ఈసారి రూ. 3 వేలు?
– పొంగల్ కానుక పరిశీలన
సాక్షి, చైన్నె: సంక్రాంతి సందర్భంగా రాష్ట్రంలోని కుటుంబ కార్డు దారులకు పొంగల్ కానుక అందించేందుకు అధికారులు సమర్పించిన నివేదికపై సీఎం స్టాలిన్ పరిశీలన చేస్తున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఈ మేరకు ఈసారి రూ.3 వేలు చొప్పున నగదుతో పాటూ వస్తువుల కిట్ పంపిణీకి చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నట్టు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. వివరాలు.. ఇంటిళ్లి పాది సంక్రాంతిని ప్రజలు ఆనందోత్సాహాలతో జరుపుకోవాలన్న కాంక్షతో ఏటా కుటుంబ రేషన్ కార్డు దారులకు ప్రభుత్వం కానుకను పంపిణి చేస్తున్న విషయం తెలిసిందే. సుమారు 2.20 కోట్ల కుటుంబ కార్డు దారులు(రేషన్ – బియ్యంకార్డు), పునరావాస శిబిరాలలోని ఈలం తమిళులందరికీ ఈ కానుక వర్తింప చేస్తున్నారు. రాష్ట్రంలోని 36 వేల రేషన్ దుకాణాల ద్వారా ఈ కానుకల పంపిణికి ప్రతి ఏటా అందిస్తున్నారు. అయితే ఈ ఏడాది కానుక అందలేదు. ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో బియ్యం, చక్కెర, చెరకు వంటి వాటితో పాటూ ఉచిత చీర దోవతి పంపిణీతో మమా అనిపించారు. రానున్న సంక్రాంతికి ఏకంగా రూ.3 వేలు ఇచ్చే అవకాశాలు ఉన్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. అసెంబ్లీ ఎన్నికలకు ముందుగా వచ్చే సంక్రాంతి పర్వదినం కావడంతో ఈసారి ప్రజలను ఆకర్షించే దిశగా రూ. 3 వేలు ఇచ్చే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. తొలుత రూ. 5 వేలు ఇవ్వాలని భావించినా, ఖజానాపై ఆర్థిక భారం పడుతుందని గ్రహించి, కాస్త తగ్గించినట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఈనగదు కానుకతో పాటూ పొంగలి తయారీకి ఉపయోగించే అన్ని రకాల వస్తువులతో కిట్‌ను సైతం అందించే దిశగా సీఎం స్టాలిన్ పరిశీలిస్తున్నట్టు సచివాలయం వర్గాలు పేర్కొంటున్నాయి. కాగా, ఈసారి రూ. 5 వేలు చొప్పున నగదు ఇవ్వాలని ఇప్పటికే అన్నాడీఎంకే ప్రధానకార్యదర్శి పళణి స్వామి డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.


