జిల్లా కమిటీ పదవులకు బేరాలు
సాక్షి, చైన్నె: టీఎన్‌సీసీలో జిల్లాల అధ్యక్షులు కమిటీ అధ్యక్షుడితోపాటూ ఇతర నిర్వాహకుల ఎంపికకు పెద్ద ఎత్తున నోట్ల బేరాలు సాగినట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇందుకు అద్దం పట్టే విధంగా పార్టీకి చెందిన ఎమ్మెల్యే రాజేష్‌కుమార్ తాజాగా చేసిన వ్యాఖ్యలు చర్చకు దారి తీశాయి. వివరాలు.. తమిళనాడు కాంగ్రెస్‌లో పార్టీ పరంగా 77 జిల్లాల ఉన్న విషయం తెలిసిందే. ఇందులో 10 జిల్లాలకు అధ్యక్షులు లేరు. మిగిలిన జిల్లాలకు పది నుంచి 15 సంవత్సరాల పాటూ పాతుకు పోయిన వారే ఉంటూ వస్తున్నారు. కొత్త వారికి అవకాశం ఇవ్వాలన్న నినాదం గత కొంత కాలంగా మిన్నంటుతూ వస్తోంది. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా సెల్వ పెరుంతొగై పగ్గాలు చేపట్టిన అనంతరం జిల్లా కమిటీలలో మార్పునకు సంబంధించిన కసరత్తు చేపట్టారు. అయితే ఏఐసీసీ ఆమోదం కోసం ఎదురు చూడాల్సి వచ్చింది. రాష్ట్ర కాంగ్రెస్‌లో ఉన్న గ్రూపుల దృష్ట్యా, ఆయా గ్రూపుల నుంచి ప్రతినిధులతో జిల్లా కమిటీల ఎంపికనకు ఓ కమిటిని గత నెల ఏఐసీసీ నియమించింది. మొత్తం 35 మందితో కూడిన ఈ కమిటీ జిల్లాల కమిటీ నిర్వాహకుల ఎంపికపై దృష్టి పెట్టింది. నాలుగు వారాల పాటూ ఈ కమిటీ రాష్ట్రవ్యాప్తంగా పర్యటించింది. జిల్లాల వారీగా పదవుల ఎంపిక కసరత్తు జాబితాను సిద్ధం చేసింది. అయితే అనేక కీలక జిల్లాలలో పదువులకు నోట్ల భేరం అన్నది సాగినట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇందుకు అద్దం పట్టే విధంగా పలు జిల్లాలోని నేతలు స్పందించడం మొదలెట్టారు. పదువులకు లక్షలలో బేరం అంటూ కొన్ని జిల్లాలకు చెందిన ద్వితీయ శ్రేణి నేతలు సామాజిక మాధ్యమాలలో స్పందించడం వివాదానికి దారి తీసింది. ఈ పరిస్థితులలో 6 వేల మంది పేర్లతో ఈ కమిటీ జాబితాను సిద్ధం చేసి ఢిల్లీకి తీసుకెళ్లినట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఈ సమయంలో ఆ జాబితాను రద్దు చేయాలని, కొత్త జాబితాను సిద్ధం చేయాలంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజేష్‌కుమాఱ్ స్పందించడం టీఎన్‌సీసీలో చర్చకు దారితీసింది.


