు టౌన్ పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి వచ్చిన పోలీసులు మత్తులో యువకుడిని అదుపులోకి తీసుకుని కొంత దూరం వెళ్లాక వదిలిపెట్టి వెళ్లిపోయారు. అనంతరం గంట తరువాత మళ్లీ అదే ప్రాంతానికి వచ్చిన యువకుడు పిల్లలపై మళ్లీ దాడి చేయడంతో ఆగ్రహించిన స్థానికులు అతడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. పోలీసులు యువకుడ్ని అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. పోలీసుల విచారణలో యువకుడు గంజాయి మత్తులో వున్నట్టు నిర్ధారించారు. బిహార్‌కు చెందిన రుష్ణకుమార్‌గా గుర్తించి అతడ్ని రిమాండ్‌కు తరలించారు.


