స్టాలిన్‌తో చిదంబరం భేటీ
సాక్షి, చైన్నె: డీఎంకే అధ్యక్షుడు, సీఎం స్టాలిన్‌తో కాంగ్రెస్ సీనియర్ నేత పి చిదంబరం భేటీ అయ్యారు. హఠాత్తుగా చాలాకాలం తర్వాత స్టాలిన్‌ను చిదంబరం కలవడం రాజకీయంగా ప్రాధాన్యతకు దారి తీసింది. ఈ సారి ఎన్నికలలో డీఎంకే నుంచి అధిక సీట్లు రాబట్టే దిశగా కాంగ్రెస్ ప్రయత్నాలు విస్తృతం చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే కాంగ్రెస్ ఏఐసీసీ పెద్దల కమిటీ చైన్నెలో స్టాలిన్‌తో సమావేశమైంది. తాము ఆశిస్తున్న సీట్లు, నియోజకవర్గాల వివరాలతో జాబితాను సమర్పించి వెళ్లింది. అయితే ఈ జాబితా గురించి డీఎంకే పట్టించుకోలేదు. అదే సమయంలో కూటమిలోని ఇతర పార్టీలు సైతం సీట్ల చర్చలు అంటూ క్యూ కట్టే పనిలో పడ్డాయి. దీంతో డీఎంకే నేతృత్వంలో జనవరిలో కమిటీ ఏర్పాటు అవుతుందని, ఈ కమిటీ సీట్ల చర్చలు జరుపుతుందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి దురై మురుగన్ ప్రకటించారు. ఈ పరిణామాల నేపథ్యంలో హఠాత్తుగా స్టాలిన్‌తో చిదంబరం భేటీ కావడం ప్రాధాన్యతకు దారి తీసింది. కొన్నేళ్ల అనంతరం స్టాలిన్‌ను చిదంబరం తాజాగా కలిశారు. ఈ ఇద్దరి మధ్య భేటీలో ఆంతర్యంపై చర్చ ఊపందుకుంది. రాష్ట్రంలో చిదంబరం గ్రూప్ బలం కాంగ్రెస్‌లో ఎక్కువే. ఏఐసీసీ సీట్ల వ్యవహారంలో ఏదేని పేచి పెట్టిన పక్షంలో చిదంబరం ద్వారా ఏదేని కొత్త వ్యూహాలను రచించి అమలు చేయబోతున్నారా? అన్న చర్చ ఊపందుకుంది. గతంలో ఓ మారు కాంగ్రెస్ నుంచి చిదంబరం బయటకు వచ్చి పార్టీని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ దృష్ట్యా, తాజా భేటిపై ఆంతర్యాన్ని కని పెట్టే పనిలో రాజకీయ వర్గాలు ఉన్నాయి.
నియోజకవర్గ నేతలతో..
సోదరా కదిలిరా పేరిట నియోజకవర్గాల వారీగా స్టాలిన్ సమావేశాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఆయా నియోజక వర్గాల నుంచి నేతలను చైన్నెకు పిలిపించి సమావేశం అవుతున్నారు. ఇందులో భాగంగా మంగళవారం నన్నిలం, పూంబుహార్, మైలాడుతురై అసెంబ్లీ నియోజకవర్గాల నేతలతో స్టాలిన్ సమావేశమయ్యారు. ప్రభుత్వ పథకాలు ఏ మేరకు ప్రజలలోకి వెళ్లాయో?, నియోజకవర్గాలలో పార్టీ పరిస్థితి గురించి ఆరా తీశారు. నేతలందరూ సమష్టిగా ప్రయాణించాలని, ఐక్యతతో అభ్యర్థుల గెలుపుకు కృషి చేయాలని ఈసందర్భంగా స్టాలిన్ ఆదేశించారు.
స్టాలిన్‌తో చిదంబరం భేటీ


