మేనిఫెస్టో కసరత్తుల్లో డీఎంకే
న్యూస్‌రీల్
2026 అసెంబ్లీ ఎన్నిలకు మేనిఫెస్టో రూపకల్పన కోసం డీఎంకే కసరత్తు ప్రారంభించింది. డీఎంకే డిప్యూటీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ కనిమొళి కరుణానిధి నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ తొలి సమావేశం సోమవారం చైన్నెలో జరిగింది. ఈసారి మరింత జనరంజకంగా మేనిఫెస్టో ఉంటుందని కనిమొళి ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
సాక్షి,చైన్నె: ఎన్నికల సమరానికి సమాయత్తమయ్యే రాజకీయ పార్టీలకు మేనిఫెస్టో అత్యంత కీలకం. వారు ఇచ్చే వాగ్దానాలే ఓటర్లకు కీలకంగా ఉండడం జరుగుతోంది. ఇందులో తాజాగా డీఎంకే ముంజంలో ఉంటోంది. పదేళ్ల అనంతరం 2021లో అధికారాన్ని చేజిక్కించుకున్న ద్రావిడ మోడల్ సీఎం స్టాలిన్, తాను ఇచ్చిన వాగ్దానాలలో మెజారిటీ శాతాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. ఇందుకు ప్రతి ఫలంగా స్థానిక సంస్థలు, నగర పాలక సంస్థలు, లోక్‌సభ ఎన్నికలలోనూ డీఎంకే కూటమి విజయ ఢంకా మోగిస్తూ వస్తోంది. ప్రస్తుతం 2026 అసెంబ్లీ ఎన్నికల ద్వారా మళ్లీ అధికారమే లక్ష్యంగా ద్రావిడ మోడల్ 2.ఓ ప్రభుత్వం అన్న నినాదాంతో సీఎం స్టాలిన్ ముందుకెళ్తున్నారు. దీనికి మరింత బలాన్ని చేకూర్చుకునేందుకు మేనిఫెస్టో రూపకల్పనపై దృష్టి పెట్టారు. మరింత ప్రజాకర్షణ దిశగా ఈ సారి మేనిఫెస్టోను తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టారు.
తొలి సమావేశం..
మేనిఫెస్టో రూపకల్పన కోసం నియమించిన కమిటీ సోమవారం చైన్నెలో తొలి సారిగా సమావేశమైంది. ఎంపీకనిమొళి నేతృత్వంలో ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కమిటీలోని మంత్రులు కోవి చెలియన్, పీటీఆర్ పళణి వేల్ త్యాగరాజన్, టీఆర్‌బీ రాజ, అధికార ప్రతినిధి టీకేఎస్ ఇళంగోవన్, మైనారిటీ నేత ఎంఎం అబ్దుల్లా, అనుబంధ విభాగాలకు చెందిన నేతలు రవీంద్రన్, ఎలిళన్ నాగనాథన్, కార్తికేయ శివసేనాధిపతి, తమిళరసి రవికుమార్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సంతానం, వ్యాపార రంగానికి చెందిన దురై సంబంధం వంటి వారు హాజరయ్యారు. ముందుగా ఈ కమిటీతో డీఎంకే అధ్యక్షుడు, సీఎం స్టాలిన్ సమావేశమయ్యారు. అనంతరం అన్నా అరివాలయం సమావేశ మందిరంలో ఈ కమిటీ పలు అంశాలపై చర్చించింది. గత మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాలు, అమలైన పథకాలు,ప్రగతి ప్రాజెక్టు గురించి సమీక్షించారు. వివిధ సామాజిక వర్గాల వారీగా అమల్లో ఉన్న పథకాలను పరిశీలించారు. ఈ పథకాల కొనసాగింపుతో పాటూ మరింత బృహత్తరంగా పథకాలను, అంశాలను మేనిఫెస్టోలో పొందు పరిచేందుకు సిద్ధమయ్యారు. తదుపరి సమావేశానంతరం ఈ కమిటీ రాష్ట్రవ్యాప్తంగా పర్యటించనుంది. అన్ని జిల్లాలో వివిధ రంగాలలోని, వారిని సామాజిక వర్గాల ప్రతినిధులు తదితరులతో భేటీ కానుంది. వారి అభిప్రాయాలను సేకరించనుంది. పార్టీ నాయకులతో నూ స్థానికంగా చర్చించి, కీలక అంశాలపై దృష్టి పెట్టనుంది.ఈ సమావేశానంతరం కనిమొళి మీడియతో మాట్లాడుతూ, ఈసారి కమిటీలో కొన్ని కీలక శాఖలకు చెందిన మంత్రులు కూడా ఉన్నారని గుర్తుచేశారు. ఈ దృష్ట్యా, ఆ శాఖలు మరింత బలోపేతం కావడమే కాదు, ఆ శాఖల ద్వారా మరిన్ని ప్రాజెక్టులు, పథకాలు అమల్లోకి వచ్చే విధంగా మేనిఫెస్టో రూపకల్పన జరుగుతోందన్నారు. ప్రధానంగా ఉద్యోగ అవకాశాల కల్పన, మహిళా హక్కుల పరిరక్షణ, తమిళనాడులోని అన్నివర్గాలకు భరోసా, సమగ్ర ప్రగతిని కాంక్షించే జన రంజకంగా మేనిఫెస్టో ఉంటుందని వ్యాఖ్యానించారు.


